అనంతపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేందుకు ఆగస్టు 1వ తేదీ నుంచి 10వరకు బస్సుయాత్ర చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ జగదీశ్ వెల్లడించారు. ఆదివారం అనంతపురంలో జరిగిన ఉద్యోగుల ప్రతిజ్ఞా దినోత్సవంలో జగదీశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జగదీశ్ మాట్లాడుతూ... బస్సుయాత్ర ద్వారా ప్రజల్లో ప్రత్యేక హోదాపై అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక హోదా ప్రకటించే విషయంలో కేంద్రం మోసం చేసిందని ఆరోపించారు.
ఆగస్టు 11వ తేదీలోగా పార్లమెంట్‌లో బిల్లు పెట్టకుంటే ఏపీ బంద్‌కు పిలుపునిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ సీజే చంద్రశేఖర్ మాట్లాడుతూ..బిహార్‌కు 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజి ప్రకటించిన మోడీ ప్రభుత్వం... విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను విస్మరిస్తోందని విమర్శించారు. ఈ విషయంలో పట్టించుకోవాల్సిన టీడీపీ ప్రభుత్వం చేతగాక చేతులెత్తేసిందన్నారు.