
హైరానా
ఇతని పేరు ప్రసాద్‌బాబు. ప్రొద్దుటూరు పట్టణంలోని 9వ చౌకదుకాణ డీలర్. చంద్రన్న సంక్రాంతి కానుకకు సంబంధించిన వస్తువులను గోడౌన్ నుంచి శనివారం తీసుకున్నారు. అయితే సరుకులలో 100 నెయ్యిప్యాకెట్లు, 50 కిలోల బెల్లం, 50 కిలోల శనగలు తక్కువగా వచ్చాయి. దీంతో డీలర్ తిరిగి సరుకులను గోడౌన్‌లో అప్పగించాడు. సరుకుల కోసం ఆదివారం సాయంత్రం వరకు గోడౌన్ వద్ద కాపలా కాయాల్సి వచ్చింది.
ప్రొద్దుటూరు: చంద్రన్న సంక్రాంతి కానుక అధికారులతో పాటు డీలర్లను హడలెత్తిస్తోంది. సరుకుల వద్ద అధికారులు రాత్రింబవళ్లు కాపలా కాస్తుండగా వీటిని తీసుకెళ్లేందుకు రేషన్ డీలర్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఆదివారం సాయంత్రం వరకు సరుకుల పంపిణీ పూర్తి కాలేదు. చంద్రన్న సంక్రాంతి కానుకగా ప్రభుత్వం హెరిటేజ్ కంపెనీకి చెందిన 100 మిల్లీ లీటర్ల నెయ్యి, మరో కంపెనీకి చెందిన పామాయిల్ ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేస్తుండగా కందిబేడలు, శనగలు, బెల్లంపై ఎలాంటి కంపెనీల పేర్లు లేవు.
వాటి బస్తాలు కూడా సాధారణంగా ఉన్నాయి. ప్రస్తుతం సరఫరా అయిన హెరిటేజ్ నెయ్యి ప్యాకెట్లు కూడా కంపెనీ లేబుల్ లేకుండా పాలిథిన్‌కవర్లలో సరఫరా అయ్యాయి. బెల్లం నిజామాబాద్, కందిబేడలు గుంటూరు జిల్లా వినుకొండ, శనగలు ప్రొద్దుటూరు సమీపంలోని గోడౌన్ నుంచి సరఫరా అవుతున్నాయి. కాగా వీటి తూకాల్లో భారీ వ్యత్యాసం ఉన్నట్లు కనిపిస్తోంది. కందిబేడలు 50 కిలోలకు గానూ 49.50 కిలోలు మాత్రమే ఉండగా అధికారులు మాత్రం 50.50 కిలోలుగా, 50 కిలోల శనగలను కూడా 50.50 కిలోలుగా, 10 కిలోల బెల్లాన్ని 10.50 కిలోలుగా లెక్కకట్టి తమకు అంటగడుతున్నారని డీలర్లు తెలిపారు.
ప్రతి బస్తాకు ఈ విధంగా లెక్కకడితే తామెంతోనష్టపోతామని తెలిపారు. అలాగే చంద్రన్న సంక్రాంతి కానుకను ప్రభుత్వం ఉచితంగా ఇస్తుండగా సరుకులను, ఎత్తిదించినందుకు గానూ కూలీలు మాత్రం యధావిధిగా డబ్బు వసూలు చేస్తున్నారు. సరుకులు ఉచితం కదా అని డీలర్లు ప్రశ్నిస్తే మేం శ్రమను నమ్ముకొని జీవించేవారం, మాకు కూలీ ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రకారం రూ. 300-400 వరకూ చెల్లించిన వారు ఉన్నారు. ఇదిలా ఉండగా అధికారుల అదేశాల మేరకు సరకులు తీసుకెళ్లేందుకు గానూ డీలర్లు పడిగాపులు కాయాల్సి వస్తోంది. సరకులన్నీ పూర్తిగా లేకపోగా అధికారులు మాత్రం ఉన్నవాటినే సరఫరా చేస్తున్నారు.
బెల్లం నిల్వలు కూడా ఆదివారం ఉదయానికి అయిపోగా మధ్యాహ్నం మరో లారీ వచ్చింది. అలాగే గోధుమ పిండి నాలుగు లారీలకు గాను ఒక్క లారీ మాత్రమే ఆదివారం సరఫరా అయింది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఉన్న సరకులు పంపీణీ చేస్తుండగా ప్రొద్దుటూరు గోడౌన్‌లో సాయంత్రానికే నెయ్యి ప్యాకెట్ల కొరత ఏర్పడింది. శనివారం ఉదయమే వీటిని తెప్పించారు. ఇంకా ఈ కానుకకు సంబంధించిన సంచులు తయారవుతూనే ఉన్నాయి.