- రాజమహేంద్రవరంలో డ్రైనేజీలు, జంక‌్షన్ల విస్తరణ
- ముంపు, ట్రాఫిక్ సమస్యలకు చెక్
- దశాబ్దాల సమస్యలకు పరిష్కారం
- స్థలాలు కోల్పోతున్నవారికి టీడీఆర్ బాండ్లు
- విక్రయించే అవకాశం ఉండడంతో అంగీకరిస్తున్న స్థల యజమానులు
సాక్షి, రాజమహేంద్రవరం : సాంస్కృతిక రాజధాని రాజమహేంద్రవరం రూపురేఖలు మారనున్నాయి. దశాబ్దాల నుంచి ఉన్న డ్రైనేజీ, ట్రాఫిక్ సమస్యల పరిష్కారంపై నగరపాలక సంస్థ యంత్రాంగం దృష్టి పెట్టింది. పెరిగిన అవసరాలకు అనుగుణంగా బ్రిటిష్ కాలం నాటి డ్రైనేజీలు, జంక‌్షన్లను విస్తరించే పనిని ఆరంభించింది. ఉభయ గోదావరి జిల్లాల వాణిజ్య రాజధానిగా భాసిల్లుతున్న రాజమహేంద్రవరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. పెరిగిన నగర పరిధికి అనుగుణంగా రోడ్లను విస్తరించలేదు. పలు కారణాలవల్ల 1975 మాస్టర్‌ప్లాన్ పూర్తిస్థాయిలో అమలు జరగలేదు. వై జంక‌్షన్ నుంచి లాలాచెరువు వరకూ ఉన్న గ్రాండ్ ట్రంక్ రోడ్డు (జీఎన్‌టీ) రోడ్డు తప్ప నగరంలో మరే రోడ్డు 100 అడుగులు లేదు. అలాగే నగరంలోని అనేక జంక‌్షన్లు ఇరుకుగా ఉన్నాయి. దీనికితోడు ఆక్రమణల వల్ల ఆయా జంక‌్షన్లలో తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా కంబాలచెరువు, తాడితోట, దేవీచౌక్, ఏవీ అప్పారావు రోడ్డు, జాంపేట, శ్యామలా సెంటర్, షెల్టాన్ హోటల్, ఆర్టీసీ కాంప్లెక్స్ తదితర జంక‌్షన్లలో వాహనాల రద్దీ తీవ్రంగా ఉంటోంది. సిగ్నల్ వ్యవస్థ కూడా సరిగా పని చేయకపోవడంతో తరచూ ఆయా జంక‌్షన్ల వద్ద ట్రాఫిక్ జామ్ అవుతోంది. జంక‌్షన్లు, డ్రైనేజీలను విస్తరించాలన్న ప్రతిపాదనలు చాలా కాలం నుంచి ఉన్నా అవి ఆచరణలోకి రాలేదు. 2015 పుష్కరాలకు ఈ పనులు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ భావించినా సాధ్యపడలేదు. తాజాగా 2031 నాటికి నగర అభివృద్ధిని ఊహిస్తూ రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌కు నగరపాలక సంస్థ ఆమోద ముద్ర వేసింది. దానికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ కావడమే ఇక మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో నగరంలోని ముఖ్యమైన డ్రైనేజీలు, జంక‌్షన్లను విస్తరించే పనిలో నగరపాలక సంస్థ యంత్రాంగం నిమగ్నమై ఉంది.
తాడితోట జంక‌్షన్ నుంచే ఆరంభం
నగరంలో జంక‌్షన్లు విస్తరించే పనిని నగరపాలక సంస్థ యంత్రాంగం తాడితోట నుంచి ప్రారంభించింది. ప్రస్తుతం ఇక్కడ రోడ్డు వెడల్పు దాదాపు 45 నుంచి 50 అడుగులు ఉంది. పాత మాస్టర్‌ప్లాన్ (1975) ప్రకారం ఈ రోడ్డును 80 అడుగులకు విస్తరించాల్సి ఉన్నా జరగలేదు. రైల్వే అండర్‌పాస్ బ్రిడ్జి నుంచి మోరంపూడి వెళ్లే వైపు దుకాణాలను అధికారులు తొలగిస్తున్నారు. రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ అధారంగా ఇరువైపులా 40 అడుగుల చొప్పన 80 అడుగుల మేర రోడ్డు ఉండేలా భననాలను తొలగించాలని నిర్ణయించి అమలు చేస్తున్నారు. స్థలాలను కోల్పోతున్నవారికి నష్టపరిహారంగా ట్రాన్సఫరబుల్ డెవలప్‌మెంట్ రైట్(టీడీఆర్) బాండ్లు జారీ చేస్తున్నారు. ఇప్పటికే ఆరుగురికి వారు కోల్పోతున్న స్థలానికి అనుగుణంగా బాండ్లు పంపిణీ చేశారు.
డ్రైనేజీ విస్తరణ షురూ
బ్రిటిషు కాలం నాటి డ్రైనేజీ వల్ల వర్షాకాలంలో తరచూ నగరం ముంపునకు గురవుతోంది. జంక‌్షన్ల వద్ద ఈ సమస్య ఎక్కువగా ఉంటోంది. చిన్నపాటి వర్షం కురిసినా శ్యామలా సెంటర్, తాడితోట సెంటర్ తదితర ప్రాంతాల్లో రోడ్లు మోకాలు లోతు నీళ్లలో మునిగిపోతాయి. వర్షపు నీరు వేగంగా వెళ్లేందుకు అనువైన వెడల్పుతో డ్రైనేజీలు లేకపోవడమే సమస్యకు అసలు కారణం. ఈ నేపథ్యంలో డ్రైనేజీ వ్యవస్థను సమూలంగా మార్చే చర్యలను నగరపాలక సంస్థ ఆరంభించింది. పాత డ్రైన్ల స్థానంలో కొత్తగా అవసరానికి తగినట్లు వెడల్పు చేస్తూ నిర్మిస్తోంది. ఇప్పటికే దేవీచౌక్‌లో పూర్తి చేయగా, పేపర్‌మిల్లు రోడ్డు, జాంపేట, తాడితోట ప్రాంతాల్లో డ్రైనేజీలకు అవసరమైన స్థలం కోసం నిర్మాణాలను తొలగిస్తోంది. తాడితోట నుంచి షెల్టాన్ హోటల్ వరకూ పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగులకు రోడ్డును విస్తరించేందుకు యంత్రాంగం పని చేస్తోంది. దీనికోసం ముందుగా కుడివైపు మార్కింగ్ చేసిన మేరకు భవనాలను తొలగిస్తోంది.
టీడీఆర్ బాండ్ అంటే?
రోడ్ల విస్తరణ లేదా మరే ఇతర అభివృద్ధి పనులకైనా ప్రైవేటు స్థలాలను ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందుకు స్థల యజమానులకు పరిహారంగా నగదు, లేని పక్షంలో టీడీఆర్ బాండ్లు ఇస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలోని విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో స్థల యజమానులకు ఈ తరహా బాండ్లు ఇచ్చే పద్ధతి అమలు జరుగుతోంది. ఈ విధానంలో యజమాని కోల్పోయే స్థలం (గజం) రిజిస్ట్రేషన్ విలువను పొందుపరుస్తూ, నష్టపోతున్న స్థలానికి రెట్టింపు విలువతో టీడీఆర్ బాండ్ ఇస్తారు. ఉదాహరణకు 10 గజాల స్థలం (గజం విలువ రూ.25 వేలు) కోల్పోతున్న యజమానికి 20 గజాల విలువైన బాండ్‌ను జారీ చేస్తారు. ఈ విధానాన్ని జిల్లాలోనే మొదటిసారిగా రాజమహేంద్రవరంలో అమలు చేస్తున్నారు.
టీడీఆర్ బాండ్ వల్ల లాభమేంటంటే..
టీడీఆర్ బాండ్ తీసుకున్న వ్యక్తి తాను కోల్పోయిన స్థలానికి రెట్టింపు నిర్మాణం ఆదే ప్రాంతంలో చేపట్టవచ్చు. ఉదాహరణకు 300 గజాల స్థలంలో 50 గజాలు రోడ్డు విస్తరణలో కోల్పోతే మిగిలిన 250 గజాల్లో నిబంధనల ప్రకారం పరిమితి మేరకు భవన నిర్మాణం చేపట్టవచ్చు. యజమాని తాను కోల్పోయిన 50 గజాల స్థలం మేరకు రెట్టింపు (100 గజాలు) విస్తీర్ణంతో ఆ భవనం పైన మరో అంతస్తు నిర్మించుకోవచ్చు. ఇందుకు నగరపాలక సంస్థ ఎలాంటి అభ్యంతరమూ చెప్పదు. లేదంటే ఈ బాండ్లను విక్రయించుకోవచ్చు. ఇప్పటికే నిబంధనలకు విరుద్ధంగా భవనాలు నిర్మించినవారు వీటిని కొనుగోలు చేస్తే ఆ భవనాన్ని సక్రమమైనదిగా నగరపాలక సంస్థ గుర్తిస్తుంది. ఈ వెలుసుబాటు ఉండడంతో స్థల యజమానులు కూడా టీడీఆర్ బాండ్లు తీసుకునేందుకు అంగీకరిస్తున్నారు.
స్థల యజమానులు సహకరిస్తున్నారు
నగరంలో ట్రాఫిక్, ముంపు సమస్య లేకుండా జంక‌్షన్లు, డ్రైనేజీలను విస్తరిస్తున్నాం. ఇప్పటికే పలుచోట్ల డ్రైనేజీలు విస్తరించే పని ప్రారంభించాం. తాడితోట నుంచి షెల్టాన్ వరకూ ప్రస్తుతం పాత మాస్టర్‌ప్లాన్ ప్రకారం 80 అడుగుల మేరకు భవనాలు తొలగిస్తున్నాం. కొత్త మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం లభించాక అందులో నిర్ణయాలను 2031లోపు ఎప్పడైనా అమలు చేయవచ్చు. స్థల యజమానులకు టీడీఆర్ బాండ్లు జారీ చేస్తున్నాం.