రాజధాని మోడల్ సిటీగా ఉండాలి | capital of the City should be the model city - ys jagan | Sakshi
Sakshi News home page

రాజధాని మోడల్ సిటీగా ఉండాలి

Published Wed, Jul 30 2014 2:16 AM | Last Updated on Wed, Oct 17 2018 3:49 PM

రాజధాని మోడల్ సిటీగా ఉండాలి - Sakshi

రాజధాని మోడల్ సిటీగా ఉండాలి

వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి
ప్రభుత్వ భూములు ఎక్కడ ఉంటే అక్కడే రాజధానిని నిర్మించాలి
అన్ని పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి
ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకునేలా ఒత్తిడి తేవాలన్న సిటిజన్ ఫోరం

 
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఒక మోడల్ సిటీగా కొత్త రాజధానిని నిర్మించాల్సిన అవసరం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ భూములు ఎక్కడ అందుబాటులో ఉంటే అక్కడే రాజధాని నిర్మించాలన్నది తమ పార్టీ అభిప్రాయమని చెప్పారు. రాజ ధాని నిర్మాణానికి కనీసం 30 వేల ఎకరాల భూమి అవసరం ఉంటుందని, ప్రభుత్వ భూములైతే వనరుల సమీకరణకు కూడా ఇబ్బందులు లేకుండా సరికొత్త మోడల్ సిటీగా, భవిష్యత్తు అవసరాలను తీర్చేదిగా కొత్త రాజధానిని నిర్మించుకోవచ్చన్నారు. ఇదే అంశాన్ని తాను శాసనసభలోనూ చెప్పానని గుర్తుచేశారు. మంగళవారం సిటిజన్ ఫోరం ప్రతినిధులు లోటస్‌పాండ్‌లో జగన్‌తో సమావేశమయ్యారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి తమ అభిప్రాయాలతో కూడిన ఒక వినతిపత్రాన్ని అందజేశారు. రాజధాని కోసం ప్రైవేటు భూములను సేకరించడం వల్ల వనరులతోపాటు అనేక సమస్యలు తలెత్తుతాయని, అందువల్ల ప్రభుత్వ భూములు ఉన్నచోటే కొత్త రాజధానిని నిర్మించుకోవాలన్నది తమ పార్టీ అభిప్రాయమని జగన్ ఫోరం ప్రతినిధులకు వివరించారు. రాజధాని ఎంపిక విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటే మంచిదని చెప్పారు.

మరో విభజనకు దారితీయకూడదు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు అత్యంత కీలకమైన రాజధాని ఎంపిక విషయంలో తగిన నిర్ణయం తీసుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని జగన్‌ను కోరినట్టు సిటిజన్ ఫోరం ప్రతినిధులు చెప్పారు. జగన్‌తో సమావేశానంతరం వారు విలేకరులతో మాట్లాడారు. రాజధాని ప్రాంతం పేరిట ప్రాంతీయ వాదం తలెత్తి మరోసారి రాష్ట్ర విభజనకు దారి తీయకుండా నిర్ణయం ఉండాలన్నారు. తెలంగాణ విడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో నూతన రాజధానిని రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి ఒక వేళ రాయలసీమ అనువైన ప్రాంతం కాకపోతే అందరికీ అందుబాటులో ఉండే ప్రకాశం జిల్లా దొనకొండ పరిసర ప్రాంతాలను ఎంపిక చేస్తే బాగుంటుందనే విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. ప్రస్తుతం రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్న ప్రాంతం ఇప్పటికే అభివృద్ధి చెందిందని, అందువల్ల వెనుకబడిన ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేస్తే ఆ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని వారు పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలోని దొనకొండ, కురిచేడు, కొనకలమెట్ల, మార్కాపురం, పెద్దారవీడు, దర్శి, పొదిలి, త్రిపురాంతకం ప్రాంతాల్లో ఎక్కువగా ఖాళీ భూములున్న కారణంగా రాజధాని అక్కడ ఏర్పాటు చేసినా అన్ని ప్రాంతాల వారికీ సమాన దూరం ఉంటుందని తెలిపారు. ఇక్కడ దాదాపు 1.50 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉన్నందున ప్రైవేటు భూములు సేకరించాల్సిన అవసరం ఉండదని వివరించారు. చుట్టూ నాగార్జునసాగర్, శ్రీశైలం, వెలిగొండ ప్రాజెక్టులు ఉన్నందున అవసరమైతే ఆయా ప్రాజెక్టుల నుంచి కూడా నీటిని ఉపయోగించుకునే అవకాశముందని చెప్పారు. ఫోరం ప్రతినిధులు మాజీ ఐపీఎస్ అధికారి సి.ఆంజనేయరెడ్డి, ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె.జయభారత్‌రెడ్డి, రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి, ఆయా రంగాల నిపుణులు భూమన సుబ్రహ్మణ్యరెడ్డి, వెంకటస్వామి, ఎ.హన్మంత్‌రెడ్డి, జి.ఆర్.రెడ్డి, కాసా జగన్ మోహన్‌రెడ్డి, వీఎల్‌ఎన్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, చండ్రాయుడు, దశరథరామిరెడ్డి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement