చెదిరిన ‘పెళ్లి కళ’ | Demonstrate the groom's face .. Stopping marriage | Sakshi
Sakshi News home page

చెదిరిన ‘పెళ్లి కళ’

Published Mon, Feb 10 2014 5:30 AM | Last Updated on Sat, Sep 2 2017 3:33 AM

చెదిరిన ‘పెళ్లి కళ’

చెదిరిన ‘పెళ్లి కళ’

మొహం చాటేసిన వరుడు.. ఆగిన వివాహం

గజ్వేల్, న్యూస్‌లైన్: మరికొద్ది సేపట్లో బాజాభజంత్రీలు మోగాల్సిన ఆ పెళ్లి మండపంలో.. ఒక్కసారిగా విచారం అలుముకుంది. తాళి కట్టాల్సిన వరుడు మొహం చాటేశాడు. సాయంత్రం వరకు ఎదురుచూసి.. ఫలితం లేక వివాహాన్ని రద్దు చేసుకున్నారు. వధువు బంధువులు ఆందోళనలో మునిగిపోయారు. మెదక్ జిల్లా గజ్వేల్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన యువతికి సికింద్రాబాద్ ఆర్‌కే పురానికి చెందిన విజయ్‌రెడ్డితో పెళ్లి కుదిరింది. ఇతను బంజారాహిల్స్‌లోని కేఎండబ్ల్యూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో హెచ్‌ఆర్ మేనేజర్.

వధువు తల్లిదండ్రులు భారీగానే కట్నకానుకలను సమర్పించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో పెళ్లి జరగాల్సి ఉంది. ఆనవాయితీ ప్రకారం శనివారం సాయంత్రం వరుడిని తీసుకురావడానికి వధువు తరపు బంధువులు ఆర్‌కేపురం వెళ్లారు. కానీ వరుడి జాడ లేదు. అప్పటికే ఇంట్లోంచి పరారయ్యాడు. ఏం చేయాలో తెలియక వరుని తల్లి అరుణ, సోదరి స్వప్న, కొందరు బంధువులను తీసుకొని ఇక్కడికి వచ్చారు. వారంతా పెళ్లి సమయానికి విజయ్‌రెడ్డి వస్తాడని నమ్మబలికారు.

తాళి కట్టే సమయానికైనా రావచ్చనే ఆశతో మండపాన్ని తీర్చిదిద్దడమే కాక భోజన ఏర్పాట్లు చేశారు. సాయంత్రం వరకు కూడా వరుని జాడ లేదు. ఫోన్ చేసినా కలవలేదు. అతని తల్లిని, బంధువులను నిలదీస్తే తమకేం తెలియదని చేతులెత్తేశారు. వారిపై వధువు తరపు బంధువులు దాడి చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వచ్చి సర్దిచెప్పారు. పెళ్లి ఆగిపోవడంతో వధువు తల్లిదండ్రులు, బంధువులు విచారంలో మునిగిపోయారు. వధువు తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గజ్వేల్ ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement