► స్మార్ట్ పల్స్ సర్వే సిబ్బందికి అందని రెమ్యునరేషన్
►సర్వే పూర్తయి ఐదునెలలైనా పట్టించుకోని ప్రభుత్వం
►జిల్లాలో ఐదువేల మంది ఎదురుచూపు
ఒంగోలు టౌన్: స్మార్ట్ పల్స్ సర్వే. గతేడాదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నోట ఎక్కువగా వచ్చిన మాట. జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రతి సందర్భంలోనూ స్మార్ట్ పల్స్ సర్వే గురించి ప్రస్తావిస్తూ జిల్లా అధికారులు మొదలుకుని క్షేత్ర స్థాయి సిబ్బంది వరకు పరుగులు పెట్టించారు. ప్రభుత్వ ఉద్యోగులకే అదనంగా పల్స్ సర్వే బాధ్యతలు అప్పగించడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో వారంతా సర్వే కోసం ఇంటింటికీ తిరిగారు. ఊపిరాడనీయకుండా వారితో సర్వే చేయించిన ప్రభుత్వం.. ఆ తరువాత వారికి ఇవ్వాల్సిన రెమ్యునరేషన్ గురించి పట్టించుకోలేదు.
సర్వే పూర్తయి ఐదు నెలలు అవుతున్నా ఇంతవరకు ఒక్క రూపాయి కూడా వారికి ఇవ్వలేదు. సర్వేలో తమను తరిమినట్లుగా పనిచేయించిన ప్రభుత్వం.. తమ కష్టానికి తగినట్లుగా రెమ్యునరేషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమని ఎన్యుమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యుమరేటర్లు ప్రశ్నిస్తున్నారు. పల్స్ సర్వేకు సంబంధించి తమకు ఎప్పుడు రెమ్యునరేషన్ ఇస్తారంటూ వారితో దగ్గరుండి సర్వే చేయించిన సూపర్‌వైజర్లను ప్రశ్నిస్తున్నారు. వారికి సమాధానం చెప్పుకోలేక అనేకమంది సూపర్‌వైజర్లు సతమతమవుతున్నారు
.
ఒక్కో రికార్డుకు ఒక్కో రేటు...
స్మార్ట్ పల్స్ సర్వేలో పాల్గొన్న సిబ్బందికి ఒక్కో రికార్డుకు ఒక్కో రేటును ప్రభుత్వం నిర్ణయించింది. ఒక వ్యక్తికిç సంబంధించిన పూర్తి వివరాలను ఒక రికార్డు కింద నిర్ణయించి ఆ వివరాలను సేకరించిన ఎన్యుమరేటర్‌కు రూ.4, అసిస్టెంట్ ఎన్యుమరేటర్‌కు రూ.3, సూపర్‌వైజర్‌కు రూ.2 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో 2,400 మంది ఎన్యుమరేటర్లు, 2,400 మంది అసిస్టెంట్ ఎన్యుమరేటర్లు ఈ ప్రక్రియ చేపట్టారు.
వారి పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ సకాలంలో సర్సే పూర్తి చేయించేందుకు వీలుగా దాదాపు 280 మంది సూపర్‌వైజర్లను నియమించారు. 2016 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 36,11,518 మంది ఉన్నారు. 90 శాతానికిపైగా స్మార్ట్ పల్స్ సర్వేలో వివరాలు సేకరించారు. మిగిలిన వారిలో కొంతమంది వలసలు వెళ్లడం, ఇంకొంతమంది చనిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో స్మార్ట్ పల్స్ సర్వే ప్రక్రియ పూర్తయినప్పటికీ రెమ్యునరేషన్ ఎప్పుడు ఇస్తారా అని సర్వేలో పాల్గొన్న సిబ్బంది ఎదురుచూసూ్తనే ఉన్నారు.
చుక్కలు చూపించిన ప్రభుత్వం...
స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో అందులో పాల్గొన్న సిబ్బందికి ప్రభుత్వం చుక్కలు చూపించింది. జిల్లాలోని ప్రతి ఒక్కరికీ దాదాపుగా ఆధార్ కార్డులు ఉన్నాయి. ఆధార్ నంబర్ కొడితే సంబంధిత వ్యక్తికి సంబంధించిన సమగ్ర సమాచారమంతా క్షణాల్లో ప్రత్యక్షమవుతోంది. అయితే స్మార్ట్ పల్స్ సర్వే పేరుతో దాదాపు అరవై రకాల అంశాలను అందులో పొందుపరిచి తిరిగి ఎన్యుమరేటర్లు, అసిసెంట్ ఎన్యుమరేటర్లతో సర్వే చేయించింది. దానికితోడు స్మార్ట్ పల్స్ సర్వే ప్రారంభమైన తరువాత రోజుల వ్యవధిలో సాఫ్ట్‌వేర్ మారుస్తూ ప్రభుత్వం వారిని ముప్పతిప్పలు పెట్టింది.
ఒకే వ్యక్తికి సంబంధించి అనేకమార్లు సర్వే చేయించింది. దీంతో అనేకమంది ఎన్యుమరేటర్లు, అసిస్టెంట్ ఎన్యుమరేటర్లు అదనపు విధుల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. కానీ, ప్రభుత్వ ఆదేశాలు తప్పకుండా పాటించాలి్సందేనంటూ ఉన్నతాధికారుల నుంచి ఒత్తిళ్లు రావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్వేలో సిబ్బంది తలమునకలయ్యారు. సర్వే నిర్వహించే సమయంలో ప్రజలు కూడా వారికి పూర్తి స్థాయిలో సహకరించకపోవడంతో అనేక మంది తీవ్ర అసహనానికి గురయ్యారు.
ప్రభుత్వం తమకు సంబంధించిన అన్నిరకాల వివరాలు సేకరిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌లో తమను ఏమైనా ఇబ్బందికి గురిచేస్తుందేమోనని అనేక మంది భయపడి వాస్తవ వివరాలు కూడా చెప్పలేదు. సిబ్బంది వచ్చే సమయంలో మరికొంతమంది ఇళ్లలో అందుబాటులో లేకుండా పోయారు. స్మార్ట్ పల్స్ సర్వే నమోదు శాతం తక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ వివరాలు నమోదు చేయించుకోకుంటే భవిష్యత్‌లో ప్రభుత్వ పథకాలను పొందే అర్హత కోల్పోతారంటూ ప్రకటనలు రావడంతో ఎట్టకేలకు ప్రజలు ముందుకు వచ్చి తమ వివరాలను తెలియజేశారు.
రూ.1.70 కోట్లు విడుదల :
జిల్లాలో నిర్వహించిన స్మార్ట్ పల్స్ సర్వేకు సంబంధించి ప్రభుత్వం ఇటీవల కోటీ 70 లక్షల రూపాయలు విడుదల చేసింది. దశలవారీగా నిధులు విడుదల చేయడం వల్ల కొంత గ్యాప్ వచ్చింది. ప్రస్తుతం పూర్తి స్థాయిలో నిధులు విడుదల కావడంతో సిబ్బందికి రెమ్యునరేషన్ అందించేందుకు వారి బ్యాంకు ఖాతా నంబర్లను తీసుకుంటున్నాం. త్వరితగతిన వారికి రెమ్యునరేషన్ అందిస్తాం.
– నోడల్ అధికారి ఉదయభాస్కర్
ఒక్క రూపాయిస్తే ఒట్టు..!
Published Wed, May 24 2017 12:39 PM | Last Updated on Tue, Sep 5 2017 11:54 AM
Advertisement
Advertisement