గోడ రేపిన చిచ్చు | But you end wall | Sakshi
Sakshi News home page

గోడ రేపిన చిచ్చు

Published Thu, Apr 10 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 5:48 AM

But you end wall

  • ఇంటికి దారి మూసేశారని మనస్తాపం
  •  యువకుని ఆత్మహత్యా యత్నం
  •  చావుబతుకుల్లో ఉన్నా దారివ్వని వైనం!
  •   రావికమతం, న్యూస్‌లైన్ : తన ఇంటికి రహదారి సౌకర్యం లేకుండా అడ్డంగా గోడ కట్టేస్తున్నారంటూ మనస్థాపం చెందిన ఇంటి యజమాని కుమారుడు శానాపతి కిశోర్ (31) బుధవారం ఆత్మహత్యాయత్నం చేశాడు. చావుబతుకుల్లో ఉన్న అతడిని ఆస్పత్రికి తరలించేందుకూ ఆ గోడపై నుంచి  వెళ్లనీయకపోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రావికమతం నడిబొడ్డున బుధవారం జరిగిన సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి.

    రావికమతం మండల పరిషత్ ప్రహరీని ఆనుకుని పడమరభాగంలో శానాపతి శ్యామల అనే ఆమె కొన్నేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నారు. భర్త, పిల్లలతో నివాసం ఉంటున్నారు. సర్వే నంబరు 106/1లో ఉన్న ఈ స్థలంలో ఈశాన్య భాగంలో నర్సీపట్నం-భీమునిపట్నం రహదారి ఉంది. వీరి ఇంటికీ, బీఎన్ రోడ్డుకు మధ్య కొంత ప్రభుత్వ స్థలం ఉంది. శ్యామల ఇంటికి అదే రహదారిగా ఉండేది.  ఆ ఖాళీ స్థలాన్ని ఒక సామాజిక భవనం నిర్మాణానికి స్థానిక సంఘాల సభ్యులు మంజూరు చేయించుకున్నారు.

    అప్పటి నుంచి ఇరువర్గాల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. వివాదం కోర్టుకు కూడా వెళ్లింది. పరిస్థితి ఇలా ఉంటే, మంగళ, బుధవారాల్లో ఆయా సంఘాల సభ్యులు ఆ స్థలంలో ప్రహరీ నిర్మించారు. శ్యామల ఇంటికి రహదారిలేకుండా పోయింది. దీంతో తమ ఇంటిలోనే తాము గృహ నిర్మాణంలో ఉన్నామంటూ శ్యామల కుమారుడు కిశోర్ తీవ్ర ఆవేదనకు లోనై ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు.

    సమాచారం అందుకున్న 108 సిబ్బంది, పోలీసులు వచ్చి కిశోర్‌ను  ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే ఎత్తై గోడ నిర్మించడం, పైగా ఆ గోడపై నుంచి తరలించవద్దంటూ పలువురు అడ్డుకోవడంతో చివరకు అపస్మారక స్థితిలోఉన్న కిశోర్‌ను మండల పరిషత్ గోడపై నుంచి అతిప్రయాసతో దాటించి 108లో నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. వారు అక్కడి నుంచి విశాఖ కేజీహెచ్‌కు తరలించారు.
     
    అధికారుల విచారణ
     
    ఈ సంఘటనపై తహశీల్దార్ రోజా, రావికమతం ఎస్‌ఐ సురేష్‌కుమార్ రావికమతం వచ్చి ఇరువర్గాలనూ విచారించారు. జిల్లా కలెక్టర్ తమకు మూడున్నర సెంట్లు స్థలం కేటాయించారని, తమ స్థలంలో నిర్మాణం చేపట్టామని, తమకు అన్ని ఆధారాలున్నాయని పలువురు సంఘ సభ్యులు వారికి వివరించారు. ఆస్పత్రికి తీసుకుకువెళ్లడాన్ని మాత్రం అడ్డుకోలేదన్నారు. దీనిపై అధికారులు స్పందిస్తూ.. ఎన్నికలయ్యే వరకూ ఏవిధమైన పనులూ చేయవద్దని వారు ఇరువర్గాలకూ హెచ్చరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement