స్మార్ట్‌ చెక్‌! | Smart Pulse Survey | Sakshi
Sakshi News home page

స్మార్ట్‌ చెక్‌!

Published Sun, Jan 28 2018 9:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

Smart Pulse Survey - Sakshi

ఒంగోలు టౌన్‌:  స్మార్ట్‌ పల్స్‌ సర్వేను రాష్ట్ర ప్రభుత్వం మరోమారు తెరపైకి తీసుకొచ్చింది. దాదాపు ఏడాదిన్నర క్రితం స్మార్ట్‌ పల్స్‌ సర్వే పేరుతో ప్రభుత్వం హడావుడి చేసింది. ప్రతి ఇంటికి సంబంధించిన సమగ్ర సమాచారం కోసమంటూ ఆరు నెలలకు పైగా సర్వే చేయించింది. ఆ సర్వే ప్రక్రియ పూర్తయి ప్రజ లు కూడా మర్చిపోతున్న తరుణంలో ప్రభుత్వం స్మార్ట్‌ సర్వేను చెక్‌ చేయాలని అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. స్మార్ట్‌ పల్స్‌ సర్వేలో పేర్లు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వర్తిస్తాయంటూ ప్రభుత్వం సరికొత్త పల్లవి అందుకొంది. ఈ నేపథ్యంలో జిల్లాలో గతంలో నిర్వహించిన స్మార్ట్‌ పల్స్‌ సర్వే డేటాను ఆధారం చేసుకొని ప్రజల వివరాలను తిరిగి చెక్‌ చేసేం దుకు యంత్రాంగం సన్నద్ధమైంది.స్మార్ట్‌ పల్స్‌ సర్వేలో వివరాలు పొందుపరచుకుంటేనే కార్మికులకు చంద్రన్న బీమా పథకం వర్తిస్తుం డటంతో అనేక మంది ఈ బీమాను కోల్పోతున్నారు. చంద్రన్న బీమా పొందే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో తిరిగి స్మార్ట్‌ పల్స్‌ సర్వే చేపట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో జిల్లా యంత్రాంగం స్మార్ట్‌ పల్స్‌ సర్వేకు సిద్ధమవుతోంది.

4 లక్షల మంది వివరాలు పెండింగ్‌
2016 జూన్‌లో స్మార్ట్‌ పల్స్‌ సర్వేను జిల్లాలో ప్రారంభించారు. 2011 జనాభా లెక్కల ప్రకా రం జిల్లాలో 33 లక్షల 97 వేల 448 మంది ఉన్నారు. ఇటీవల కాలంలో వివిధ రకాలుగా నిర్వహించిన సర్వేలో ఆ సంఖ్య మరికొంత పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 34 లక్షల 9 వేల 28 మంది జనాభా ఉన్నట్లు యంత్రాంగం లెక్క కట్టింది. ఆరు నెలల పాటు ఏకధాటిగా నిర్వహించిన స్మార్ట్‌ పల్స్‌ సర్వేలో మొత్తం 14 లక్షల 2 వేల 284 ఇళ్లను ఎన్యూమరేటర్లు సందర్శించారు. ఆ ఇళ్లల్లో నివాసం  ఉంటున్న 30 లక్షల 5 వేల 658 మంది వివరాలను సేకరించగలిగారు. ఆ సమయంలోనే 4 లక్షల ఒక వెయ్యి 370 మంది వివరాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిలో ఎక్కువ శాతం పనుల కోసం ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు వలసలు వెళ్లిన వారు ఉన్నారు. అంతేగాకుండా ఆధార్‌లో తమ వివరాలు పొందుపరచుకోనివారు కూడా ఉన్నారు. అదే విధంగా కొంతమంది మరణించారు. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ పల్స్‌ సర్వేలో నమోదుకాని వివరాలు తిరిగి నమోదు చేయాలంటూ గతేడాది సెప్టెంబర్‌లో హడావుడి చేసినా ప్రభుత్వానికి సంబం« దింంచిన మిగిలిన కార్యక్రమాల్లో జిల్లా యం త్రాంగం బిజీ కావడంతో పెండింగ్‌లో ఉన్న స్మార్ట్‌ పల్స్‌ సర్వే వివరాలు అటకెక్కాయి.

సర్వే అంటేనే హడల్‌
స్మార్ట్‌ పల్స్‌ సర్వే పేరు వింటేనే ఎన్యూమరేటర్లు హడలిపోతున్నారు. ఈ సర్వేలో ఒక్కో కుటుంబానికి 50కి పైగా వివరాలు సేకరించాల్సి ఉంటుంది. ఆ సమయంలో ఎన్యూమరేటర్లుగా అంగన్‌వాడీ కార్యకర్తలు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, బిల్‌ కలెక్టర్లను నియమించారు. వారితో పాటు ఆ సమయంలో ఉపాధ్యాయులుగా ఎంపికై పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న వారిని కూడా స్మార్ట్‌ పల్స్‌ సర్వేకు వినియోగించారు. ఒకవైపు రెగ్యులర్‌ విధులు నిర్వహిస్తూ ఇంకోవైపు స్మార్ట్‌ పల్స్‌ సర్వే చేపట్టాల్సి రావడంతో ఎన్యూమరేటర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ఆరు నెలల పాటు తమతో అదనపు చాకిరీ చేయించుకొని సకాలంలో తమకు పారితోషికం చెల్లించకుండా ఇబ్బందులకు గురిచేయడంతో ఎన్యూమరేటర్లు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జిల్లా యంత్రాంగం వారికి దశలవారీగా పారితోషికాన్ని చెల్లించి వారిలోని ఆవేశాన్ని కొంతమేర చల్లార్చింది. తాజాగా మరోమారు స్మార్ట్‌ పల్స్‌ సర్వే చేయాల్సి రావడంతో ఎన్యూమరేటర్లుగా గతంలో విధులు నిర్వర్తించిన వారికి బలవంతంగా తిరిగి బాధ్యతలు అప్పగించే యోచనలో జిల్లా యంత్రాంగం నిమగ్నమైంది.

అంతర్గత ఆరా?
తాజాగా నిర్వహించనున్న స్మార్ట్‌ పల్స్‌ చెక్‌ పేరుతో ప్రభుత్వ పథకాలపై ఆరా తీయనున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ రకాల సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారా అనేదానిపై అంతర్గతంగా ఆరా తీయనున్నట్లు తెలిసింది. సార్వత్రిక ఎన్నికలె వస్తుండటంతో ప్రజల నాడి తెలుసుకునేందుకు కూడా ఈ సర్వే  ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement