భవనాలను పంచేశారు | buildings ready to two states | Sakshi
Sakshi News home page

భవనాలను పంచేశారు

Published Wed, May 7 2014 1:34 AM | Last Updated on Tue, Aug 21 2018 11:41 AM

భవనాలను పంచేశారు - Sakshi

భవనాలను పంచేశారు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ జూన్ రెండో తేదీ నుంచి మనుగడలోకి రానున్న తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాలకు చట్టసభలు, పరిపాలన బ్లాకులు, భవనాల కేటాయింపునకు ఆమోదముద్ర వేశారు. ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదికలను పరిశీలించిన అనంతరం కేటాయింపులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. మంగళవారం వివిధ కమిటీల సీనియర్ అధికారులతో గవర్నర్ రాజ్‌భవన్‌లోని సుధర్మ బ్లాక్‌లో రెండు గంటలపాటు విభజన ప్రక్రియను సమీక్షించారు. సీమాంధ్ర సీఎంకు రక్షణ, ఇతర కారణాలను దృష్టిలో పెట్టుకుని పోలీసు యంత్రాంగం సలహా మేరకు సీమాంధ్ర ముఖ్యమంత్రి అధికార నివాసంగా లేక్‌వ్యూ అతిథి గృహాన్ని ఎంపిక చేశారు. అలాగే, ప్రస్తుతం ఉన్న శాసనమండలితో పాటు అదనంగా జూబ్లీహాల్‌ను కూడా శాసనమండలిగా తీర్చిదిద్దాలని, అందుకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలన్నారు.
 
 అంతేకాక పాత అసెంబ్లీ భవనానికి కూడా అవసరమైన మరమ్మతులను ఈనెల 20వ తేదీలోగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని శాసనసభ కార్యదర్శి డాక్టర్ రాజా సదారాంను గవర్నర్ ఆదేశించారు. ప్రస్తుతమున్న అసెంబ్లీనితెలంగాణకు, పాత అసెంబ్లీ భవనాన్ని సీమాంధ్రకు కేటాయించనున్నట్టు సమాచారం. అయితే, అసెంబ్లీ, మండళ్ల కేటాయింపులపై గవర్నర్ ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదని తెలిసింది. మంత్రుల చాంబర్లను కూడా సిద్ధం చేయాలని సూచించారు. సచివాలయం, పోలీసు భవనాలు, ఇతర శాఖలకు అవసరమైన భవనాల కేటాయింపునకు ఆయా కమిటీల్లోని ఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. సచివాలయంలో వివిధ  శాఖలకు కేటాయించిన భవనాల విస్తీర్ణంపై కూడా చర్చించారు.
 
 ప్రస్తుతం ఉన్న భవనాల నుంచి వివిధ శాఖల తరలింపు దూరంగా ఉండకుండా, దగ్గరగా ఉండేలా ఆయా శాఖలకు భవనాల కేటాయింపు చేసినట్టు ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి శాంబాబ్ గవర్నర్ నరసింహన్‌కు వివరించారు. సచివాలయంలో మొత్తం 179 విభాగాలు ఉన్నాయని, వాటి విభాగాధిపతులతో చర్చించి నిర్ణయానికి వచ్చినట్టు తెలిపారు. ప్రస్తుతం సచివాలయంలోనూ, ఇతర భవనాల్లోనూ చేపట్టిన నిర్మాణ కార్యక్రమాలు ఈనెల 20 వ తేదీలోపు పూర్తవుతాయని ఆయన గవర్నర్‌కు తెలిపారు. ఢిల్లీలోని ఏపీ భవన్‌లో గదుల కేటాయింపుపై ఒక నివేదికను రెసిడెంట్ కమిషనర్ సమర్పించారు. కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కాంట్రాక్టు పనుల డేటాబేస్‌ను సిద్ధం చేశామని, ఈ డేటాను రెండు రాష్ట్రాలు వినియోగించుకునే విధంగా ఆన్‌లైన్ పద్ధతిని అభివృద్ధి చేస్తున్నట్టు కాంట్రాక్టుల కమిటీ అధ్యక్షుడు వి. నాగిరెడ్డి గవర్నర్‌కు వివరించారు. పనుల పురోగతి, బిల్లుల చెల్లింపు, భౌతిక, ఆర్థిక అంశాలను ఆన్‌లైన్‌లో పర్యవేక్షించే అవకాశం ఉంటుందన్నారు. ఈ సమావేశంలో  గవర్నర్ సలహాదారులు సలావుద్దీన్, ఏఎన్ రాయ్, చీఫ్‌సెక్రటరీ ప్రసన్నకుమార్ మహంతి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు ఎస్‌పి టక్కర్, లక్ష్మి పార్థసారథి, రమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్, ప్రదీప్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement