12 నాటికి 22 వేల మంది వివరాలు సేకరించాలి
వీడియో కాన్ఫరెన్స్ లో జాయింట్ కలెక్టర్ ఆదేశం
ఒంగోలు టౌన్ : స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 22 వేల మంది వివరాలు ఈ నెల 12వ తేదీ నాటికి సేకరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎం.హరిజవహర్‌లాల్ ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ అధికారులు, మునిసిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో గురువారం స్థానిక సీపీఓ వీడియో కాన్ఫరెన్‌స హాలు నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్‌స నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో చిన్న పిల్లల వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు కావడం లేదని తన దృష్టికి వచ్చిందన్నారు. అదేవిధంగా అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారుల్లో కొంతమంది వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు కానట్లు తెలిసిందని చెప్పారు. ఆధార్ నంబర్లు లేని కారణంగా మరి కొంతమంది వివరాలు నమోదు కాలేదన్నారు. ఆధార్ కార్డులు లేని వారి కోసం గ్రామాల వారీగా మేళాలు నిర్వహించి యుద్ధప్రాతిపదికన వాటిని అందించాలని ఆదేశించారు. ఆధార్ నంబర్లు పొందిన వెంటనే వారి వివరాలు స్మార్ట్ పల్స్ సర్వేలో నమోదు చేయాలని సూచించారు.
అదేవిధంగా చనిపోయినవారి వివరాలు సర్వే నుంచి తొలగించాలని ఆదేశించారు. గ్రామాలు, వార్డుల వారీగా స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించిన జాబితాలను క్రాస్ చెక్ చేసుకోవాలని సూచించారు. జిల్లాలో వందశాతం స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. స్మార్ట్ పల్స్ సర్వే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని జారుుంట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ హెచ్చరించారు. వీడియో కాన్ఫరెన్‌సలో ఇన్‌చార్జి జిల్లా రెవెన్యూ అధికారి భక్తవత్సలరెడ్డి, స్మార్ట్ పల్స్ సర్వే జిల్లా నోడల్ అధికారి ఉదయభాస్కర్, ఒంగోలు ఆర్‌డీఓ శ్రీనివాసరావు, ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ అసిస్టెంట్ కమిషనర్ ప్రమీల పాల్గొన్నారు.