‘ఎందుకో ఆ విధి నాపై పగబట్టింది.. ఏ మాయదారి రోగాన్నో అంటగట్టింది.. నిలబడనీయదు.. కూర్చోనీయదు.. వేళ్లు వంకర్లు పోతుంటాయి..మాట కూడా పడిపోతోంది.. నేను బతకలేకున్నా.. మమ్మీ..డాడీ.. ఈ బాధ భరించలేను.. మీ వేదన చూడలేను.. ఎలాగైనా నన్ను.. మామూలుదాన్ని చేయండి.. ప్లీజ్..’ ఇదీ రెండేళ్ల క్రితం శ్రీకాళహస్తికి చెందిన అయిషాబాను తల్లిదండ్రులతో పలికిన పలుకులు... తరువాత మాట పోయింది. కాలం వెళ్లిపోతోంది. కానీ ఆ బాలిక ఆరోగ్యం మెరుగుపడలేదు.. బిడ్డకు ప్రాణం పోయడానికి ఆ తల్లిదండ్రులు పడుతున్న బాధ అంతా ఇంతా కాదు.
శ్రీకాళహస్తి టౌన్: శ్రీకాళహస్తి పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలో ఇమామ్‌వీధికి చెందిన షేక్‌గౌస్ బాషా, ఆఖ్‌తర్ బేగానికి అయిసాబాను, మీరాబాను కుమార్తెలు. షేక్‌గౌస్‌బాషా స్కిట్ ఇంజినీరింగ్ కళాశాలలో కాంట్రాక్ట్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. అయిసాబాను(14) పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో తొమ్మి దో తరగతి చదివేది. ఆంగ్లంలో అనర్గళంగా మాట్లాడేది. సరిగ్గా రెండేళ్ల క్రితం పరీక్షలు రాసే సమయంలో ఆమెకు తీవ్రమైన జ్వరం వచ్చింది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. అప్పటి నుంచి ఎన్నో ఆస్పత్రుల చుట్టూ తిరిగారు. వైద్యం కోసం అప్పులు చేసి వేలకువేలు ఖర్చుపెట్టారు. అయినా ఫలితం లేదు. స్విమ్స్, చెన్నై, హైదరాబాద్ నగరాల్లోని ఆస్పత్రులను చుట్టేశారు. రోగం నిర్థారణ అయ్యేసరికి రెండేళ్లు గడిచిపోయాయి. మెదడులో ప్రాణంతకమైన మెసల్స్ వైరస్ చేరి ప్రమాదస్థాయికి చేరిందని వైద్యులు తేల్చారు. ఈ వ్యాధికి బెంగళూరుకు సమీపంలోని హొసూర్‌లోని కేంద్ర ప్రభుత్వ జాతీయ మానసిక ఆరోగ్య నాడీశాస్త్ర ఆస్పత్రిలో వైద్యం దొరుకుతుందని సూచించారు.
గౌస్‌బాషా పలువురు స్థానికుల సహాయంతో వారిని ఫోన్‌లో సంప్రదించారు. రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వైద్య ఖర్చులు అవుతాయని, పాపను తిరిగి యథాస్థితికి తీసుకురావచ్చని అక్కడి వైద్యులు స్పష్టం చేశారు. అంత డబ్బులు పెట్టుకునే పరిస్థితి లేకపోవడంతో గౌస్‌బాషా తాత్కాలిక మందులతో కూతురు ప్రాణాలను కాపాడుకుంటున్నారు. ‘వైద్యం కోసం ఇప్పటికే అప్పులు చేసి ఎన్నో లక్షలు ఖర్చుపెట్టాను. రెండు వారాలుగా వాడకపోవడంతో అయిషా పరిస్థితి విషమిస్తోంది. దాతలు సహకరిస్తే అయిషాబాను అందరిలా అవుతుంది. ఆదుకోవాలనుకునే వారు ఫోన్ నంబర్లు 9133595937, 9966595937, స్టేట్‌బ్యాండ్ ఆఫ్ ఇండియా 33933060147కు సంప్రదించాల’ని కోరాడు.
ప్రాణం పోయండి
Published Mon, Aug 17 2015 2:50 AM | Last Updated on Sun, Sep 3 2017 7:33 AM
Advertisement
Advertisement