అండగా నిలుస్తాం
సిద్దిపేట రూరల్: తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని, రైతులకు ఏ అవసరమొచ్చిన వెంటనే తీరుస్తామని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన, భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావుతో కలిసి సిద్దిపేట మండలం తోర్నాలలో తెలంగాణలోనే మొట్ట మొదటిమొక్కజొన్న పరిశోధనా కేంద్రానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ పద్ధతులపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటు వల్ల ఈ ప్రాంత రైతులకు ఎంతో మేలు చేకూరుతుందన్నారు. తెలంగాణ ప్రాం తంలోని రైతాంగానికి పుష్కలంగా నీరందిస్తే బంగారం పండిస్తారని, అందువల్ల రైతులకు అవసరమైన సాగునీరందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అంతేకాకుండా వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేయనున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా రైతులు తాము కోరిన కంపెనీ యంత్ర పరికరాలు కొనుగోలు చేసుకునేలా వెసులుబాటు కల్పించనున్నట్లు చెప్పారు. రైతు పరికరాలను కొనుగోలు చేసి బిల్లు అప్పగిస్తే సబ్సిడీని ప్రభుత్వం అందిస్తుందన్నారు. యంత్ర పరికరాల కోసం జిల్లాకు రూ.19 కోట్ల సబ్సిడీ విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎరువుల కొరత లేకుండా చర్యలు చేపట్టామన్నారు. వ్యవసాయంతో పాటు ఉద్యానపంటలపై కూడా రైతులు దృష్టి పెట్టాలన్నారు.
సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ మంజూరు చేయండి: హరీష్‌రావు
సిద్దిపేటకు సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్‌ను మంజూరు చేయాలని మంత్రి హరీష్‌రావు వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిని కోరారు. ఒక వేళ అది సాధ్యం కాని పక్షంలో ఫుడ్ ఆండ్ సైన్స్ టెక్నాలజీ కళాశాల మంజూరు చేయాలని కోరారు. మక్క పరిశోధనా కేంద్రం శంకుస్థాపన సభలో మాట్లాడిన హరీష్‌రావు సిద్దిపేట ప్రాంత సమస్యలను మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డికి వివరించారు.
మొక్కజొన్న పరిశోధనా కేంద్రం ఏర్పాటుతో ఈ ప్రాంత రైతంగానికి ఎంతో మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్ డా.ఎ.శరత్. ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ పద్మరాజు, రిజిస్ట్రార్ ప్రవీణ్‌రావు, రాజిరెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి, జెడ్పీ వైస్ చైర్మన్ సారయ్య, ఎంపీపీలు యాదయ్య, శ్రీకాంత్‌రెడ్డి, మాణిక్యరెడ్డి, జెడ్పీటీసీ గ్యార వజ్రవ్వ, పీఏసీఎస్ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, ఎంపీడీఓ బాల్‌రాజు, తహశీల్దార్ గిరి, సర్పంచ్ పరమేశ్వర్‌గౌడ్, ఎంపీటీసీ నర్సింలు పాల్గొన్నారు.