
ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలుపుతున్న జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు
పటమట(విజయవాడ): ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా పోరాడాల్సిన అవసరం ఉందని, హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రత్యేక హోదా సాధన జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు అన్నారు. మంగళవారం ప్రత్యేక హోదా కోరుతూ వివిధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం కాంప్లెక్స్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. విభజన చట్టంలో పొందుపరచిన అంశాలు ఒక్కటి కూడా నెరవేర్చకపోవటం బాధాకరమన్నారు. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేని నాయకులు పదవుల్లో ఉన్నంతకాలం రాష్ట్ర భవిష్యత్తు అంధకారంలోనే ఉంటుందని అన్నారు. కార్యక్రంమలో వివిధ విద్యార్థి సంఘాల ప్రతినిధులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.
మౌన ప్రదర్శన
తెలుగుయువత నగర ఉపాధ్యక్షుడు బెజవాడ నజీర్ ఆధ్వర్యంలో ప్రత్యేక హోదా కోరుతూ మౌన ప్రదర్శన జరిగింది. పటమట 9వ డివిజన్‌లోని పంటకాల్వ రోడ్డులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎన్నికల ముందు ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని విన్మరించిందని విమర్శించారు.
ప్రత్యేకహోదాతోనే రాష్ట్రాభివృద్ధి
చిలకలపూడి(మచిలీపట్నం): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తేనే అభివృద్ధి చెందుతుందని ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణాశాఖ అధ్యక్షుడు ఉల్లి కృష్ణ అన్నారు. సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేకహోదా సాధన కోసం స్థానిక ఎన్జీవో హోమ్ నుంచి కోనేరుసెంటరు వరకు మంగళవారం ర్యాలీ నిర్వహించారు. ఉల్లి కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించినప్పుడు చట్టంలో రూపొందించిన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సి ఉందన్నారు. రాష్ట్రం లోటుబడ్జెట్‌లో ఉండటంతో కొత్త రాష్ట్రం కావటంతో ప్రత్యేక నిధులు ఇవ్వాలన్నారు. 8, 10 షెడ్యూల్‌లోని ఆస్తులను వెంటనే పంపిణీ చేయాలని విశాఖ రైల్వేజోన్‌ను ఏర్పాటు చేసి కడపకు ఉక్కు కర్మాగారం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలన్నారు. ఏపీ ఎన్జీవో అసోసియేషన్ తూర్పు కృష్ణా కార్యదర్శి దారపు శ్రీనివాస్, సంఘ నాయకులు కెఎ ఉమామహేశ్వరరావు, టి.నాగరాజు, లెనిన్‌బాబు, పీవీ సాయికుమార్, ఎ.శ్రీనివాసరావు, ఎల్‌వీ సూర్యకుమార్, ఎ.వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, వి.సీతారామ య్య, కె.గౌరి, ఎ.రమాదేవి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment