కొత్తదంపతులు నాగ చైతన్య , శోభితా ధూళిపాళ ఇటీవల న్యూయార్క్ టైమ్స్‌కి ఇంటర్వ్యూ
అక్కినేని అందగాడు హీరో నాగ చైతన్య, హీరోయిన్ శోభితా ధూళిపాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. పెళ్లయి పక్షం రోజులు గడుస్తున్నా ఇంకా పెళ్లి ముచ్చట్టుసోషల్‌మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి.
తాజాగా ఈ లవ్‌బర్డ్స్‌ని ఇంటర్వ్యూ చేసి, వారి ప్రేమ ప్రయాణం గురించి ఆంగ్ల పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీన్ని నాగచైతన్య రెండో భార్య శోభిత తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. అలాగే తెలుగు భాష ఔన్నత్యాన్ని గురించి కూడా కమెంట్ చేసింది. దీంతో న్యూయార్క్ టైమ్స్ కథనం వైరల్‌గా మారింది.
ఈ ఇంటర్వ్యూలో నాగ చైతన్య చాలా విషయాలను పంచుకున్నాడు. ముఖ్యంగా శోభితతో తన ప్రేమ, ఆమెపై అభిమానాన్ని పెంచుకోవడానికి గల కారణాలను షేర్ చేశాడు. శోభిత నిజాయితీ తనకు బాగా నచ్చిందని కామెంట్ చేశాడు. తాను పుట్టింది హైదరాబాదులోనే అయినా పెరిగింది మొత్తం చెన్నైలోనే అనీ, అందుకే తనకు తెలుగు సరిగ్గా రాదని చెప్పుకొచ్చాడు. శోభిత తెలుగు, తనను ఆమెకు మరింత దగ్గరి చేసిందని వెల్లడించాడు. ఆమె స్వచ్ఛమైన తెలుగు, తనను మూలాల్లోకి తీసుకెళ్లిందని అదే ఆమెకు దగ్గరి చేసిందని తెలిపాడు. మాతృభాషలోని వెచ్చదనం తమ ఇద్దరి మధ్యా ప్రేమను చిగురింప చేసిందన్నాడు నాగ చైతన్య.
శోభితా ప్రేమలో ఎలా పడ్డాడో వివరిస్తూ ఆమె‘మేడ్ ఇన్ హెవెన్ స్టార్' ఆమె మాటలు చాలా లోతుగా ఉంటాయి అంటూ భార్యను పొగడ్తల్లో ముంచెత్తాడు. ఆమె నిజాయితీతో తాను ప్రేమలో పడిపోయానని వెల్లడించాడు. శోభిత సోషల్‌మీడియా పోస్ట్‌లు ఆమె వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి అని పేర్కొన్నాడు. అంతేకాదు ఆమె పోస్ట్ చేసే బ్లర్ ఫోటోలే తనకిష్టం, అంతేకానీ, గ్లామర్ కోసం, ప్రచారం కోసం పీఆర్ టీం చేసే ఫోటోలు కాదంటూ వ్యాఖ్యానించాడు.
సినిమా షూటింగ్‌లో ఉండగానే రెండు నెలల్లో తన పెళ్లిని ప్లాన్ చేసుకున్నట్లు శోభితా ధూళిపాళ వెల్లడించింది. ఇద్దరమూ మాట్లాడుకుని, ప్రధానంగా చైతన్య కోరికమేరకు సన్నిహితుల సమక్షంలో చాలా సింపుల్‌గా, సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నామని చెప్పింది. తమ వివాహం ఆధ్మాత్మికంగా, దేవాలయం అంత పవిత్ర భావన కలిగిందంటూ తన పెళ్లి ముచ్చట్లను పంచుకుంది. దీంతో నెటిజన్లు విభిన్నంగా స్పందిస్తున్నారు.
కాగా డిసెంబర్ 4 న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ వివాహం వైభంగా జరిగింది. అంతకుముందు ఆగష్టు 8న నిశ్చితార్థం వేడుకతో తమ బంధాన్ని అధికారికంగా ప్రకటించారు. శోభితతో పెళ్లికిముందు టాలీవుడ్ హీరోయిన్ సమంతాను ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య , ఆ తర్వాత ఆమెకు విడాకులిచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment