ఒంగోలు, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సాధన కోసమే హైదరాబాద్‌లో ఈ నెల 26న సమైక్య శంఖారావం సభ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా కన్వీనర్ డాక్టర్ నూకసాని బాలాజీ చెప్పారు. రాష్ట్ర కమిటీ ముద్రించిన సమైక ్యశంఖారావం వాల్‌పోస్టర్‌ను స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మంగళవారం ఉదయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ సమైక్య శంఖారావం సభకు ప్రజలు పార్టీలకతీతంగా హాజరు కావాలని కోరారు. సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమన్నారు. విడిపోతే అభివృద్ధి జరుగుతుందని కొంతమంది చేసే ప్రచారంలో వాస్తవం లేదన్నారు. సమైక్య రాష్ట్రం కోసం పోరాటం చేస్తున్న ఏకైక పార్టీ వైఎస్సార్‌సీపీయేనని, పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సమైక్యాంధ్ర సాధ్యమవుతుందన్నారు. మహానేత వైఎస్‌ఆర్ మరణం తరువాత సంక్షేమ పథకాలు పేదల దరి చేరడం లేదని, ఆ సంక్షేమ పథకాలన్నీ ప్రజానీకానికి అందాలంటే జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అత్యంత దారుణమన్నారు.
రాష్ట్ర విభజనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని తెలంగాణలోని కొంతమంది రాజకీయ నాయకులు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీతో జగన్‌మోహన్‌రెడ్డి కుమ్మక్కయ్యారంటూ జిల్లాకు చెందిన కొందరు నాయకులు దుష్ర్పచారం చేయడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. సమైక్య శంఖారావం సభ ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణలోని అన్ని ప్రాంతాల ప్రజానీకానికి సంబంధించిందన్నారు. సభకు అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం హాజరై రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నినదించనున్నట్లు చెప్పారు. ‘రాష్ర్టం మొత్తం సమైక్యంగా ఉంటేనే ఢిల్లీతో పోరాడగలుగుతాం.
కావాల్సింది సాధించుకోగలుగుతాం. విడిపోతే నష్టమే. స్వార్థపరుల మాటలు విని మోసపోవద్దు’ అని బాలాజీ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డి, యువజన విభాగం జిల్లా కన్వీనర్ కేవీ రమణారెడ్డి, గిద్దలూరు నియోజకవర్గ సమన్వయకర్త వై.వెంకటేశ్వరరావు, నగర కన్వీనర్ కుప్పం ప్రసాద్, ట్రేడ్ యూనియన్ జిల్లా కన్వీనర్ కేవీ ప్రసాద్, మహిళా విభాగం జిల్లా కన్వీనర్ పోకల అనూరాధ, ప్రచార విభాగం జిల్లా కన్వీనర్ వేమూరి బుజ్జి, మహిళా విభాగం నగర కన్వీనర్ కావూరి సుశీల, నగర స్టీరింగ్ కమిటీ సభ్యుడు వల్లెపు మురళి పాల్గొన్నారు.
సమైక్య శంఖారావం సభను జయప్రదం చేయండి
Published Wed, Oct 23 2013 6:07 AM | Last Updated on Wed, Aug 8 2018 5:33 PM
Advertisement
Advertisement