‘మాడా’కు భారీ ల్యాండ్‌పూలింగ్!
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన మచిలీపట్నం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(మాడా)కి పెద్దమొత్తంలో భూమిని పూలింగ్ విధానం ద్వారా తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంత భూమిని సమీకరిస్తారు? దీనిని ఎందుకోసం వినియోగిస్తారు? అనే అంశాలను రహస్యంగా ఉంచింది. అసలు భూసమీకరణ ప్రక్రియ గురించి ప్రకటన కూడా జారీ చేయలేదు. ల్యాండ్ పూలింగ్ పనుల పర్యవేక్షణకోసం 15 మంది డిప్యూటీ కలెక్టర్లను హఠాత్తుగా మాడాకు బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేయడంతో భారీ ల్యాండ్ పూలింగ్‌కు సర్కారు తెరలేపుతున్నట్లు తేటతెల్లమవుతోంది.
‘15 మంది డిప్యూటీ కలెక్టర్లను నియమించడమంటే సాదాసీదా వ్యవహారం కాదు. దీనిని బట్టే ప్రభుత్వం భారీ స్థాయిలో భూసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. తక్కువ భూమి సమీకరించడానికైతే ఇద్దరు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లను మించి నియమించరు...’ అని భూసమీకరణ, సేకరణలో అనుభవం ఉన్న అధికారి ఒకరు తెలిపారు.ఈ విషయమై పట్టణాభివృద్ధి శాఖ అధికారులను సంప్రదించగా మాడాకు భూమి సమీకరించాలని నిర్ణయించిన విషయం వాస్తవమేగానీ, ఎన్ని ఎకరాలు అనే అంశంపై ఇంకా పూర్తిస్థాయిలో నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. మచిలీపట్నంలో భూమి విలువ చాలా ఎక్కువని, ఇక్కడ పూలింగ్ కింద భూమి ఇచ్చేందుకు రైతులనుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే అవకాశముందని అధికారవర్గాలు తెలిపాయి.