రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని డీకొట్టిన దృశ్యం ప్రమాదంలో రోడ్డు పక్కన ఉన్న గుంతల్లో పడిపోయిన ఆటో
ప్రయాణికులతో బయల్దేరిన ఆర్టీసీ బస్సు ఉన్నపళంగా అదుపుతప్పింది. రోడ్డు పక్కన ఆపిన ఆటోను, పక్కనే నిల్చొని మాట్లాడుతున్న ఇద్దరు వ్యక్తులను ఢీకొట్టడంతో వారు ఎగిరి సమీపంలోని గుంతలో పడ్డారు. ఆ ఇద్దరు వ్యక్తులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ ప్రవర్తనలో తేడా ఉండటంతో బెంబేలెత్తిపోయిన కండక్టర్, ప్రయాణికులు వారించి.. కిందకు దిగేశారు. అనంతరం ఖాళీ బస్సును డ్రైవర్ అలాగే ముందుకు పోనిచ్చి ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొట్టాడు.
గుంతకల్లు రూరల్: గుంతకల్లు ఆర్టీసీ బస్టాండ్ నుంచి శుక్రవారం ఉదయం 19 మంది ప్రయాణికులతో బస్సు బయల్దేరింది. పట్టణ శివారులోని ఇండస్ట్రియల్ ఏరియా వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. పక్కనే నిలబడి స్థలాలను పరిశీలిస్తున్న రవీంద్ర, ఎర్రిస్వామి అనే ఇద్దరు వ్యక్తులు ఆటోతో పాటు ఎగిరిపోయి గుంతలో పడిపోయారు. అయితే వారు స్వల్పగాయాలతో బయటపడగా.. ఆటో మాత్రం పూర్తిగా ధ్వంసమైంది. డ్రైవర్ ఎం.ఎం.బేజ్ బస్సును నిలపకుండా ముందుకుపోనిచ్చాడు. గాయపడిన వారి వెంట వచ్చిన మరో వ్యక్తి బస్సును ఆపేందుకు బైక్‌పై వెంబడించాడు. దీన్ని గమనించిన డ్రైవర్ ఆ వ్యక్తిపైకి కూడా దూసుకుపోయేలా నడిపాడు. దీంతో ఫాలో అవుతున్న వ్యక్తి ఆగిపోయాడు.
బెంబేలెత్తిన ప్రయాణికులు
డ్రైవర్ ప్రవర్తనతో ప్రయాణికులు బెంబేల్తిపోయారు. కండక్టర్ కుళ్లాయప్పతో పాటు ప్రయాణికులు డ్రైవర్‌ను వారించి బస్సు ఆపి కిందకు దిగిపోయారు. బస్సును పక్కన నిలిపివేయాలని కండక్టర్ సూచించినా డ్రైవర్ వినకుండా ముందుకు దూసుకుపోయాడు. అలా వెళ్తూ మండల పరిధిలోని తిమ్మాపురం సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉన్న లారీని వెనకనుంచి వేగంగా ఢీకొట్టాడు. దీంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతింది.
బీపీ పెరిగి.. స్టీరింగ్‌పైఅదుపుతప్పి..
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న రూరల్ ఎస్‌ఐ వలిబాషా వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. డ్రైవర్ ఎం.ఎం. బేజ్‌ను అదుపులోకి తీసుకొని గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బీపీ 190కి పెరిగిపోవడం, మెదడు నియంత్రణ కోల్పోవడంతో డ్రైవర్ ఆ విధంగా ప్రవర్తించాడని, మద్యం తాగలేదని ఎస్‌ఐ స్పష్టం చేశారు. హైబీపీ కారణంగా డ్రైవర్‌కు పక్షవాతం వచ్చే ప్రమాదం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. దీంతో వైద్యుల సూచన మేరకు అనంతపురం పంపినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment