సిద్దిపేట, న్యూస్‌లైన్: నోటితో ఊరడిస్తూ నొసటితో వెక్కిరించడమంటే ఇదే! రైతులు బాగుండాలని, రైతే రాజని రోజూ వక్కాణించే ప్రభుత్వం వారిపై కక్షగట్టింది. నేలతల్లినే నమ్ముకొని సమాజానికి పట్టెడన్నడం పెడుతున్న అన్నదాతలను వేధిస్తోంది. కేవలం పదిహేను నిమిషాలు రోడ్డెక్కి గొంతెత్తినందుకు కేసులు పెట్టారు. ఠాణా, కోర్టు చుట్టూ తిప్పడానికి కాగితాలను సిద్ధం చేశారు.
రోడ్డెక్కడానికి నేపథ్యమిది...
అది గత అక్టోబరు చివరి వారం. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు పలువురు రైతులు తీసుకొచ్చిన మక్కల్ని మార్క్‌ఫెడ్ ఓకే చేసింది. కానీ..పది రోజులైనా తూకం వేయక..రశీదులివ్వక తీవ్ర జాప్యం చేసింది. మరోవైపు అకాల వర్షాలతో మొక్కజొన్నలు తడిసి మొలకెత్తి పంట ఉత్పత్తిదారుల కంటిమీద కునుకును దూరం చేశాయి. అటు ఇళ్లకు వెళ్లలేక ఇటు మార్కెట్‌లో పని పూర్తవక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయారు. దీంతో గత్యంతరం లేక అక్టోబరు 28న యార్డు దగ్గర్లోని రోడ్డుపైకి వచ్చి కాసేపు ఆందోళన చేశారు. రెండు గంటల్లో సరుకులను తరలిస్తామని పోలీసుల సమక్షంలో అధికారులు మాటిచ్చారు. అందుకు నాలుగు గంటలు దాటినా ఎవరూ పత్తాలేకుండా పోయారు. దాంతో జిల్లా పాలనా యంత్రాంగాన్ని కదిలించాలన్న ఉద్దేశంతో సమీపంలోని రాజీవ్ రహదారిపైకి చేరారు రైతులు. పావుగంటపాటు రాస్తారోకో చేశారు.
అదే పాపమైందట...
బాధితులు రైతు నేతలతో కలిసి రాజీవ్హ్రదారి మీదకు చేరాల్సిన అగత్యాన్ని ఒక రకంగా వారే సృష్టించారు. ఇంతలా నిర్లక్ష్యం ఆవహించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు చేతకాని పాలకులు...రోడ్డెక్కడమే పాపమైనట్లు రైతులపై కేసులు కట్టించారు. రాకపోకలకు ఆటంకం కలిగించాలని రైతులకు మాత్రం ఎందుకుంటుంది? వాళ్లు నిరసనకు దిగడానికి నేపథ్యాన్ని, మానవీయతను సర్కారు విస్మరించింది.
16 మందిపై కేసులు
పావుగంటపాటు రాస్తారోకో చేసి ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం, వాహనాలను అడ్డుకోవడం చట్ట విరుద్ధమంటూ 188, 341 సెక్షన్ల కింద 16 మందిపై సిద్దిపేట టూటౌన్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. నర్సింహులు, నర్సయ్య, హన్మంతరెడ్డి, రామలింగారెడ్డి, రవీందర్‌రెడ్డి, భైరవరెడ్డి, రామచందర్‌రావు, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మయ్య, బాల్‌రెడ్డి, భూపతిరెడ్డి, మోహన్‌రెడ్డి, రంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కమలాకర్‌రావులు ఆ జాబితాలో ఉన్నారు. వీరిని సోమవారం పోలీసుస్టేషన్‌కు రావాలని ఆజ్ఞాపించారు.
సుమోటోగా కేసులు..
హైదరాబాద్-రామగుండం రాజీవ్హ్రదారిపై రాస్తారోకో చేసి రాకపోకలకు ఆటంకం కలిగించారు. అందుకే 16 మందిపై సమోటో(తమంతట తాము)గా కేసులు నమోదు చేశాం. వారిని సోమవారం పోలీసు స్టేషన్‌కు రమ్మన్నాం. ష్యూరిటీలతో వస్తే స్టేషన్ బెయిలిస్తాం. - సైదులు, టూటౌన్ సీఐ, సిద్దిపేట
హవ్వ.. ఇదేం సర్కార్!
Published Sun, Dec 22 2013 11:31 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement