హామీలను నీటీ మూటలే
{పాజెక్టులకు నామమాత్రంగా బడ్జెట్ ప్రతిపాదనలు
గాలేరు, హంద్రీ-నీవాకు అంతంతమాత్రమే
తెలుగుగంగకు రూ.1,300 కోట్లు
‘‘జిల్లాలో కరువులేకుండా చేస్తాం. ఈ ఏడాది జూన్ నాటికి హంద్రి-నీవా పనులు పూర్తిచేస్తాం. పడమటి మండలాల ప్రజల దాహార్తి తీర్చుతాం. తాగు, సాగునీటి సమస్యే లేకుండా చేస్తాం. ఆ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేయమని అధికారులను ఆదేశించాం. అవి వచ్చినవెంటనే నిధులు విడుదల చేస్తాం’’ అంటూ జిల్లా పర్యటనకొచ్చిన ప్రతిసారీ సీఎం చంద్రబాబు గుప్పిస్తున్న హామీలివి. కానీ ఆయన మాటలకు.. బడ్జెట్‌లోని ప్రతిపాదనలకు పొంతనలేకుండా పోతోంది. కంటితుడుపుగా నిధులు కేటాయించనున్న నేపథ్యంలో ఈ సారీ జిల్లా ప్రజలకు నీటి కష్టాలు తప్పేటట్లు లేవని నిపుణులు అభిప్రాయడుతున్నారు.
తిరుపతి: జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులకు ఈ సారి బడ్జెట్‌లో ప్రతిపాదనలు నామమాత్రంగా ఉన్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి హంద్రీ-నీవా రెండో దశ పనులను పూర్తిచేసి పుంగనూరు, మదనపల్లె, కుప్పం ప్రాంతాలకు నీరు అందిస్తామన్న సీఎం చంద్రబాబు మాటలు నీటిమూటలుగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు నీరు రావాలంటే దాదాపు రూ.3,000 కోట్లకు పైగా నిధులు అవసరమని అధికారులు అంచనాలు తయారు చేశారు. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతిపాదనలే రూ.1,300 కోట్లు ఉంటే వాటిలో ఎంతమేరకు నిధులు కేటాయిస్తారో అనే చర్చ సాగుతోంది. తెలుగుగంగ ప్రాజెక్టుకు సంబంధించి రూ.2,500 కోట్లు అవసరం కాగా కేవలం రూ.1,300కోట్ల మేర మాత్రమే ప్రతిపాదనలు పంపడం గమనార్హం.
హంద్రి-నీవా..ఏమిటీ నీదోవ!
హంద్రి-నీవా రెండోదశ పనుల్లో భాగంగా మొదట అనంతపురం జిల్లాలో ఉన్న 18 ప్యాకేజీ పనుల్ని పూర్తిచేయాలి. ఆ తర్వాతే జిల్లాకు నీరు వచ్చే మార్గం ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా రూ.1,000 కోట్లకు పైగా పనులకు టెండర్లు పిలిచారు. చిత్తూరు జిల్లాలో దాదాపు రూ.300 కోట్ల పనులకు కొత్తగా రీ టెండర్లు జరిగాయి. దీంతోపాటు అనంతపురం జిల్లాలో మూడు రైల్వే క్రాసింగ్‌ల వద్ద పనులు మొదలు కాలేదు. కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్ పనులు ఆగిపోయాయి. చిత్రావతి, పాపాగ్ని నదులను దాటేందుకు ఆక్విడెట్ పనులు ఇంత వరకు ప్రారంభం కాలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత బడ్జెట్‌లో కేటాయించిన నిధులతో జిల్లాకు నీరు రావటం గగనమేనని నీటిపారుదల రంగ నిపుణులు పేర్కొంటున్నారు.
గాలేరు-నగరి.. ఈ సారీ లేదుమరి!
గాలేరు-నగరి రెండోదశ పనులకు సంబంధించి జిల్లాలో 7 ప్యాకేజీలు ఉన్నాయి. వీటిని పూర్తిచేయాలన్న చిత్తశుద్ధి ప్రభుత్వంలో కనిపించటం లేదు. అటవీ మార్గంలో సొరంగం పనుల విషయమై ఇంకా స్పష్టత రాలేదు. టీబీఎం ద్వారానా, మ్యానువల్ పద్ధతిలో చేస్తారా అనే విషయమై ప్రభుత్వం ఇంకా తర్జన భర్జన పడుతోంది.
గంగకు బెంగే!
తెలుగుగంగ ప్రాజెక్టు పనులకు సంబంధించి ప్రధానంగా శ్రీకాళహస్తి, సుళ్లూరుపేట, సత్యవేడు నియోజకవర్గాల్లో పలుచోట్ల డిస్టిబ్యూటరీ పనులు పెండింగ్‌లో ఉన్నాయి. తాజాగా ప్రతిపాదించిన బడ్జెట్ ప్రకారం పనులు పూర్తికావని ఇంజినీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
వాటి పని అంతే
వీటితో పాటు అరణియార్, కృష్ణాపురం రిజర్వాయర్, కాళంగి, ఎన్టీఆర్ జలాశయాలకు ఎంతమేర నిధులు కే టాయిస్తారో తెలియని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఈసా రీ సీఎం హామీలు నీటిమూటలుగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయని రైతులు చర్చించుకుంటున్నారు.