విధి ఆటలో వారు పావులుగా మారారు....వారిది ఎవరూ తీర్చలేని బాధ. అయినా ధైర్యంగా ముందడుగు వేశారు. గుండెల్లో గూడుకట్టుకున్న విషాదానికి అక్కడే సమాధి చేశారు. లక్ష్యం చూపిన మార్గంలో పయనించారు. చిన్నచిన్న సమస్యలను ఎదుర్కోలేక వణికిపోతున్న యువతకు వారు మార్గదర్శకులయ్యారు. ఒకరు పుట్టెడు దుఃఖం, మరొకరు చర్మాన్ని దహించివేస్తున్న వ్యాధితో గురువారం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు.
బొబ్బిలి:నాన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన దుఃఖంలో ఒకరు.. శరీరాన్ని పట్టి పీడిస్తున్న రోగాన్ని అదిమిపట్టి మరొకరు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలకు గురువారం హాజరయ్యారు... విషాదంలో ఉన్నా కొండంత బలాన్ని తెచ్చుకుని పార్వతీపురం పట్టణంలోని కుసుమ గుడ్డి వీధికి చెందిన సంచాన శ్రీవల్లి భాస్కర కళాశాలలో పరీక్షకు హాజరైంది. అలాగే ఎనిమిదో ఏట నుంచి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చదువే లక్ష్యంగా బొబ్బిలి అంధుల పాఠశాలలో ఉంటున్న చిన్ని లక్ష్మి బొబ్బిలి వాసు జూనియర్ కళాశాలలో పరీక్షకు హాజరైంది. వీరిద్దరూ యువతీ, యువకులకు ఆదర్శంగా నిలిచారు.. వీటికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి..
పార్వతీపురం పట్టణంలోని కుసుమగుడ్డివీధికి చెందిన సంచాన శ్రీనివాసరావు టైలర్ వృత్తి చేస్తున్నాడు. స్నేహితుడి పెళ్లికి బయలుదేరి బొబ్బిలి సమీపంలో బుధవారం రాత్రి మృత్యువాత పడ్డాడు... తెల్లారితే కూతురు శ్రీవల్లికి పరీక్ష... మొదటి రోజు పరీక్షకు తానే ద గ్గరుండి దింపి ధైర్యం చెప్తానని ఇంట్లో చె ప్పి వెళ్లిన ఆయన మరణ వార్త గంటలోగానే కుటుంబ సభ్యులు వినాల్సి వచ్చింది. అప్పటి నుంచి కుటుంబ సభ్యులతో పాటు శ్రీవల్లి గుండలలిసేలా రోదిస్తోంది, తెల్లారగానే బొబ్బిలి వచ్చి తండ్రి మృతదేహాన్ని చూసి భోరుమంది... పరీక్ష రాయడానికి నన్ను ఎవరు తీసుకెళతారంటూ తండ్రి మృతదేహం వద్ద రోదించింది.. చివరకు తండ్రి మాటలు గుర్తుకు వచ్చి తాను చదివి ఉత్తీర్ణురాలై ప్రయోజకురాలుగా నిలబడతానని తనను తాను సముదాయించుకుంది. గుండెనిండా ధైర్యాన్ని నింపుకొని పార్వతీపురం వెళ్లి పరీక్షా కేంద్రంలో కూర్చుంది..
అలాగే శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మద్దివలస గ్రామానికి చెందిన చిన్ని లక్ష్మి చర్మ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. చిన్నప్పటి నుంచి కళ్లు కనపడకపోవడంతో బొబ్బిలి సమీపంలోని భోజరాజపురం వద్ద ఉన్న అంధుల పాఠశాలలో ఉంటూ చదువుతోంది. ఆమె నాలుగో తరగతిలో ఉండగానే క్యాన్సర్ సోకింది. అప్పటి నుంచి అటు తల్లిదండ్రులు, ఇటు పాఠశాల యాజమాన్యం మందులు ఇప్పిస్తున్నారు.. ఆ వ్యాధి రోజు రోజుకూ ఎక్కువవుతూ వచ్చింది. రోగం ముదురుతున్నా చదువు కోవాలన్న పట్టుదల లక్ష్మిలో మరింత పెరిగింది.
ఆ వ్యాధితో బాధపడుతూనే పదో తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. గురువారం నుంచి ప్రారంభమైన ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షకు స్థానిక వాసు జూనియర్ కళాశాలకు హాజరైంది. పాఠశాల యాజమాన్యం ప్రోత్సాహంతో తాను ఇంతవరకూ వచ్చానని, తనకు టీచరు కావాలని ఆశగా ఉందని లక్ష్మి చెబుతోంది. లక్ష్మి పరీక్షలు రాసేందుకు సహాయకారిగా (స్క్రైబ్) అవసరమున్నా ఏ విద్యార్థీ రావడానికి సుముఖత చూపకపోవడంతో అంధుల పాఠశాల టీచర్‌నే ఇందుకు వినియోగించారు. లక్ష్మి ఎంత వరకూ చదివితే అంతవరకూ అండగా ఉంటామని అంధుల పాఠశాల ప్రిన్సిపాల్ పాల్సన్ చెప్పారు.
బాధను దిగమింగి...
Published Fri, Mar 13 2015 2:46 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement