market fed
-
నిన్న పత్తి.. నేడు కందులు..
ఆదిలాబాద్ అగ్రికల్చర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ రంగ సంస్థలు సీసీఐ, మార్క్‌ఫెడ్ అలసత్వం రైతులకు శాపంగా మారుతోంది. సకాలంలో కొనుగోళ్లు ప్రారంభించకపోవడంతో పత్తి, కందులకు ధర పలకడం లేదు. ప్రైవేటు వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ తక్కువ ధరకే పత్తి, కందులు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇప్పటికే 80 శాతం వరకు రైతులు పత్తి విక్రయించారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) తాపీగా గిట్టుబాటు ధర చెల్లిస్తామంటూ రంగంలోకి దిగింది. ధర పెరగడంతో బడా వ్యాపారులకే లాభం చేకూరింది. కందుల కొనుగోళ్లలోనూ మార్క్‌ఫెడ్‌దీ అదే తీరు కనిపిస్తోంది. జిల్లాలో ఆదిలాబాద్, నిర్మల్, ఉట్నూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, సిర్పూర్ డివిజన్లలో 90,238 ఎకరాల్లో కంది సాగైంది. ఎకరానికి నాలుగు క్వింటాళ్ల లెక్కన 3.60లక్షల క్వింటాళ్లు దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. వర్షాలు, పూత దశలో వాతావరణంలో మార్పు, తుపాన్, కాత దశలో ఎండు తెగులు కారణంగా దిగుబడి తగ్గింది. ఎకరానికి మూడు క్వింటాళ్ల వరకు వచ్చినట్లు తెలుస్తోంది. జిల్లాలోని 17మార్కెట్ యార్డుల్లో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభించాల్సి ఉన్నా ఎక్కడా ప్రారంభం కాలేదు. దీంతో రైతులు గత్యంతరం లేక దళారులను ఆశ్రయించి మద్దతు ధర లభించక నష్టపోతున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కనీస మద్దతు ధర క్వింటాల్‌కు రూ.4,300గా ప్రకటించింది. ప్రైవేటు వ్యాపారులు వారం రోజుల క్రితం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్లో క్వింటాల్‌కు రూ.4,150 చెల్లించి కొనుగోలు ప్రారంభించారు. శనివారం వరకు రూ.3,550 నుంచి రూ.3,850 వరకు ధర చెల్లించారు. మార్కెట్లో కందిపప్పు ప్రియం.. ప్రస్తుతం మార్కెట్లో కిలో కందిపప్పు ధర రూ.72 పలుకుతోంది. ఈ లెక్కన క్వింటాల్ కందులకు రూ.5వేల నుంచి రూ.5,500 ధర పలకాలి. కానీ రైతులు కందులు అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అన్న చందంగా తయారైంది. రైతులు కంది సాగుకు ఎకరానికి రూ.10వేల నుంచి రూ.15వేల వరకు పెట్టుబడి పెట్టారు. పురుగు మందు, కూలీల ధరలు పెరిగిపోయాయి. ఇటు దిగుబడి రాక.. అటు మద్దతు ధర లేక రైతులు దిగులు చెందుతున్నారు. మార్కెట్లో మద్దతు ధర లభించేలా చూడాల్సిన అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పెట్టుబడే అధికం.. క్వింటాలు కందులు నూర్పిడి చేస్తే మిల్లు ఖర్చు లు పోనూ 74 కిలోల వరకు కంది పప్పు, 22 కిలోల వరకు దాణా వస్తుంది. మిల్లు ఖర్చులు తదితర వాటిని తీసివేసి.. మార్కెట్‌యార్డులో వ్యాపారులు చెల్లిస్తున్న ధర రూ.3,800తో పో ల్చితే కందిపప్పు ధర కిలోకు రూ.60 దాట వద్దు. ప్రస్తుతం కొనుగోలు చేస్తున్న కిరాణ దు కాణ పప్పు ధరతో పోలిస్తే రైతుకు రావాల్సిన మద్దతు ధర రూ.5వేల నుంచి రూ.5,500వరకు వ్యాపారులు చెల్లించాలి. దిగుబడిపై రాబడి తగ్గగా.. పెట్టుబడి పెరిగింది. పత్తిలో నష్టాలు చవిచూసిన రైతులు.. కందులు ఆదుకుంటాయని ఆశించగా నిరాశే ఎదురవుతోంది. -
హవ్వ.. ఇదేం సర్కార్!
సిద్దిపేట, న్యూస్‌లైన్: నోటితో ఊరడిస్తూ నొసటితో వెక్కిరించడమంటే ఇదే! రైతులు బాగుండాలని, రైతే రాజని రోజూ వక్కాణించే ప్రభుత్వం వారిపై కక్షగట్టింది. నేలతల్లినే నమ్ముకొని సమాజానికి పట్టెడన్నడం పెడుతున్న అన్నదాతలను వేధిస్తోంది. కేవలం పదిహేను నిమిషాలు రోడ్డెక్కి గొంతెత్తినందుకు కేసులు పెట్టారు. ఠాణా, కోర్టు చుట్టూ తిప్పడానికి కాగితాలను సిద్ధం చేశారు. రోడ్డెక్కడానికి నేపథ్యమిది... అది గత అక్టోబరు చివరి వారం. సిద్దిపేట వ్యవసాయ మార్కెట్‌కు పలువురు రైతులు తీసుకొచ్చిన మక్కల్ని మార్క్‌ఫెడ్ ఓకే చేసింది. కానీ..పది రోజులైనా తూకం వేయక..రశీదులివ్వక తీవ్ర జాప్యం చేసింది. మరోవైపు అకాల వర్షాలతో మొక్కజొన్నలు తడిసి మొలకెత్తి పంట ఉత్పత్తిదారుల కంటిమీద కునుకును దూరం చేశాయి. అటు ఇళ్లకు వెళ్లలేక ఇటు మార్కెట్లో పని పూర్తవక అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోయారు. దీంతో గత్యంతరం లేక అక్టోబరు 28న యార్డు దగ్గర్లోని రోడ్డుపైకి వచ్చి కాసేపు ఆందోళన చేశారు. రెండు గంటల్లో సరుకులను తరలిస్తామని పోలీసుల సమక్షంలో అధికారులు మాటిచ్చారు. అందుకు నాలుగు గంటలు దాటినా ఎవరూ పత్తాలేకుండా పోయారు. దాంతో జిల్లా పాలనా యంత్రాంగాన్ని కదిలించాలన్న ఉద్దేశంతో సమీపంలోని రాజీవ్ రహదారిపైకి చేరారు రైతులు. పావుగంటపాటు రాస్తారోకో చేశారు. అదే పాపమైందట... బాధితులు రైతు నేతలతో కలిసి రాజీవ్హ్రదారి మీదకు చేరాల్సిన అగత్యాన్ని ఒక రకంగా వారే సృష్టించారు. ఇంతలా నిర్లక్ష్యం ఆవహించిన అధికారులపై చర్యలు తీసుకునేందుకు చేతకాని పాలకులు...రోడ్డెక్కడమే పాపమైనట్లు రైతులపై కేసులు కట్టించారు. రాకపోకలకు ఆటంకం కలిగించాలని రైతులకు మాత్రం ఎందుకుంటుంది? వాళ్లు నిరసనకు దిగడానికి నేపథ్యాన్ని, మానవీయతను సర్కారు విస్మరించింది. 16 మందిపై కేసులు పావుగంటపాటు రాస్తారోకో చేసి ప్రభుత్వ ఉత్తర్వులను ఉల్లంఘించడం, వాహనాలను అడ్డుకోవడం చట్ట విరుద్ధమంటూ 188, 341 సెక్షన్ల కింద 16 మందిపై సిద్దిపేట టూటౌన్ ఠాణాలో కేసులు నమోదయ్యాయి. నర్సింహులు, నర్సయ్య, హన్మంతరెడ్డి, రామలింగారెడ్డి, రవీందర్‌రెడ్డి, భైరవరెడ్డి, రామచందర్‌రావు, మధుసూదన్‌రెడ్డి, లక్ష్మయ్య, బాల్‌రెడ్డి, భూపతిరెడ్డి, మోహన్‌రెడ్డి, రంగారెడ్డి, వెంకట్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, కమలాకర్‌రావులు ఆ జాబితాలో ఉన్నారు. వీరిని సోమవారం పోలీసుస్టేషన్‌కు రావాలని ఆజ్ఞాపించారు. సుమోటోగా కేసులు.. హైదరాబాద్-రామగుండం రాజీవ్హ్రదారిపై రాస్తారోకో చేసి రాకపోకలకు ఆటంకం కలిగించారు. అందుకే 16 మందిపై సమోటో(తమంతట తాము)గా కేసులు నమోదు చేశాం. వారిని సోమవారం పోలీసు స్టేషన్‌కు రమ్మన్నాం. ష్యూరిటీలతో వస్తే స్టేషన్ బెయిలిస్తాం. - సైదులు, టూటౌన్ సీఐ, సిద్దిపేట -
మార్క్‌ఫెడ్ తెరిచారు
సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: స్థానిక మార్కెట్ యార్డులో నాలుగురోజులుగా మూతపడి ఉన్న మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాన్ని అధికారులు బుధవారం తెరిచారు. అంతేకాదు కొనుగోళ్లు కూడా ప్రారంభించారు. మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రానికి తాళాలు వేసిన సంఘటనపై ‘సాక్షి’ బుధవారం ‘మూసేశారు’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన యంత్రాగం ఉరుకుల పరుగుల మీద కేంద్రాన్ని తెరిచేలా ఏర్పాట్లు చేసింది. స్థానిక ఎమ్మెల్యే హరీష్‌రావుకూడా సాక్షి కథనంపై తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆయన జిల్లా మార్క్‌ఫెడ్ మేనేజర్ నాగమల్లికకు ఫోన్ చేసి వివరాలపై ఆరా తీశారు. సిద్దిపేట ప్రాంత రైతాంగ శ్రేయస్సు దృష్ట్యా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మూసివేయడం సరికాదన్నారు. వెంటనే మర్క్‌ఫెడ్ ద్వారా రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని డీఎంకు సూచించారు. మరోవైపు స్థానిక మార్కెట్ కమిటీ, ఐకేపీ అధికారులతో మాట్లాడి వారిని మందలించారు. జిల్లా మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లిక కొనుగోలు కేంద్రం మూసివేసిన అంశంపై క్షేత్ర స్థాయి సిబ్బంది ద్వారా వివరాలు సేకరించారు. హమాలీలకు బకాయిగా ఉన్న రూ. లక్ష రెండు రోజుల్లోగా చెల్లించేలా చర్యలు తీసుకుంటామని వెళ్లడించారు. దీంతో స్థానిక మార్కెట్ కమిటీ కార్యదర్శి సంగయ్య హమాలీ నాయకులతో మాట్లాడి బుధవారం తూకాలు, ఎగుమతుల ప్రక్రియను పునఃప్రారంభించారు. బుధవారం మార్క్‌ఫెడ్ కొనుగోళ్లు ప్రారంభించడంతో రైతులంతా ఆనంద ం వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పరిష్కరించేందుకు ‘సాక్షి’ చూపిన చొరవను వారంతా అభినందించారు.