దొంగల బీభత్సం | Burglar havoc | Sakshi
Sakshi News home page

దొంగల బీభత్సం

Published Sat, Nov 8 2014 2:17 AM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

దొంగల బీభత్సం - Sakshi

దొంగల బీభత్సం

అనంతపురం క్రైం : అనంతపురం నగర శివారులోని బెంగళూరు-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కనున్న మహేంద్ర వాహనాల షోరూంలో శుక్రవారం తెల్లవారుజామున దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. రూ.14 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు, షోరూం ఉద్యోగులు తెలిపిన మేరకు వివరాలు.. షోరూంలో గురువారం రాత్రి బత్తల పెద్దన్న, పటాన్ శిలార్ ఖాన్ సెక్యూరిటీ విధుల్లో ఉన్నారు. షోరూం చుట్టూ ఇనుప ముళ్ల కంచెతో ప్రహరీ ఉంది. దీన్ని దాటుకుని లోపలికి ప్రవేశించడం కష్టసాధ్యం.

అయితే.. నలుగురు దొంగలు షోరూం వెనుక వైపు ప్రహరీ కింది భాగంలో కన్నం వేసి లోపలికి ప్రవేశించారు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో సెక్యూరిటీ సిబ్బంది పరిశీలించేందుకని వెనుకవైపునకు వెళ్లారు. అప్పటికే దాక్కుని ఉన్న దొంగలు వారిపై దాడి చేశారు. క్రికెట్ స్టంప్స్, ఐరన్ పైపులతో చితకబాదారు. పెద్దన్న తల, చేతి వేళ్లు, శిలార్ ఖాన్ కుడి చేయి, భుజానికి బలమైన గాయాలయ్యాయి. అంతటితో ఆగకుండా వారిద్దరి నోళ్లకు ప్లాస్టర్లు వేశారు. చేతులు, కాళ్లు కట్టిపడేశారు.

వారి వద్ద ఒకరు ఉండి, మిగిలిన ముగ్గురు లోపలికి వెళ్లారు. షోరూం లోపలికి ప్రవేశించగానే సీసీ కెమెరాల ఫుటేజీ నిక్షిప్తమయ్యే డిస్క్ వీడియో రికార్డర్ (డీవీఆర్)ను ధ్వంసం చేశారు. మరో డీవీఆర్‌ను ఎత్తుకెళ్లారు. నేరుగా పై అంతస్తులోకి వెళ్లారు. నగదు ఉంచే గది తాళాలు మెండి.. లోపలికి ప్రవేశించారు. గ్యాస్ కట్టర్ సాయంతో నగదు బాక్సుకు రంధ్రం వేశారు. అందులో ఉన్న రూ. 14 లక్షలు తీసుకుని పారిపోయారు.

సెక్యూరిటీ గార్డులు ఇబ్బంది పడుతూ ప్లాస్టర్లు, తాళ్లు విడిపించుకుని నాలుగు గంటల సమయంలో యాజమాన్యానికి ఫోన్‌లో సమాచారం అందించారు. యాజమాన్యం ఫిర్యాదు మేరకు అడిషనల్ ఎస్పీ మాల్యాద్రి, డీఎస్పీ నాగరాజ, టూటౌన్ సీఐ మన్సూరుద్దీన్, సీసీఎస్ సీఐ సుధాకర్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్ ఘటన స్థలాన్ని పరిశీలించింది.

 రెక్కీ నిర్వహించి..
 ప్రణాళికప్రకారం దోపిడీకి పాల్పడ్డారనేది స్పష్టమవుతోంది. షోరూంపై బాగా అవగాహన ఉన్నవారే దోపిడీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. షోరూంలో పని చేసే సిబ్బంది పాత్రపైనా పోలీసులు విచారిస్తున్నారు. కనీసం సెక్యూరిటీ సిబ్బందితో నగదు బాక్సు ఎక్కడుంటుందని అడగకుండా నేరుగా పై అంతస్తులోని నగదు బాక్సు ఉండే గదికి వెళ్లారంటే కచ్చితంగా రెక్కీ నిర్వహించి చేసిన పనే అని పోలీసులు భావిస్తున్నారు.

సీసీ కెమెరాల ఫుటేజీ నిక్షిప్తమయ్యే ఒక డీవీఆర్‌ను ధ్వంసం చేసి, మరో డీవీఆర్‌ను ఎత్తుకెళ్లినా... లోపలికి ప్రవేశించే సమయంలో ఉన్న సీసీ కెమెరాల్లో నమోదు అయినట్లు తెలిసింది. ఫుటేజీని పరిశీలించిన పోలీసులు.. నలుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వచ్చినట్లు గుర్తించారు. వీరంతా యువకులుగానే కనిపించినట్లు తెలిసింది. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.          .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement