బూరగడ్డ వేదవ్యాస్
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(ముడా) చైర్మన్ పదవి నుంచి బూరగడ్డ వేదవ్యాస్‌ను తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ద్వారా పొందిన ఈ నామినేటెడ్ పదవిని అంటిపెట్టుకుని వేలాడుతున్న వేదవ్యాస్‌ను రాజీనామా చేయాల్సిందిగా కోరినా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం బలవంతంగా సాగనంపింది. ఈ మేరకు ముడా చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ జీవో నం.235ను జారీ చేసింది.
‘సాక్షి’ కథనంతో చలనం..
టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవులు చేపట్టి నేటికీ కొనసాగుతున్న వారిపై ‘పట్టుకుని వేలాడుతున్నారు’ అనే శీర్షికన గత నెల 28వ తేదీన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు పట్టుకుని వేలాడుతున్న పలువురు రాజీనామాలు చేశారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుతో సహా పలు దేవస్థానాల చైర్మన్‌లు, పాలకవర్గ సభ్యులు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. మరికొంత మంది పదవీకాలం ముగియడంతో పక్కకు తప్పుకున్నారు. ఇంకొంత మంది ప్రభుత్వం ఎలాగూ తొలగిస్తుంది కదా అప్పుటి వరకు కొనసాగుదాం అన్న ధోరణిలో ఉన్నారు.కాగా పదవీకాలం ముగియడంతో కేడీసీసీబీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర మార్కఫెడ్ చైర్మన్‌గా, డీసీఎంఎస్ చైర్మన్‌గా కొనసాగుతున్న కంచిరామారావులు తప్పుకోగా.. ఆయా సంస్థలకు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కే.మాధవీలతలు పర్సన్ ఇన్‌చార్జిలుగా ప్రభుత్వం నియమించింది.
జూలై 28వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్
మిగిలిన వారిలో గుబులు..
కాగా ముడా చైర్మన్‌గా మాత్రం వేదవ్యాస్ పదవికి రాజీనామా చేయకుండా కొనసాగారు. పైగా వారానికి రెండుమూడు రోజులు ముడా కార్యాలయానికి వచ్చి తమ తాబేదార్లకు పనుల కోసం అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చేవారు. వేదవ్యాస్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇంకా నామినేటెడ్ పదవులు పట్టుకుని ఇంకా వేలాడుతున్న వారిలో గుబులు మొదలైంది. ఇంకా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో బండారు హనుమంతరావుతో సహా డైరెక్టర్లలు రాజీనామా చేయకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment