Machilipatnam Urban Development Authority
-
‘బూరగడ్డ వేదవ్యాస్’ అవుట్
సాక్షి, మచిలీపట్నం(కృష్ణా) : మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) చైర్మన్ పదవి నుంచి బూరగడ్డ వేదవ్యాస్‌ను తొలగిస్తూ ప్రభుత్వం మంగళవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం ద్వారా పొందిన ఈ నామినేటెడ్ పదవిని అంటిపెట్టుకుని వేలాడుతున్న వేదవ్యాస్‌ను రాజీనామా చేయాల్సిందిగా కోరినా పట్టించుకోకపోవడంతో ప్రభుత్వం బలవంతంగా సాగనంపింది. ఈ మేరకు ముడా చైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ జీవో నం.235ను జారీ చేసింది. ‘సాక్షి’ కథనంతో చలనం.. టీడీపీ హయాంలో నామినేటెడ్ పదవులు చేపట్టి నేటికీ కొనసాగుతున్న వారిపై ‘పట్టుకుని వేలాడుతున్నారు’ అనే శీర్షికన గత నెల 28వ తేదీన ‘సాక్షి’ ప్రత్యేక కథనం ప్రచురించింది. ఈ కథనం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులు పట్టుకుని వేలాడుతున్న పలువురు రాజీనామాలు చేశారు. రాష్ట్ర బీసీ కార్పొరేషన్ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావుతో సహా పలు దేవస్థానాల చైర్మన్లు, పాలకవర్గ సభ్యులు స్వచ్ఛందంగా తప్పుకున్నారు. మరికొంత మంది పదవీకాలం ముగియడంతో పక్కకు తప్పుకున్నారు. ఇంకొంత మంది ప్రభుత్వం ఎలాగూ తొలగిస్తుంది కదా అప్పుటి వరకు కొనసాగుదాం అన్న ధోరణిలో ఉన్నారు.కాగా పదవీకాలం ముగియడంతో కేడీసీసీబీ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు, రాష్ట్ర మార్కఫెడ్ చైర్మన్‌గా, డీసీఎంఎస్ చైర్మన్‌గా కొనసాగుతున్న కంచిరామారావులు తప్పుకోగా.. ఆయా సంస్థలకు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్, జేసీ కే.మాధవీలతలు పర్సన్ ఇన్చార్జిలుగా ప్రభుత్వం నియమించింది. జూలై 28వ తేదీన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనం క్లిప్పింగ్ మిగిలిన వారిలో గుబులు.. కాగా ముడా చైర్మన్‌గా మాత్రం వేదవ్యాస్ పదవికి రాజీనామా చేయకుండా కొనసాగారు. పైగా వారానికి రెండుమూడు రోజులు ముడా కార్యాలయానికి వచ్చి తమ తాబేదార్లకు పనుల కోసం అధికారులపై ఒత్తిళ్లు తీసుకొచ్చేవారు. వేదవ్యాస్‌ను ఆ పదవి నుంచి తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఇంకా నామినేటెడ్ పదవులు పట్టుకుని ఇంకా వేలాడుతున్న వారిలో గుబులు మొదలైంది. ఇంకా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పదవిలో బండారు హనుమంతరావుతో సహా డైరెక్టర్లలు రాజీనామా చేయకుండా పదవులు పట్టుకుని వేలాడుతున్నారు. -
ముడా చైర్మన్ పదవి నుంచి వేదవ్యాస్ తొలగింపు
సాక్షి, అమరావతి : మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) చైర్మన్ పదవి నుంచి బూరగడ్డ వేదవ్యాస్‌ను ప్రభుత్వం తొలగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వేదవ్యాస్‌ను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ కాపీని జిల్లా కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులకు అందజేశారు. బందరు అభివృద్ధి, పోర్టు భూ సేకరణ తదితర వ్యవహారాలు చక్కదిద్దేందుకు 2016లో ప్రభుత్వం ముడా శాఖను నెలకొల్పిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పాలన, అభివృద్ధిపరమైన వ్యవహారాలు చూసుకునేందుకు డెప్యుటీ కలెక్టర్ స్థాయి అధికారిని వైస్ చైర్మన్‌గా నియమించారు. సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి చంద్రబాబు ప్రభుత్వం టీడీపీ నాయకుడైన వేదవ్యాస్‌ను ముడా చైర్మన్‌గా నియమించింది. -
బట్టబయలైన ‘పోర్టు’ నాటకం!
సాక్షి, మచిలీపట్నం: ఇచ్చిన హామీ నెరవేర్చాలని అధికారంలో ఉన్న నాలుగున్నరేళ్లు తలంచలేదు.. సరిగ్గా ఎన్నికలకు మరో రెండు నెలలు ఉందనగానే ఒక్కసారిగా గుర్తొచ్చాయి.. ఇంకేముంది ‘పసుపు– కుంకుమ’ మాదిరిగానే ఆర్భాటంగా ఇదిగో బందరు పోర్టు అంటూ ఓ పైలాన్‌ను ఆవిష్కరించేశారు. అందుకోసం టీడీపీ నాయకుల మౌఖిక ఆదేశాలతో రైతుల భూములను మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) అధికారులు అనధికారికంగా స్వాధీనం చేసుకుని నిర్మాణాలు సాగించారు. సీన్ కట్‌చేస్తే.. భూములిచ్చిన రైతులకు ఎకరానికి ఇస్తామన్న రూ. 40 లక్షల ఊసు లేదు.. తిరిగి భూములిచ్చేయండని అడిగితే చీదరింపులు.. వెరసి వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అధికారుల ఆధీనంలో ఉన్న తమ భూములను విడిపించాలని మండల పరిధిలోని మేకవానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల రైతులు వేడుకుంటున్నారు. బందరు పోర్టు పనుల ప్రారంభోత్సవం పేరుతో ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయా గ్రామాల సరిహద్దులో బహిరంగ సభ నిర్వహించిన విషయం తెలిసిందే. సభాప్రాంగణానికి, పైలాన్ నిర్మాణానికి ఇరు గ్రామాల రైతులకు చెందిన 20 ఎకరాలను వినియోగించారు. అప్పట్లో ఎకరం భూమిని రూ. 40 లక్షలకు కొనుగోలు చేస్తున్నట్లు అధికారులు, టీడీపీ నాయకులు అట్టహాసంగా ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు ఒక్క రూపాయి ఇవ్వకపోగా భూమిని ఖాళీ చేయడం లేదంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. చిత్తశుద్ధి లేని పనులకు రూ. కోట్లు గడిచిన ఐదేళ్లు టీడీపీ నాయకులు బందరు పోర్టు నిర్మాణంపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబునాయుడు గెలిస్తే ఆరు నెలల్లో బందరుకు ఓడను తీసుకొస్తానని ప్రగల్భాలు పలికిన విషయం తెలిసిందే. ఐదేళ్లు భూ సేకరణ, భూ సమీకరణ, మచిలీపట్నం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(మడా), మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(ముడా) ఏర్పాటు అంటూ కాలయాపన చేశారు. అయితే ముడాకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి విడుదలైన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని ఐదేళ్లు హారతికర్పూరం చేశారు. ఇక 2019 ఎన్నికల దగ్గరపడే సమయానికి ఒక్క సారిగా ఉలిక్కిపడ్డారు. ఐదేళ్లు ఆడిన నాటకానికి చివరి అంకంలో రక్తికట్టించే ప్రయత్నంలో భాగంగానే మేకవానిపాలెం, గోపువానిపాలెం గ్రామాల రైతుల భూములను వినియోగించుకున్నారు. బందరు పోర్టు పనులు పూర్తి చేయలేమని, అయితే పనులు ప్రారంభం అంటూ నియోజకవర్గ ప్రజలను మరో మారు వంచించేందుకు ఎన్నికల ముందు, ఫిబ్రవరిలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తీసుకొచ్చి హడావుడి చేశారు. సభ నిర్వహణకు, హెలికాప్టర్ ల్యాండింగ్‌కు, పైలాన్ నిర్మాణానికి 20 ఎకరాలను రైతుల నుంచి బలవంతంగా తీసుకుని సభను మమ అనిపించారు. ముడా అధికారుల దౌర్జన్యం భూములను ఖాళీ చేయమంటూ ముడా అధికారులు తమపై దౌర్జన్యం చేస్తున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. ముందుగా ఎకరం భూమికి రూ. 40 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు నగదు చెల్లించకపోవడంతో ఇటీవల కొందరు రైతులు ముడా కార్యాలయానికి చేరుకుని అధికారులను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ముడా అధికారులు తమపై విరుచుకుపడినట్లు కొందరు రైతులు చెబుతున్నారు. భూములకు సంబంధించిన కాగితాలను తీసుకురావాలని, లేదంటే భూములను ఆన్లైన్ అడంగళ్‌లో నుంచి తప్పిస్తామని, రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తామని, ప్రభుత్వానికి స్వాధీనం చేస్తామని అధికారులు బెదిరిస్తున్నారని రైతులు వివరిస్తున్నారు. ఆగిపోయిన సాగు.. ప్రస్తుతం ఖరీఫ్ సాగు ప్రారంభమైన విషయం తెలిసిందే. ఏటా తొలకరి వర్షాలను ఆసరాగా తీసుకుని రైతులు ఈ భూముల్లో వేరుశనగ సాగు ప్రారంభిస్తారు. భూముల్లో కంకర, పైలాన్ ఉండటంతో సాగు చేయలేకపోతున్నామంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే కొందరు రైతులు కంకర లేని ప్రాంతంలో పొలాలను దుక్కి దున్ని విత్తనాలు వేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయంపై ముడా వైస్ చైర్మన్ విల్సన్‌బాబును వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరని కార్యాలయ సిబ్బంది తెలిపారు. భూమిని సాగుకు పనికిరాకుండా చేశారు ముడా అధికారులు ఆక్రమించిన భూమిలో నాకు 2.50 ఎకరాల భూమి ఉంది. అప్పట్లో భూమి ఇవ్వమని చెప్పాం. టీడీపీ నాయకులు, ముడా అధికారులు బలవంతంగా భూమిని తీసుకున్నారు. పోలీసు కేసులు పెడతామని బెదిరించారు. దీంతో ఎవరికి చెప్పుకోలేకపోయాం. నా భూమిలో కొంత భాగం పైలాన్ కట్టారు. మిగిలిన భూమిలో కంకర పోశారు. ఇప్పుడు సాగు చేసుకునేందుకు వీలు లేకుండా ఉంది. నా కుటుంబానికి ఈ భూమి జీవనాధారం. భూమిలో ఉన్న కట్టడాలను తీసేయ్యాలని ఇటీవల ముడా అధికారులను కలిసి విన్నవించుకున్నాం. వాళ్లు మమ్మల్ని పలు రకాలుగా బెదిరించారు. – మేకా వెంకటశివ, రైతు, గోపువానిపాలెం -
‘మాడా’కు భారీ ల్యాండ్‌పూలింగ్!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ(మాడా)కి పెద్దమొత్తంలో భూమిని పూలింగ్ విధానం ద్వారా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంత భూమిని సమీకరిస్తారు? దీనిని ఎందుకోసం వినియోగిస్తారు? అనే అంశాలను రహస్యంగా ఉంచింది. అసలు భూసమీకరణ ప్రక్రియ గురించి ప్రకటన కూడా జారీ చేయలేదు. ల్యాండ్ పూలింగ్ పనుల పర్యవేక్షణకోసం 15 మంది డిప్యూటీ కలెక్టర్లను హఠాత్తుగా మాడాకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో భారీ ల్యాండ్ పూలింగ్‌కు సర్కారు తెరలేపుతున్నట్లు తేటతెల్లమవుతోంది. ‘15 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమించడమంటే సాదాసీదా వ్యవహారం కాదు. దీనిని బట్టే ప్రభుత్వం భారీ స్థాయిలో భూసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తక్కువ భూమి సమీకరించడానికైతే ఇద్దరు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను మించి నియమించరు...’ అని భూసమీకరణ, సేకరణలో అనుభవం ఉన్న అధికారి ఒకరు తెలిపారు.ఈ విషయమై పట్టణాభివృద్ధి శాఖ అధికారులను సంప్రదించగా మాడాకు భూమి సమీకరించాలని నిర్ణయించిన విషయం వాస్తవమేగానీ, ఎన్ని ఎకరాలు అనే అంశంపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మచిలీపట్నంలో భూమి విలువ చాలా ఎక్కువని, ఇక్కడ పూలింగ్ కింద భూమి ఇచ్చేందుకు రైతులనుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.