
పలుగుగడ్డ వద్ద నిర్మిస్తున్న వాటర్‌ట్యాంకులు, వాటి పక్కనే శిథిలావస్థకు చేరిన పాత ట్యాంకు
దోమకొండ: మండల కేంద్రంలోని పలుగుగడ్డ ప్రాంతంలో గల వాటర్ ట్యాంక్ పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. దీనిని తొలగించి దాని స్థానంలో కొత్త వాటర్ ట్యాంకును నిర్మించాలని కాలనీవాసులు కోరుతున్నారు. లక్ష లీటర్ల సామర్ధ్యం గల ఈ వాటర్ ట్యాంక్‌ను దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించారు. దీని ద్వారా గ్రామంలోని మార్కండేయ కాలనీ, ఇందిరాకాలనీ, మటన్ మార్కెట్, ఊరడమ్మ వీధి, బురుజు, హనుమాన్ కాలనీతో పాటు పాత బీబీపేట రోడ్డు వరకు కుళాయి ద్వారా నీటి సరఫరా జరుగుతోంది.
రెండు సంవత్సరాలుగా ఇది పూర్తిగా శిథిలావస్థకు చేరింది. పెచ్చులు ఊడిపోయాయి. పగుళ్లు ఏర్పడ్డాయి. రెండేళ్ల క్రితం గ్రామ పంచాయతీ పారిశుధ్య కార్మికుడు ట్యాంక్ లోపల శుభ్రం చేస్తుండగా మెట్లు విరిగిపోయాయి. దీంతో సదరు కార్మికుడు సెల్‌ఫోన్ ద్వారా విషయం తెలియజేయగా పంచాయతీ సిబ్బంది ట్యాంక్‌పైకి ఎక్కి అతడిని తాళ్లతో పైకి తీశారు.
వాటర్ ట్యాంక్ చుట్టూ పెద్ద సంఖ్యలో నివాసాలు ఉన్నాయి. దీంతో కాలనీవాసులు ఎప్పుడు కూలుతుందోనని భయపడుతున్నారు. ఈ విషయంలో కాలనీవాసులు పంచాయతీ పాలకవర్గంతో పాటు గ్రామ ప్రజాప్రతినిధులకు విషయం వివరించారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు వచ్చి దానిని పూర్తిగా తొలగించాలని పేర్కొన్నారు. తొలగించే ముందే దాని స్థానంలో మరో ట్యాంకును నిర్మించాలని వారు ప్రతిపాదించారు.
అదే సమయంలో మిషన్ భగీరథ ద్వారా ఇక్కడ 60 వేల లీటర్ల సామర్థం రెండు వాటర్ ట్యాంకులకు కామారెడ్డి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ భూమిపూజ చేశారు. దీంతో కాలనీవాసులంతా సంతోషపడ్డారు. అయితే సదరు కాంట్రాక్టర్ పనులు మాత్రం నత్తనడకన చేస్తున్నారు. వీటితో పాటు గ్రామంలో మొదలుపెట్టిన వాటర్ ట్యాంకులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ వీటి నిర్మాణ విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
వీటిని ముందుగా పూర్తి చేయడం ద్వారా పాత ట్యాంకును తొలగించాలని వారు కోరుతున్నారు. వర్షాకాలం కావడంతో పాత వాటర్ ట్యాంకు ఏ క్షణమైన కూలవచ్చని, దాంతో కాలనీవాసులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.
ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకుల నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూడాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment