
రాజమండ్రిలో కుప్పకూలిన భవనం
సాక్షి, రాజమండ్రి: రాజమండ్రి నూనెకొట్టు వీధిలో బుధవారం రాత్రి 11.20 గంటల సమయంలో రెండతస్తుల భవనం కుప్పకూలింది. శిథిలాల కింద ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులతోపాటు ఒక వాచ్‌మన్ చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆకుల ఆంజనేయులు(60), అతడి భార్య వెంకటరత్నంలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమంగా ఉన్న వారిద్దరినీ ఆస్పత్రికి తరలించారు. వారి కుమారుడు హనుమాన్, అతని భార్య విజయలక్ష్మి, మనుమడు భార్గవ్(4), జశ్వంత్(2), పక్కనే నిర్మిస్తున్న ఇంటికి వాచ్‌మన్‌గా పనిచేస్తున్న మరో వ్యక్తి శిథిలాల్లో చిక్కుకున్నారు. ఈ భవనం అయిదేళ్ల క్రితం నిర్మించారు. దీని పక్కన ఖాళీస్థలంలో కొత్తగా ఇల్లు నిర్మించేందుకు గొయ్యి తవ్వడంతో భవనం ఆవైపు కూలిపోయింది. ఈ ఘటనతో చుట్టుపక్కల నివసించే వారు భయాందోళనలతో పరుగులు తీశారు. సహాయక చర్యలను ఎస్పీ రవికుమార్‌మూర్తి పర్యవేక్షించారు.