పోటీ ప్రపంచంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ డీలా | BSNL Service Very Poor In Allavaram East Godavari | Sakshi
Sakshi News home page

పోటీ ప్రపంచంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ డీలా

Published Fri, Jul 26 2019 2:05 PM | Last Updated on Fri, Jul 26 2019 2:05 PM

BSNL Service Very Poor In Allavaram East Godavari - Sakshi

3జీ లైసెన్స్‌ ఉన్నా 2జీ సేవలను అందిస్తున్న దేవగుప్తం బీఎస్‌ఎన్‌ఎల్‌ సిగ్నల్‌ టవర్‌

సాక్షి, అల్లవరం (తూర్పు గోదావరి): రిలయన్స్, ఎయిర్‌టెల్, ఐడియా టెలికం సంస్థలు సమాచార విప్లవంలో భాగంగా దూసుకుపోతుంటే ప్రభుత్వ రంగ సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (బీఎస్‌ఎన్‌ఎల్‌ ) వాటితో పోటీ పడలేక వినియోగదారులను ఆకర్షించడంలో విఫలమవుతోంది. ల్యాండ్‌లైన్, మొబైల్, ఇంటర్‌నెట్‌ సేవలను అందించడంలో ఆ సంస్థ వెనకబడింది. కేంద్ర ప్రభుత్వ విధానాలు, అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆ సంస్థకు వినియోగదారులు రోజు రోజుకూ గణనీయంగా తగ్గుతున్నారు. కాల్‌ రేట్లు ఎక్కువగా ఉండడం, సిగ్నల్స్‌ లేకపోవడం, నూతన సాంకేతికతను వినియోగదారులకు పరిచయం చేయకపోవడంతో బీఎస్‌ఎన్‌ఎల్‌ చతికిలపడింది.

అమలాపురం, అల్లవరం, దేవగుప్తం, కొమరగిరిపట్నం, చల్లపల్లి, సవరప్పాలెం, పేరూరు గ్రామాల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లను గ్లోబలైజేషన్‌ రింగ్‌ టవర్లుగా ఏర్పాటు చేశారు. ఈ ఏడు బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్ల నుంచి ల్యాండ్‌ లైన్, మొబైల్, ఇంటర్‌ నెట్‌ సేవలు అందిస్తున్నారు. దేవగుప్తం మినహా మిగిలిన ఆరు టవర్ల నుంచి 3జీ సేవలు అందిస్తున్నారు. దేవగుప్తంలో 2జీ సేవలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఈ గ్రామంలో 3జీ సేవలకు లైసెన్స్‌ ఉన్నా 2జీ సేవలతోనే కాలం గడుపుతున్నారు. దీనిపై వినియోగదారులు ప్రశ్నిస్తే 4జీ సేవలు ఏర్పాటు చేస్తామని అధికారులు అంటున్నారని సమాధానం దాటవేస్తున్నారు. గ్లోబలైజేషన్‌ రింగ్‌ పరిధిలో ఉన్న ఏడు టవర్లలో ఏ ఒక్క చోట విద్యుత్‌ సరఫరా నిలిచిపోయినా మిగిలిన ఆరు టవర్లలో మొబైల్‌ సిగ్నల్స్‌ నిలిచిపోతున్నాయి.

విద్యుత్‌ పునరుద్ధరించేంత వరకూ సిగ్నల్స్‌ లేక బీఎస్‌ఎన్‌ఎల్‌ సేవలు నిలిచిపోతున్నాయి. అంతే కాకుండా బీఎస్‌ఎన్‌ఎల్‌ టవర్లపై కార్పొరేట్‌ సంస్థలు తమ సిగ్నల్‌ డిష్‌లు ఏర్పాటు చేసుకుని ఆయా గ్రామాల్లో విస్తృత సేవలు అందిస్తుంటే, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ ఎందుకు ఇవ్వలేకపోతోందని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థను కాపాడాలన్న ఉద్దేశంతో ఇబ్బందిగా ఉన్నా, నెట్‌వర్క్‌ లేకపోయినా ఇప్పటికీ ఈ చాలామంది ఈ నెట్‌ వర్కునే వినియోగిస్తున్నారు. అమలాపురం పరిధిలోని ఏడు రింగ్‌ టవర్లలో 4జీ సేవలపై ఎందుకు శ్రద్ధ చూపడం లేదని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. 3జీ లైసెన్సులు ఉన్న టవర్లపై 2జీ సేవలు కొనసాగించడంపై అధికారుల తీరుపై వినియోగదారులు మండిపడుతున్నారు. ఇదే కొనసాగిస్తే రానున్న రోజుల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

సేవలకు అంతరాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ సిగ్నల్స్‌ లేక ‘మీ సేవా’ కేంద్రాల్లో వినియోగదారుల సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పుడుతోంది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ ఎప్పుడు ఉంటుందో తెలియని పరిస్థితి, ప్రస్తుతం ప్రతి సమస్య ఇంటర్‌నెట్‌తో ముడిపడి ఉంది. నెట్‌వర్క్‌ లేక పోతే సర్వీసులు పెండింగ్‌లో ఉంటున్నాయి.
– ఆర్‌.నాగబాబు, ‘మీ సేవా’ నిర్వాహకుడు, అల్లవరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement