- చీరాల మున్సిపాలిటీలో వట్టిపోతున్న వర్మీ కంపోస్టు యూనిట్లు
- అవగాహన రాహిత్యంతో, ప్రారంభించిన నెలలోపు ఒకటి మూత
- రెండు యూనిట్లలో అరకొరగా తయారీ
- ఎండలకు చనిపోతున్న వానపాములు
- వర్మికంపోస్టు ఎరువు ధర అధికంగా ఉండడంతో ముందుకురాని కొనుగోలుదారులు
చీరాల రూరల్, న్యూస్‌లైన్ : లక్షలు వెచ్చించి ఏర్పాటు చేసిన వర్మీ కంపోస్టు యూనిట్లు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. ఆదాయం రాకపోవడం, నిర్వహణ పెరిగిపోవడంతో నిరుపయోగంగా మారుతున్నాయి. జిల్లా మొత్తమ్మీద చీరాలలో మాత్రమే ఈ యూనిట్లు ఉన్నాయని గొప్పలు చెప్పుకునే అధికారులు వాటిని సద్వినియోగం చేసుకుని మున్సిపాలిటీకి ఆదాయం సమకూర్చడంలో ఘోరంగా విఫలమవుతున్నారు.
స్థానిక ఎన్‌ఆర్‌అండ్‌పీఎం ఉన్నత పాఠశాలకు సమీపంలో రెండు వ ర్మీ కంపోస్టు యూనిట్లు, కారంచేడు రోడ్డులో ఒక యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో దానికి రూ.15 లక్షల వరకు ఖర్చు చేశారు. వాటికి విద్యుత్‌తో పాటు నీటి వసతి, యూనిట్‌లో పనిచేసేందుకు ఐదుగురు కార్మికులను ఏర్పాటు చేశారు. కారంచేడు రోడ్డులో ఏర్పాటు చేసిన యూనిట్ నిర్మించిన నెలలోపే మూసివేశారు. యూనిట్ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు సామగ్రితో సహా విద్యుత్ మీటరు ఇనుపకంచెలు దొంగల పరమయ్యాయి.
ఎన్‌ఆర్‌అండ్‌పీఎం ఉన్నత పాఠశాలకు సమీపంలో ఏర్పాటు చేసిన రెండు యూనిట్లలో మాత్రం పనులు ప్రారంభించారు. రెండు యూనిట్లలో పనులు చేసేందుకు ఐదుగురు మున్సిపల్ కాంట్రాక్టు కార్మికులను నియమించారు. వారికి నెలకు రూ.35వేలు వరకు మున్సిపాలిటీ జీతాలు చెల్లించాల్సి ఉంది. అంతేకాక విద్యుత్ చార్జీలు నెలకు రూ.500 నుంచి 1000 వరకు ఉంటుంది. రెండు టన్నుల ఎరువును తయారుచేయడానికి కార్మికులకు మూడు నెలల సమయం పడుతుంది. యూనిట్‌లో తయారైన ఎరువు కేజి రూ.20గా మున్సిపల్ అధికారులు నిర్ణయించారు.
రెండు టన్నుల ఎరువు రూ.20 లెక్కన రూ.40వేలు అవుతుంది అంటే మూడు నెలలకు కేవలం రూ.40వేలు మాత్రమే ఆదాయం వస్తుం దన్న మాట. రెండు యూనిట్లలో పనిచేసే సిబ్బందికి జీతాలు నెలకు రూ.35వేలు పైమాటే, వాటి నిర్వహణకు అదనంగా మరో రూ.2వేలు ఖర్చవుతుంది. అంటే సిబ్బందికి, వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు లక్షపైమాటే. యూనిట్‌లో తయారయ్యే కేజీ ఎరువు రూ.20గా నిర్ణయించడంతో కొనుగోలుదారులూ ముందుకు రావడంలేదు. మూడు నెలలుగా తయారైన ఎరువు యూనిట్‌లోనే మగ్గిపోతుంది. యూనిట్లలో వచ్చే ఆదాయంతో పోల్చితే ఉత్పత్తికి అయ్యే ఖర్చే అధికంగా ఉంటుంది.
చనిపోతున్న వానపాములు
ఎండాకాలం కావడంతో వానపాములు చనిపోతున్నాయి. అవి చనిపోకుండా ఉండాలంటే వాటికి పూర్తిస్థాయిలో నీరు పెట్టాల్సి ఉంది. కానీ విద్యుత్ కోతలు అధికంగా ఉండడంతో యూనిట్లకు నీరుపెట్టడం లేదు. ఆదాయం కంటే యూనిట్లకు అయ్యే ఖర్చు అధికంగా ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై శానిటరీ సూపర్‌వైజర్ బషీర్‌ను ఁన్యూస్‌లైన్* వివరణ కోరగా యూనిట్ల నుంచి వచ్చే ఆదాయం కంటే వాటి నిర్వహణకు అయ్యే ఖర్చు అధికంగా ఉన్నమాట వాస్తమేనన్నారు. కానీ యూనిట్లు నెలకొల్పింది ఆదాయం కోసం కాదని ఇళ్లు, మార్కెట్ల నుంచి వచ్చే వ్యర్థాలను తొలగించేందుకు మాత్రమేనని, పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగమే యూనిట్లు ఏర్పాటని చెప్పారు.
ఆదాయం గోరంత.. ఖర్చు కొండంత
Published Fri, May 23 2014 4:22 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement
Advertisement