ధూం.. ధాం.. దోచుడే! | Businessmen Plan To Rob The Public On Diwali | Sakshi
Sakshi News home page

ధూం.. ధాం.. దోచుడే!

Published Tue, Oct 22 2019 8:14 AM | Last Updated on Tue, Oct 22 2019 8:14 AM

Businessmen Plan To Rob The Public On Diwali - Sakshi

సంపాదనే లక్ష్యంగా టపాసుల వ్యాపారులు రంగంలోకి దిగారు. అప్పుడే వ్యాపారం ‘రాజకీయ రంగు’ పులుముకుంది. అనంతపురంలో మూడు రోజులపాటు సాగే ఈ వ్యాపారం తారాజువ్వలా దూసుకెళ్లాలనే ఉద్దేశంతో వ్యాపారులంతా ‘రింగ్‌’ అయ్యారు. ఏదో ఒక రాజకీయ పార్టీ పంచన చేరాలని తహతహలాడుతున్నారు. యథావిధిగా ఆయా ప్రభుత్వ శాఖలకు ముడుపులు ముట్టజెప్పేందుకు కసరత్తు ప్రారంభించారు.   

సాక్షి, అనంతపురం సెంట్రల్‌: దీపావళి పండుగ ఈసారి కూడా సామాన్యులకు చుక్కలు చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రజల నుంచి అడ్డంగా దోచుకునేందుకు వ్యాపారస్తులు ‘రింగ్‌’ అయ్యారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఏదో ఒక  రాజకీయ పార్టీకి చెందిన నాయకున్ని అధ్యక్షునిగా ఎంచుకోవాలని తీర్మానించారు. దీనిపై రెండు, మూడురోజుల నుంచి భారీస్థాయిలో కసరత్తు జరుగుతోంది. మూడురోజుల క్రితం ఏకంగా త్రీస్టార్‌ హోటల్‌లో భారీ విందులతో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తెరపైకి ఇద్దరు, ముగ్గురు అధ్యక్షులు రావాలని ప్రయత్నాలు చేశారు. చివరకు ఒక వ్యక్తి గట్టిగా నిలబడుతున్నట్లు తెలుస్తోంది. రెండురోజుల అధ్యక్ష స్థానం చేజిక్కించుకునే అవకాశముంది. టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు లైసెన్స్‌ల కోసం జిల్లా కేంద్రంలో 123, జిల్లా వ్యాప్తంగా 263 మొత్తం 386 దరఖాస్తులు వచ్చాయి. త్వరలో అర్హులైన వారికి లైసెన్స్‌లు మంజూరు చేయనున్నారు. 

తెరవెనుక అంతా ఆయనే.. 
టపాసుల వ్యాపారంలో పేరుమోసిన ఓ రాజకీయ నేత ఈసారి కూడా తెరవెనుక నుంచి అంతా తానై నడిపిస్తున్నాడు. అధ్యక్షుడిగా ఎవరుండాలి.. ఎంతెంత వసూలు చేయాలి అని నిర్ణయిస్తున్నాడు. ఇటీవల ఓ లగ్జరీ హోటల్‌లో జరిగిన టపాసుల దుకాణాదారుల సమావేశం ఖర్చు మొ త్తం ఆయనే భరించారంటే టపాసుల దుకాణంలో ఆయనకు వస్తున్న లాభం ఏపాటిదో ఊహించవచ్చు. ఈసారి మొత్తం దుకాణాదారులను ఒకతాటిపైకి తీసుకురావడంలో సఫలీకృతుడైన ఆయన టపాసుల ధరలు ఆకాశానికి అంటేలా నిర్ణయించినట్లు సమాచారం. అందరూ తాను చెప్పిన ధరలకే విక్రయించాలని హుకుం జారీ చేసినట్లు తెలిసింది. కమర్షియల్‌ ట్యాక్స్, తూనికలు కొలతలశాఖ అధికారులను తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఇందుకోసం అదనంగా వసూలు చేస్తున్నట్లు కొంతమంది వ్యాపారస్తులు వెల్లడించారు.

ఎంత సరుకు క్రయవిక్రయాలు జరిపినా రూ. 15వేలు మాత్రమే జీఎస్టీ రూపంలో చెల్లించేలా కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారులను ఇప్పటికే తన దారికి తెచ్చుకున్నట్లు తెలిసింది. ఒక అగ్నిమాపకశాఖ అధికారులు లైసెన్స్‌ మంజూరు కోసం రూ. 5వేలు ఇచ్చేలా ఒప్పందం జరిగినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. దుకాణాలు ఏర్పాటు చేసేందుకు, మిగిలిన ఖర్చులకు అధ్యక్షునికి రూ. 45వేలు ఇవ్వాలని తీర్మానించారు. దీన్నిబట్టి చూస్తే టపాసుల వ్యాపారంలో ఈసారి కూడా ఎలాంటి మార్పులు లేనట్లు తెలుస్తోంది. టపాసుల వ్యాపారస్తుల అక్రమాలకు అధికారులు కళ్లెం వేస్తారని భావించినా ఆ పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టపాసుల ధరలు చుక్కలంటడం ఖాయంగా కనిపిస్తుండడంతో సామాన్యుల ఇంట తారాజువ్వల వెలుగులు కనిపించడం గగనంగా మారనుంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement