bricks worker
-
కరోనా కాటు: ఇటుకల బట్టీలో ఫుట్‌బాల్ కెప్టెన్
వెబ్‌డెస్క్: పైన ఫొటోలో ఉన్న అమ్మాయి పేరు సంగీతా సోరెన్. ఊరు జార్ఖండ్‌లోని ధన్‌బాద్ జిల్లా బాసమూది. వయసు ఇరవై ఏళ్లు. లాక్డౌన్ ప్రభావంతో ఇలా ఇటుకల బట్టీలో పనిచేస్తుంది. లేకుంటే ఆపాటికి ఫుట్‌బాల్ స్టార్‌గా వెలిగిపోయేదేమో! అవును.. సంగీత మంచి ఫుట్ బాల్ ప్లేయర్. 2018–19లో భూటాన్, థాయ్ లాండ్ లో జరిగిన అండర్17,అండర్18 పోటీలకు కెప్టెన్‌గా వ్యవహరించింది. మంచి పర్ఫార్మెన్స్తో సీనియర్ టీమ్‌కు సెలక్ట్ అయ్యింది. టీంలో చేరుతుందనుకున్న టైంకి కరోనా మహమ్మారి వచ్చిపడింది. కుటుంబం ఆర్థిక స్థితి బాగోలేదు. పైగా ఆమె తండ్రి దూబా సోరెన్ కు కళ్లు లేవు. కూలి పనిచేసి జీవితాన్ని నెట్టుకొచ్చే అన్నకు.. లాక్డౌన్ ప్రభావంతో పని దొరకడం కష్టంగా మారింది. దీంతో కుటుంబ భారాన్ని తానే మోస్తోంది సంగీత. ప్రాక్టీస్ ఆపలేదు తల్లితో కలిసి బట్టీలో ఇటుకలు మోసే పనిచేస్తోంది సంగీత. ఫుట్‌బాల్ కెప్టెన్‌గా రాణించిన సంగీతకు ప్రోత్సాహం అందిస్తామని, ఆమె కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని స్వయంగా ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గతంలో ప్రకటించాడు. ఆ హామీ ఇప్పటివరకు నెరవేరలేదు. స్థానిక ఎమ్మెల్యే కూడా తమను సంప్రదించలేదని ఆమె తండ్రి దూబా వాపోయాడు. జార్ఖండ్‌లో మంచి ప్లేయర్స్ ఉన్నారని, ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేకపోవడం వల్లే పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నారని సంగీత అంటోంది. అయినప్పటికీ తనకు ఎన్ని కష్టాలు ఎదురైనా ఫుట్ బాల్‌ను వదిలేది లేదని చెబుతోంది. పనికి పోయే ముందు రోజూ ఉదయం పొలాల్లో సంగీత తన ఆటకు మెరుగులు దిద్దుకుంటోంది. -
కూలి డబ్బులు అడిగినందుకు.. కార్మికులపై దాడి
సాక్షి, వరంగల్ : తమ కూలీ డబ్బులు చెల్లించాలని అడిగినందుకు అనుచరులతో కలిసి యజమాని కార్మికులపై దాడి చేయించిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. ఖిలా వరంగల్ మండలం నక్కలపెల్లి గ్రామంలో ఒడిశాకు చెందిన కొంతమంది కూలీలు ఇటుక బట్టిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తమ కూలీ డబ్బులు చెల్లించాలని యాజమాని శ్రీనివాస్‌ను కోరారు. దీంతో కోపోద్రుక్తుడైన యజమాని, తన అనుచరులతో కలిసి కార్మికులపై దాడికి తెగబడ్డాడు. కాగా వెంటనే కార్మికులందరు మామూనూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని యజమాని శ్రీనివాస్ నాయుడుపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు మండల తహశీల్దార్ కిరణ్ కుమార్, సీఐ సార్ల రాజు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన కార్మికుల వివరాలను సేకరించారు, అనంతరం యజమానిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
‘పేట’ నిండా ‘బట్టీ’లే!
శివ్వంపేట(నర్సాపూర్): మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా ఇటుకబట్టీలు ఏర్పాటు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటైన ఇటుకబట్టీలపై సంబంధిత శాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వీరి వ్యాపారం దర్జాగా కొనసాగుతోంది. మండలంలోని కొత్తపేట గ్రామంలో సుమారు 30నుంచి 40వరకు ఇటుక బట్టీలు ఏర్పాటు చేసి పనులు చేస్తున్నా పట్టించుకున్న అధికారులే లేరు. నిబంధనలకు పాతర నిబంధనల ప్రకారం ఇటుకబట్టీలు ఏర్పాటు చేయాల్సి ఉండగా సంబంధిత వ్యాపారులు ఇవేమీ పట్టించుకోకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు. బట్టీల్లో వాడేందుకు కలపతోపాటు తయారీకోసం మట్టిని స్థానిక చెరువులు, కుంటలు, పొలాల్లో నుంచి తరలిస్తున్నారు. సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, అటవీ, విద్యుత్, మైనింగ్ శాఖల సిబ్బంది కనుసైగల్లోనే వీరి వ్యాపారం జరుగుతోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉచిత విద్యుత్ దుర్వినియోగం వ్యవసాయ బోరుబావుల కోసం ప్రభుత్వం ఇస్తున్న ఉచిత విద్యుత్ అక్రమ దారి పడుతోంది. బట్టీల సమీప ప్రాంతాల్లో ఉన్న వ్యవసాయ బోర్లను యథేచ్ఛగా ఇటుక బట్టీల కోసం వినియోగించుకుంటున్నారు. ఆయా బోర్లకు వచ్చే ఉచిత విద్యుత్ ద్వారానే వీటికి నీటి సరఫరా జరుగుతోంది. అయినా సంబంధిత విద్యుత్‌శాఖ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. శిఖం భూమి నుంచి దర్జాగా మట్టిని తరలిస్తున్నా సంబంధిత ఇరిగేషన్ శాఖ చూసీచూడనట్టు వ్యవహరిస్తోంది. పట్టా, ప్రభుత్వ భూముల్లో బట్టీల నిర్వహిస్తున్నా రెవెన్యూ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. విలువైన కలప బట్టీల్లో వినియోగిస్తున్నా సంబంధిత అటవీశాఖ చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇతర రాష్ట్రాల కూలీలతో.. ఇటుకబట్టీల వ్యాపారులు ఒడిశా, చత్తీస్‌గఢ్, బీహార్ ప్రాంతాలకు చెందిన కూలీలతో బట్టీల్లో పనిచేయించుకుంటున్నారు. వీరి కుటుంబాల్లో ఉన్న బాలకార్మికులతో సైతం పనులు చేయించుకుంటున్నారు. వెల్దుర్తి–నర్సాపూర్ ప్రధాన రోడ్డుకు ఆనుకొని బట్టీలు ఏర్పాటు చేయడంతో వాటిని కాల్చేటప్పుడు వచ్చే కాలుష్యంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డుకు ఆనుకొని అక్రమ వ్యాపారం జరుగుతున్నా సంబంధిత శాఖల సిబ్బంది ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బట్టీలపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దృష్టికి రాలేదు : మండలంలో అక్రమంగా వెలసిన ఇటుక బట్టీల గురించి నా దృష్టికి రాలేదు. కొత్తపేటలో వెలసిన ఇటుక బట్టీలను పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటాం. – తహసీల్దార్ భానుప్రకాష్ -
సంక్షోభంలో ఇటుక పరిశ్రమ
పశ్చిమగోదావరి, పెరవలి: తయారైన ఇటుకలు అమ్ముడవ్వక కొత్త ఇటుక తీయడానికి వాతావరణం అనుకూలించకపోవడంతో ఇటుక పరిశ్రమలపై ఆధారపడిన వందలాది కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయి. కూలీలకు పనులు లేక బట్టీ యజమానులకు ఇటుకలు అమ్ముడవ్వక నానా అగచాట్లు పడుతున్నారు. ఇటుకకు డిమాండ్ లేకపోవటంతో తీత తీసిన ఇటుకలు అమ్ముడవ్వక యజమానులు గగ్గోలు పెడుతున్నారు. దీనికితోడు నిర్వహణ భారం పెరిగిపోవడంతో ఈపరిశ్రమ నిర్వహణదారులు బట్టీలను నిర్వహించాలో మానాలో తెలియని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో 40 వేల మందికి జీవనాధారం జిల్లాలో ఈ పరిశ్రమలపై 4,500 కుటుంబాలు వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తుండగా, 40 వేల మంది ఈపరిశ్రమలపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారు. ఏటా ఇటుక తీత పనులు సెప్టెంబర్‌లో మొదలుపెట్టి నవంబర్‌లో ఇటుక ఆవలు కాల్చడానికి సిద్ధం చేస్తారు. పెరవలి మండలంలో 120 ఇటుక పరిశ్రమలు ఉండగా ఉండ్రాజవరం మండలంలో 80, నిడదవోలులో 120, పెనుగొండలో 95, ఇరగవరం మండలంలో 85 పరిశ్రమలు ఉన్నాయి. జిల్లాలో ఈపరిశ్రమలు సుమారుగా 4 వేల వరకు ఉన్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం కరువు గత ఏడాదిగా ఇటుక బట్టీ పరిశ్రమ తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కోవడంతో నిర్వాహకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఏడాది మార్చి వరకు ఒడుదుడుకులు ఎదుర్కొన్నా ఏప్రిల్, మే నెలల్లో ఇటుక ధర రూ.7500 పలికింది. ప్రస్తుతం రూ.6500 ఆవ వద్ద ఉంది. దీనితో అప్పటి వరకు నష్టాల్లో ఉన్న పరిశ్రమ లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుతం వర్షాకాలం అవ్వడంతో గృహ నిర్మాణాలు వేగం లేక ఇటుకల విక్రయం మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఇటుక పరిశ్రమదారులకు ప్రోత్సాహం ఇవ్వడం లేదంటున్నారు నిర్వాహకులు. బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వకపోవడంతో వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నానా అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. పెరిగిన ముడిసరుకుల ధరలు ఇటుక తయారీకి వినియోగించే ముడి సరుకుల ధరలు పెరగడంతో ఇటుక ధరలు పెంచాల్సి వచ్చిందని యజమానులు చెబుచున్నారు. గత ఏడాది బొగ్గు టన్ను రూ.4 వేలు ఉండగా ప్రస్తుతం రూ.5 వేలకు చేరుకుందని, పుల్లలు(టన్ను) రూ.1800లు ఉండగా నేడు రూ.2500 అయ్యాయని, బొండు 5 టన్నులు గత ఏడాది రూ.5 వేలు ఉండగా ప్రస్తుతం రూ.10 వేలు పలుకుతోందని తెలిపారు. ఊక రూ.2100 నుంచి రూ.3 వేలకు చేరుకుందని చెప్పారు. ప్రస్తుతం 1000 ఇటుక రూ.6500 ధర పలుకుతోందన్నారు. ప్రస్తుత ధరలు నిలకడగా ఉంటేనే నష్టాలు రాకుండా ఉంటాయని చెబుతున్నారు. రూ.2 లక్షలు నష్టం వచ్చింది ప్రకృతి వైపరీత్యాలతో ఈఏడాది మేలో కురిసిన వర్షాలకు రూ.రెండు లక్షలు నష్టం వచ్చింది. ఆ తరువాత ధర పెరగటంతో నష్టాలు పూడ్చుకున్నాం. ప్రస్తుతం ధరలు తగ్గినా కొనుగోలు లేకపోవటంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాం.–మోపిదేవి సోమేశ్వరరావు,ఇటుకబట్టీ యజమాని, మల్లేశ్వరం -
ఇటుక బట్టీ యజమాని దాష్టీకం
కొత్తపల్లి(కరీంనగర్) : పొట్టకూటి కోసం వలస వచ్చిన కార్మికులపై ఓ ఇటుక బట్టీ యజమా ని కర్కశంగా ప్రవర్తించాడు. ఆడ, మగ అని చూడకుండా తీవ్ర చిత్రహింసలకు గురిచేశా డు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట శివారులోని వీబీఐ ఇటుకబట్టీలో చోటుచేసుకుంది. కార్మిక సం ఘాల సహకారంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు 18 మందికి విముక్తి కలిగించారు. వీరిలో 11 మంది కూలీలు, ఏడుగురు చిన్నారులున్నారు. ఏం జరిగిందంటే.. ఒడిశా రాష్ట్రం బొలంగిర్ జిల్లా బెల్‌పడా మండలం గగ్రూలీ గ్రామానికి చెందిన హిమాన్షు చురా, భానుచురా, జుగే చురా, రమేష్ మహందా, ముని తండి, రాజబంటి చురా, రాణిమహందా, ఆశిష్ మహందా, పట్నాగర్ మండల కేంద్రానికి చెందిన అశోక్ సునా, తుర్కెలా మండలం కాంటాబాంజీ గ్రామానికి చెందిన లలితా పణిక, గోపాల్ పణిక, సీమ పణిక, భాస్కర సునా, సునిలీ సుర , రాజు పనిక మమతా మహానంద్, డొబో మహందా, ఆశిమహందాలు గత నవంబర్‌లో జీవనోపాధి కోసం చింతకుంట శివారులోని వీబీఐ ఇటుక బట్టీల కంపెనీలో కూలీలుగా చేరారు. ఒడిశాకు చెందిన సర్ధార్ గణేష్ అనే బ్రోకర్ వీబీఐ కంపెనీ యజమాని నారాయణరావుతో ఒప్పందం కుదుర్చుకొని కొంత మొత్తాన్ని కార్మికులకు అడ్వాన్స్‌గా అందించాడు. యజమాని చిత్రహింసలు పనిలో చేరినప్పటి నుంచి నారాయణరావు కూలీలను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశాడు. పనికి ఒత్తిడిచేయడం, జ్వరం వచ్చిన పట్టించుకోకుండా దాడిచేశాడు. దీంతో వారు ఒడిశాకు చెందిన శ్రామిక అధికార్ మంచ్ కార్మిక సంఘానికి ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న సదరు యజమాని వారివద్దనున్న సెల్ఫోన్లు లాక్కుని బ్రోకర్‌కు సమాచారమిచ్చారు. బ్రోకర్ గణేశ్ ఇక్కడకు చేరుకుని 18 మందిని గోదావరిఖని గంగానగర్‌లో ఉన్న జీఎల్‌కే ఇటుక కంపెనీకి తరలించాడు. స్పందించిన కార్మిక సంఘాలు ఈ విషయమై స్థానిక తెలంగాణ వ్యవసాయ వృత్తిదారుల యూనియన్ నాయకులు జిల్లా కార్మిక అధికారికి డిసెంబర్ 31న ఫిర్యాదు చేశారు. వారు పట్టించుకోకపోవడంతో కరీంనగర్ అడిషనల్ సీపీకి ఫిర్యాదు చేయడంతో టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. సోమవారం రాత్రి వారికి పనిస్థలం నుంచి విముక్తి కలిగించారు. రేకుర్తిలోని సాయిమహాలక్ష్మీ గార్డెన్స్‌లో ఆశ్రయం కల్పించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించి వాంగ్మూలం స్వీకరించారు. యజమాని నారాయణరావుపై కేసు నమోదు చేíసినట్లు ఎస్సై పి.నాగరాజు తెలిపారు. కార్మికులకు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. చైల్డ్ లేబర్ ఆక్ట్ కింద మరో కేసు ఒడిశా కార్మికులకు చెందిన మైనర్ పిల్లలను చిత్రహింసలకు గురిచేయడంతో పాటు వారిని అక్రమంగా నిర్బంధించినందుకు చైల్డ్ లేబర్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఫర్వీన్ తెలిపారు. -
ఇటుక మాఫియా!
‘కార్మికుల పరిస్థితి అధ్వానంగా ఉంది..యజమానులు మోబైల్ ఫోన్లు లాక్కున్నారట.. బయటకు వెళ్లొద్దట.. ఎవరితోనూ మాట్లాడొద్దట.. పనిచేసేది ఎక్కువ...వేతనం తక్కువ.. పైగా తిట్టడం.. కొట్టడం.. పరిస్థితి దుర్భరంగా ఉంది.’ ఇది ఇటీవల పెద్దపల్లికి వచ్చిన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లేబర్ ఇన్స్పెక్టర్ మనోజ్ మండలేశ్వర్ ఇటుకబట్టీల్లో వలస కూలీల దుస్థితిపై వెలిబుచ్చి న ఆవేదన. రాఘవాపూర్‌లోని ఏబీఎస్ బ్రిక్ ఇండస్ట్రీ ఒక్క ఇటుకబట్టీని చూసి ఆయన చెప్పిన అభిప్రాయం జిల్లాలోని మెజార్టీ ఇటుక బట్టీల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. సాక్షి, పెద్దపల్లి: సాధారణంగా ల్యాండ్, సాండ్ మాఫియాను ఎక్కువగా చూస్తుంటాం. కానీ.. ఇటుక మాఫియా ఆగడాలు అంతా ఇంతా కావు. జిల్లాలో దాదాపు 70 వరకు ఇటుక బట్టీలున్నాయి. ఈ బట్టీల్లో కనీసం ఐదు నుంచి ఆరు వేల మంది ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు ఉన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన, స్థానికంగా పలుకుబడి ఉన్న వాళ్లు ఇటుకబట్టీలను నిర్వహిస్తున్నారు. ఇందులో నిబంధనలకు అనుగుణంగా వ్యాపారం నిర్వహించే వాళ్లు కొద్ది మందే. కానీ.. మెజార్టీ బట్టీల్లో నిబంధనల ఊసే ఉండదు. కార్మిక చట్టాల మాటే తెలవదు. వలస కార్మికులు కావడంతో వెట్టిచాకిరి ఇక్కడ సర్వసాధారణంగా మారింది. కార్మికులు కుటుంబాలతో వస్తారు కాబట్టి, పిల్లలుంటారని పైకిచెబుతున్నా.. ఆ బాలలను కార్మికులుగా మార్చే ఘనత ఇటుక బట్టీల యజమానులదే. కనీస వేతనం అనే పదమే ఇక్కడ వినిపించదు. వారిచ్చిందే వేతనం.. చెప్పిందే శాసనం. వినని కార్మికులను చితకబాదడం ఇక్కడి యజమానుల నైజం. దౌర్జన్యాలు నిత్యకృత్యం. గతంలో లైంగిక దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. ఇక్కడి ఇటుక ఉభయరాష్ట్రాల మార్కెట్లో మంచి డిమాండ్ ఉండడంతో, కోట్ల రూపాయల వ్యాపారం సాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి కూడా ఇక్కడి నుంచి ఇటుకలు వెళుతుండడం డిమాండ్‌ను తెలియచేస్తోంది. కోట్ల రూపాయల్లో వ్యాపారం జరుగుతుండడం, బట్టీల్లో అకృత్యాలు నిత్య కృత్యం కావడంతో వీరికి స్థానిక నాయకుల నుంచి జాతీయస్థాయి నేతల వరకు అందరితోనూ సత్సంబంధాలుంటాయి. ఇటుకబట్టీలకెవరైనా వెళ్తే ఆ బెదిరింపులు సామాన్యంగా ఉండవు. అసలు ఇటుక బట్టీల లోపలికి వెళ్లడమే అసాధ్యం. లోనికి అడుగు పెట్టగానే, అనుమానపు చూపులు వెంటాడుతుంటాయి. ఆ వెంటనే పదుల సంఖ్యలో వచ్చి చుట్టుముడుతారు. ఎందుకు వచ్చారు? ఏం కావాలంటూ ఉచ్చస్వరంతో భయానక వాతావరణాన్ని సృష్టిస్తారు. ఫొటోలు తీస్తే .. ఆ కెమెరాతో బయటకు వెళ్లడం మరిచిపోవాల్సిందే. వెళ్లిన వాళ్లకు సంబంధించిన పైస్థాయి నుంచి క్షణాల్లో ఫోన్లు వస్తుంటాయి. దౌర్జన్యాలకు పాల్పడుతారు. ఇటుకబట్టీలకు వెళ్లే సాహసం కూడా ఎవరూ చేయరు. అధికారులకు మామూలే... కార్మిక చట్టాలను అమలు చేస్తూ, కార్మికుల సంక్షేమాన్ని చూడాల్సిన, దౌర్జన్యాలను అరికట్టాల్సిన అధికారులు ఇటుక మాఫియాతో కుమ్మక్కయ్యారనే ఆరోపణలున్నాయి. నిర్బంధ కార్మికులకు విముక్తి కల్పించడానికి ఛత్తీస్‌గఢ్ బృందం వచ్చినప్పుడు, స్థానిక అధికారులు వ్యవహరించిన తీరు ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. కార్మికులను తీసుకెళ్లకుండా ఛత్తీస్‌గఢ్ బృందాన్ని నిలువరించేందుకు ఆ అధికారులు పడినపాట్లు చూసి ఇతర అధికారులే విస్మయానికి గురయ్యారు. అడ్వాన్స్‌లు తీసుకొన్న కార్మికులను పంపొద్దంటూ ఛత్తీస్‌గఢ్ అధికారులను కూడా ఆ అధికారులు ఒప్పించే ప్రయత్నం చేసి విఫలమయ్యారు. చివరకు జిల్లా సంక్షేమశాఖాధికారులు వారితో స్వల్ప వాదనకు కూడా దిగడం విశేషం. బాలకార్మికులు కనిపించడంతో ‘వాళ్లు లంచ్‌కు ఇంటికి వచ్చుంటారేమో’ అని నమ్మబలికేందుకు చేసిన ప్రయత్నాన్ని సహచర అధికారులే ఈసడించుకున్నారు. ఇదంతా చూసి, ఇటుకబట్టీ యజమానుల కన్నా... ఆ అధికారులకే ఎక్కువ బాధ ఉన్నట్లుందంటూ వ్యాఖ్యానించడం వినిపించింది. ఇటుకబట్టీల్లో కార్మికుల నిర్బంధం కొంతమంది అధికారులకు ఎందుకు మామూలో ఊహించడం పెద్ద కష్టం కాదు. పరాయి రాష్ట్రం చెప్పినా మేల్కొనరా? జిల్లాలోని ఇటుకబట్టీల్లో కార్మికులతో నిర్బంధంగా వెట్టిచాకిరి చేయించుకొంటున్నారని పరాయి రాష్ట్రం నుంచి వచ్చిన బృందం చెప్పినా, ఇక్కడి అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అధికారులు, పోలీసులు వచ్చి, ఇక్కడి ఇటుకబట్టీల నుంచి కార్మికులను విడిపించుకొని తీసుకెళ్లడం స్థానిక పాలనకు అవమానకరంగా పలువురు పేర్కొంటున్నారు. అడ్వాన్స్‌లు ఇచ్చి తెచ్చుకున్నాం, బాలలు బడికి వెళుతున్నారు అంటూ యజమానులు ఎంతగా నచ్చచెప్పే ప్రయత్నం చేసినా.. బట్టీల్లో వాతావరణానికి వారి మాటలకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. వ్యాపారానికి కార్మికులు అవసరమే అయినా... వారికి ప్రభుత్వ పరంగా కల్పించాల్సిన సౌకర్యాలు, కనీస వేతనాలు, బాలలకు చదువు చెప్పిస్తే ఎలాంటి సమస్యా ఉండదు కదా అని కొంతమంది అధికారులు సలహా ఇస్తున్నారు. -
ఇటుకబట్టీ కూలి ముగ్గురి దుర్మరణం
సాక్షి, రామకుప్పం: చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఇటుక బట్టీ కూలి ముగ్గురు మృతి చెందారు. కర్ణాటక సరిహద్దులోని రాజుపేట శివారులో ఇటుకబట్టీలో పనిచేసే కార్మికులు మంగళవారం రాత్రి బట్టీ పక్కనే పందిరి వేసుకుని నిద్రించారు. జోరు వానకు తడిసిన ఇటుకబట్టీ తెల్లవారుజామున ఒక్కసారిగా ఒరిగిపోయి కూలిపోవడంతో నిద్రిస్తున్న ముగ్గురు దుర్మరణం చెందారు. బుధవారం ఉదయం గమనించిన స్థానికులు కార్మికుల మృతదేహాలను వెలికితీశారు. మృతులు గ్రామానికి చెందిన షుకూర్ సాబ్(60), ఫాతిమ(50), నయాజ్(5)లుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కరెంట్ షాక్ తో కార్మికుని మృతి
మంథని: కరీంనగర్ జిల్లా మంథని మండలం గంగాపూర్ గ్రామశివారులో ఉన్న ఇటుక బట్టీ వద్ద విద్యుదాఘాతంతో బూడిద శంకర్(45) అనే వ్యక్తి మృతిచెందాడు. గురువారం తెల్లవారుజామున లారీలోకి ఇటుకలు చేరుస్తుండగా ప్రమాదవశాత్తూ పైనున్న 11 కేవీ విద్యుత్ వైర్లు తగలడంతో బూడిద శంకర్ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు గోదావరి ఖని వాసిగా పోలీసులు గుర్తించారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు.