అడుగడుగునా మోసం..
సంప్రదింపులతో ప్రమేయం లేకుండా సాగుతున్న ‘ఆన్‌లైన్’ వివాహ బంధాలు దుష్ఫలితాలు కలిగిస్తున్నాయనడానికి గజ్వేల్‌లో ఆదివారం చోటుచేసుకున్న సంఘటనే తార్కాణంగా నిలుస్తోంది. పెళ్లి ఘట్టంలో వారు వేసిన ప్రతీ అడుగులో ‘మోసం’ స్పష్టంగా బయటపడటం బాధితులను కలవరానికి గురిచేసింది. విషయం బయటపడడంతో వరుడి తల్లి అరుణ, సోదరి సహా మరో నలుగురిని పోలీసులు సోమవారం రిమాండ్‌కు తరలించారు. పరారైన వరుడి కోసం అన్వేషణ ప్రారంభించారు.
జగదేవ్‌పూర్ మండలానికి చెందిన ఓ గ్రామ యువతికి తల్లిదండ్రులు ఆన్‌లైన్‌లో పెళ్లి సంబంధాల కోసం వెతకసాగారు. 2013 డిసెంబర్ నెలలో సికింద్రాబాద్‌లోని ఆర్‌కే పురానికి చెందిన విజయరాజిరెడ్డిగా పేరు చెప్పుకున్న ఓ యువకుడు తాను పెళ్లి చేసుకుంటానని ముందుకు వచ్చాడు. తనకు తండ్రి లేడని, తల్లితో పాటు ఫ్యామిలీ ఫ్రెండ్స్‌గా చెప్పుకుంటున్న మరికొందరితో అమ్మాయి కుటుంబ సభ్యులతో పరిచయం చేసుకున్నాడు. అనంతరం రూ. 40 లక్షల కట్నం కావాలని వధువు కుటుంబ సభ్యులను కోరారు.
అయితే అంత ఇచ్చుకోలేమని, చివరకు 20 తులాల బంగారం, రూ. 5 లక్షల వరకు ఇవ్వగలమని, పెళ్లి ఖర్చులు భరిస్తామని ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే డిసెంబర్ 19న గజ్వేల్‌లో నిశ్చితార్థం జరిగింది. ఈ సందర్భంగా వరుడి తల్లి అరుణకు రూ. 3.75 లక్షల అప్పగించారు కూడా. ఫిబ్రవరి 9న వివాహ ముహూర్తం నిర్ణయించారు. సమయానికి తీరా వరుడు పరారైన సంగతి తెల్సిందే.
అడుగడుగునా మోసమే....
విజయరాజిరెడ్డిగా వరుడు తనను పరిచయం చేసుకోగా అతడి పేరు అది కాదని వధువు తరఫు బంధువులు విచారణలో బయటపడింది. 9న పెళ్లి కావాల్సి ఉండగా 8న రాత్రి వరుడి తల్లి అరుణ వధువు తండ్రికి ఫోన్ చేసి చెన్నయ్‌లో తమ బంధువులు చనిపోయారని, తామంతా అక్కడికి వెళ్లాల్సి ఉన్నందు వల్ల.. పెళ్లి వాయిదా వేసుకుందామని కోరింది. దీంతో అనుమానం వ్యక్తం చేస్తూ వధువు తరఫు బంధువులు ఆర్‌కే పురానికి అదే రాత్రి వెళ్లగా వారి ఇంటి వద్ద ఎలాంటి హడావుడి కనిపించలేదు. అప్పటికే వరుడు పరారయ్యాడు. వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నిక, వారి కుటుంబానికి శ్రేయెభిలాషులుగా చెప్పుకుంటున్న గౌరీశంకర్, బాలాజీ, మహేశ్వరీ, మధుసూదన్‌రెడ్డిలను ఇక్కడికి తీసుకువచ్చారు.
తాళి కట్టే సమయానికి వరుడు వస్తాడని నమ్మబలికారు. కానీ పరిస్థితి భిన్నంగా మారడంతో వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. వరుడు ఓ ప్రైవేట్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్ అని చెప్పుకోగా అది కూడా బూటకమని తేలింది. కొన్ని ఏళ్ల కిందటి నుంచి ఆర్‌కే పురంలో ఉంటున్నామని వారు చెప్పుకోగా నిజానికి ఇటీవలే ఇక్కడ అద్దెకు దిగినట్లు బయటపడింది. ఆన్‌లైన్‌లో వివరాలు తీసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత వరుడి తల్లి అరుణ వధువు తల్లిదండ్రులతో తమ సంబంధం గురించి పూర్తి వివరాలు మీ బంధువులకు చెప్పవద్దని, చెబితే సంబంధం దెబ్బ తీయాలని చూస్తారని పదే పదే చెప్పినట్లు బాధితులు చెబుతున్నారు.
తాము ఆస్తి పరులమని, దుబాయ్, చెన్నయ్, హైదరాబాద్‌లో ఆస్తులున్నాయని నమ్మబలికి.. పెళ్లి సమయానికి ముందుగా వరుడిని పంపించి ఆ తర్వాత తామంతా పరారు కావాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అరుణ చెప్పిన మూడు అడ్రస్‌ల్లో వారి నిజమైన నివాసం ఎక్కడా అనేది ప్రశ్నార్థకంగా మారింది. విజయరాజిరెడ్డికి గతంలో పెళ్లయ్యిందా? కాలేదా? అనే విషయంపై కూడా విచారణ సాగుతోంది. వరుడి తల్లి అరుణ ఎంటెక్ వరకు చదువుకున్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యాధికురాలైన ఆ మహిళ పథకం ప్రకారం పెళ్లి తంతు పేరిట డబ్బులు గుంజడానికి ప్రయత్నించిందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. వీరిపై గతంలో ఏమైనా కేసులున్నాయా? అనే విషయంపై కూడా ఆరా తీస్తున్నారు.
నిందితుల రిమాండ్, వరుడి కోసం గాలింపు..
ఈ కేసులో సోమవారం గజ్వేల్ పోలీసులు వరుడి తల్లి అరుణ, సోదరి స్వప్నిక, గౌరీశంకర్, బాలాజీ, మహేశ్వరీ, మధుసూదన్‌రెడ్డిలను రిమాండ్‌కు తరలించారు. వరుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రధాన నిందితుడిని తొందర్లోనే పట్టుకుంటామని సీఐ అమృతరెడ్డి ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.