నాకిది..నీకది.. | corruptions in chirala municipality | Sakshi
Sakshi News home page

నాకిది..నీకది..

Published Sun, Feb 9 2014 3:53 AM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM

corruptions in chirala municipality

 చీరాల, న్యూస్‌లైన్ : ‘అందరం అధికార పార్టీకి చెందినవారమే. మన మధ్య వివాదాలొద్దు. పోటీలూ వద్దు. పనులన్నీ వాటాలుగా పంచుకుందాం. నిబంధనలతో మనకు పనిలేదు. అధికారులంతా మనకు అనుకూలమే. వారికి ముట్టచెప్పాల్సినవి ముట్టచెప్తే సరి. ఎటువంటి సమస్య ఉండదని’ అంటున్నారు చీరాల మున్సిపాలిటీలోని కాంట్రాక్టర్లు. అందినకాడికి దండుకునేందుకు నిబంధనలు తుంగలో తొక్కారు.

ఈ-ప్రొక్యూర్‌మెంట్ టెండర్లను అనుకూలంగా మార్చుకుని పనులను వాటాలుగా పంచుకుంటున్నారు. టెండర్ల వ్యవహారంలో అక్రమాలు చోటుచేసుకున్నా మున్సిపల్ అధికారులెవ్వరూ నోరుమెదపడంలేదు. పర్సంటేజీలు పుచ్చుకుని మిన్నకుండిపోయారన్న ఆరోపణలున్నాయి. చీరాల మున్సిపాలిటీలో కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నిబంధనల ప్రకారం లక్ష రూపాయలు దాటి తే ఈ-ప్రొక్యూర్‌మెంట్ విధానంలో టెండర్లు నిర్వహించాల్సి ఉంది. ఏ ప్రాంతం వారైనా టెండర్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. కానీ ఇటువంటిదేమీ ఇక్కడ జరగడం లేదు.

 బయటి వ్యక్తులు, అధికార పార్టీ అండదండలేని వారు టెండర్లు వేస్తే వాటిని ఏదో కారణంతో తిరస్కరించడంతో పాటు ఒక పనులు చేసినా బిల్లులివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో బయటి వ్యక్తులెవరూ టెండర్లలో పాల్గొనడంలేదు. కొంతకాలం నుంచి ఉన్నా అధికార పార్టీ అండదండలున్న కాంట్రాక్టర్లు మాత్రమే ఒక ‘పద్ధతి’ ప్రకారం పనులు పంచుకుంటున్నారు. వారుమాత్రమే అంచనాల రేట్లకు, లేదంటే నాలుగుశాతం తక్కువకు టెండర్లు వేస్తున్నారు.  సింగిల్ టెండర్‌ను ఆమోదించడం సాధ్యం కాకపోవడంతో మరో డమ్మీ టెండరును వేస్తున్నారు. దక్కించుకున్న పనులను పంచుకుంటున్నారు.

 మున్సిపాలిటీలో నాన్‌ప్లాన్ గ్రాంట్ కింద 1.5 కోట్లతో రోడ్లు, డ్రైనేజీలు వంటి పనులకు టెండర్లు పిలిచారు. జనరల్ ఫండ్ కింద 10 లక్షలతో టెండర్లు జరిగాయి. అలానే పీఆర్సీ బిల్డింగ్ నిధులు 17 లక్షలతో అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఎస్‌ఎఫ్‌టీ గ్రాంట్ 70 లక్షలతో డివైడర్ల అభివృద్ధి, మంచినీటి పైపులైను పనులు జరుగుతున్నాయి. ఇవన్నీ అధికార పార్టీ నాయకులే పలహారంగా పంచుకున్నారు.  
 
 పారిశుధ్య కాంట్రాక్టు పనులు కూడా పంపిణీనే..  
 మున్సిపాలిటీలోని నాలుగు డివిజన్లలో పారిశుధ్య పనులు నిర్వహించేందుకు గాను ఒకటో డివిజన్‌లో 11 మంది, 2వ డివిజన్‌లో 39 మంది, 3వ డివిజన్‌లో 33, 4వ డివిజన్‌లో 140 మంది పనిచేస్తున్నారు. మొత్తం 235 మంది కాంట్రాక్టు కార్మికులు పారిశుధ్య పనుల్లో ఉన్నారు. వీరికి నిబంధనల ప్రకారం కాంట్రాక్టు కార్మిక సొసైటీలకు మాత్రమే పనులివ్వాలి. అందులో కూడా 235 మంది కార్మికులు ఆ సొసైటీల్లో సభ్యులై ఉండాలి.

కానీ అటువంటిదేమీ లేదు. అధికార పార్టీ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, కొందరు యూనియన్ నాయకులకు శనివారం పనుల పందేరం జరిగింది. దీంతో కార్మికులు నష్టపోవాల్సి వచ్చింది. ఒక్కో కాంట్రాక్టు కార్మికుడికి మున్సిపాలిటీ నెలకు 6700 చెల్లిస్తోంది. ఈఎస్‌ఐ, పీఎఫ్ పోను 5775 కాంట్రాక్టు కార్మికుల ఖాతాల్లోకి జమవుతుంది.

అయితే బోగస్ సొసైటీలు నడుపుతున్న వారు కాంట్రాక్టు కార్మికుల బ్యాంకు ఖాతాల ఏటీఎం కార్డులు వారి వద్దనే ఉంచుకుని ప్రతినెలా వారి ఖాతా నుంచి డ్రా చేసుకుంటారు. ఆ తర్వాత ఒక్కొక్క కార్మికుడికి 3 లేదా 4 వేలు మాత్రమే అందిస్తారు. ఇదేమిటని అడిగే నాథుడే లేరు. కాంట్రాక్టు కార్మికులు ఎవరైనా ప్రశ్నిస్తే ఆ  కార్మికుడికి మరుసటి రోజు నుంచి పని ఉండదు. దీంతో వారు బాధను దిగమింగుకుని మౌనం దాలుస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement