
అమరావతికి బ్రిటన్ మసాలా బాండ్లు
బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ మెక్ అలిస్టర్ వెల్లడి
రాజధాని నిర్మాణానికి బ్రిటన్ సహకారం కావాలన్న సీఎం
సాక్షి, అమరావతి: అమరావతి నిర్మాణానికి మసాలా బాండ్ల రూపంలో నిధులు సమకూర్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ అండ్రూ మెక్ అలిస్టర్ తెలిపారు. లండన్ స్టాక్ ఎక్స్చేంజి ద్వారా ఈ బాండ్లు ఇచ్చే అవకాశముందన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో శుక్రవారం అలిస్టర్ ఆధ్వర్యంలో ‘స్మార్ట్ సిటీ నిర్మాణ సామర్థ్యం, అనుభవం, అమరావతికి సహకారం’అనే అంశాలపై సమావేశం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ సమావేశంలో అలిస్టర్ మాట్లాడుతూ.. అమరావతి సహా దేశంలోని 8 స్మార్ట్ సిటీల నిర్మాణానికి బ్రిటిష్ ప్రభుత్వం 11 మిలియన్ పౌండ్లు వెచ్చించనుందని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రాజధాని తొలి దశ నిర్మాణానికి ప్రయత్నాలు మొదలవుతున్న తరుణంలో బ్రిటన్ సహకారం కావాల్సి ఉందన్నారు.
15న మంత్రివర్గ సమావేశం: రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 15వ తేదీన జరగనుంది. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరుగుతుంది.