‘క్లియరెన్స్’ పండుగ!
Published Mon, Jan 13 2014 2:33 AM | Last Updated on Sat, Sep 2 2017 2:34 AM
బంపర్ ఆఫర్.. బ్రహ్మాండమైన క్లియరెన్స్ సేల్.. అప్ టు 60 శాతం డిస్కౌంట్.. ఆలసించిన ఆశాభంగం.. రండి.. త్వరపడండి.. ఇటువంటి ప్రకటనలు చూడగానే అర్థమైపోతుంది.. ఇదేదో వ్యాపార ప్రకటన అని.. కానీ ఇక్కడ మనం చెప్పుకొనేది ఈ వ్యాపార ప్రకటనల గురించి కాదు!.. అచ్చం అదే రీతిలో సర్కారీ కార్యాలయంలో జరిగిన పండుగ చెల్లింపుల క్లియరెన్స్ గురించి..!!.. అక్కడ కొనుగోలుదారులకు వ్యాపారస్తులు డిస్కౌంట్ ఆఫర్లు ఇస్తే.. ఇక్కడ బిల్లులు క్లియర్ చేసినందుకు కృతజ్ఞతగా కాంట్రాక్టర్ల నుంచి ఉద్యోగులే పర్సంటేజీల ఆఫర్ తీసుకున్నారు. వెరసి అక్కడ సంక్రాంతికి ముందే చెల్లింపుల క్లియరెన్స్ పండుగ చేసుకున్నారు.
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: రెండో శనివారం సెలవు.. తర్వాత ఆదివారం.. ఆ వెంటనే సంక్రాంతి సెలవులు.. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. సాధారణంగా వరుసగా రెండు రోజులు సెలవులు వస్తే.. ఆ ముందు రోజు మధ్యాహ్నానికే కార్యాలయాలు ఖాళీ అయిపోతాయి. అటువంటి వరుసుగా ఐదారు రోజులు సెలవులు వచ్చినా.. రెండో శనివారమైనా జిల్లా పరిషత్‌లోని ఒక విభాగం మాత్రం సందడిగానే కనిపించింది. ఫైళ్లతో కుస్తీ పడుతూ ఉద్యోగులు.. హడావుడిగా లోనికి, బయటకు తిరుగుతూ బయటి వ్యక్తులు.. బిజీ బిజీగా గడిపారు. సెలవు రోజు ఈ హడావుడి ఏమిటా అని ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.
సంక్రాంతి వస్తోంది.. ఖర్చులకు చేతిలో డబ్బులుండాలి. కొన్నాళ్లుగా పెండింగులో ఉన్న బిల్లులను క్లియర్ చేస్తే ఇటు కాంట్రాక్టర్లకు డబ్బులు అందుతాయి. అందుకు ప్రతిఫలంగా ఉద్యోగులకు పర్సంటేజీలు(పీసీలు) అందుతాయి. ఇద్దరి పండుగ ఖర్చులు గట్టెక్కుతాయి. ఉభయతారకంగా ఉన్న ఈ ఆఫర్ పంచాయతీ రాజ్ ఇంజినీరింగ్ అధికారుల నుంచే కాంట్రాక్టర్లకు అందింది. వారు సంబరంగా సరే అన్నారు. ఇంకేముందు సెలవు రోజైనా శనివారం పెద్దసంఖ్యలో కాంట్రాక్టర్లు జెడ్పీ కార్యాలయానికి వచ్చి బిల్లులు క్లియర్ చేయించుకున్నారు. ప్రధానంగా ఎచ్చెర్ల నియోజకవర్గం పరిధిలో చేపట్టిన పనుల బిల్లులు ఎక్కువగా క్లియర్ అయినట్లు సమాచారం.
ఇచ్చి..పుచ్చుకున్నారు
శనివారం రోజంతా కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపే లక్ష్యంగా పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది పని చేశారు. ఆదివారం కూడా కార్యాలయం తెరిచే ఉంది. సిబ్బంది ఇదే పని కొనసాగించారని తెలుస్తోంది. శ్రీకాకుళం, ఎచ్చెర్ల, నరసన్నపేట తదితర నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంట్రాక్టర్లకు గత రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న బిల్లులు మంజూరు చేస్తామని, అందుకు ప్రతిగా తమకు ఇవ్వాల్సింది ఇచ్చేయాలని అధికారులు ముందే చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఆ మేరకు ఒక్క శనివారమే కోట్లాది రూపాయల విలువైన ఉపాధి హామీ రోడ్లు, తుఫాన్ పునుర్నిర్మాణాలు, తదితర పనులకు సంబంధించిన బిల్లులు క్లియర్ చేసి పెద్ద మొత్తంలో పీసీ దండుకున్నట్లు ఆ కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిపై సంబంధిత ఈఈ ప్రభాకరరావు వద్ద ‘న్యూస్‌లైన్’ ప్రస్తావించగా ‘మాకేం సెలవులండీ..అందునా పండుగ కదా.. పండుగ ముందే బిల్లులు ఇచ్చేస్తే కాంట్రాక్టర్లు సంతోషిస్తారని మేమే పిలిపించి బిల్లులు చేయించామని’ చెప్పారు.
Advertisement
Advertisement