‘పచ్చ’ వాకిళ్లు పదిలం
‘పచ్చ’ వాకిళ్లు పదిలం
Published Mon, Mar 6 2017 11:59 PM | Last Updated on Sat, Sep 29 2018 5:10 PM
-ఇతరులవి పొక్లెయిన్ కోరలకు ఫలహారం
-మురుగుకాలుల నిర్మాణంలో ద్వంద్వనీతి
-టీడీపీ నేతల ప్రాబల్యంతో అధికారుల వివక్ష
రాజమహేంద్రవరం సిటీ : నగరంలో మురుగుకాలువల నిర్మాణంలో ‘సమన్యాయం’ అనే దానిపై ‘పొక్లెయిన్’ కోరల్లో నుజ్జునుజ్జవుతోంది. నిర్మాణానికి అడ్డం వచ్చే ఇళ్లలో అధికార టీడీపీ వాళ్లవి ఉంటే కాలువ దారిని అష్టవంకరలతో మళ్లిసున్నారు. అదే మిగిలిన వారి ఇళ్లు అడ్డం వస్తే నిస్సంకోచంగా పగులగొట్టి నిర్మాణం సాగిస్తున్నారు. నగరంలో దాదాపు రూ.7 కోట్ల వ్యయంతో పాతకాలపు మురుగు కాలువల పునర్నిర్మాణం చేపట్టారు. నగరాభివృద్ధిలో భాగంగా చేపడుతున్న నిర్మాణాలకు ఎవరికి చెందిన అక్రమ కట్టడాలు అడ్డంకిగా ఉన్నా తొలగించాల్సిన అధికారులు ద్వంద్వనీతిని అనుసరిస్తున్నారు.
‘దేశం’ వారి నివాసాల వద్ద ఒంపులే ఒంపులు
కాలువల నిర్మాణానికి ఆటంకమయ్యే ఆక్రమణలను తొలగించాల్సిన నగర పాలక సంస్థ ఇంజినీరింగ్ అధికారులు అధికార పార్టీకి చెందిన వారికి ఓ న్యాయం, మిగిలిన వారికి ఇంకో న్యాయం అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అధికార పార్టీ వారి కట్టడాలున్న చోట వాటి జోలికి పోకుండా ఒంపులతో కాలువ నిర్మిస్తూ.. అదే మిగిలిన వారి కట్టడాలు అడ్డంగా ఉంటే ఆగమేఘాల మీద జేసీబీలతో తొలగిస్తున్నారు.
ఏవీ అప్పారావు రోడ్‌లో వైట్‌హౌస్ ఎదురుగా శ్రీనివాసా గార్డెన్స్‌లో కాలువ నిర్మాణం ఓ అధికార పార్టీ నాయకుని ఇంటి వరకూ తిన్నగానే సాగింది. అక్కడి నుంచి నిర్మాణం తిన్నగా జరగాలంటే ఆ నాయకుని ఇంటి మెట్లతో పాటు మూడడుగుల మేర అడ్డంగా ఉన్నాయి. అంత మేరా అడ్డంకిని తొలగించి, కాలువను తిన్నగా నిర్మించాల్సిన అధికారులు.. ఆ ఇంటి దిగువమెట్టుపైన కూడా కనీసం గునపు మొన పడకుండా కాలువను వంపు తిప్పి నిర్మించారు. అలాగే దేవీచౌక్‌లో కూడా అధికార పార్టీ వారి భవనం చెక్కు చెదరకుండా కాలువనే దారి మళ్లించారు.
కమిషనర్ ఏమంటారు?
అధికార పార్టీ ప్రజాప్రతినిధుల ప్రాబలత్యంతో ఇంజినీరింగ్ అధికారులు ప్రదర్శిస్తున్న వివక్ష నగరవాసులను విస్మయపరుస్తోంది. అధికార పార్టీకి చెందిన వారి కట్టడాల మెట్లను సైతం ముట్టుకోకుండా ఎంతైనా ఒంపులు తిప్పి కాలువలు నిర్మిస్తున్న అధికారులు ఇతరుల ఇళ్లను, నిర్మాణాలను తక్షణమే తొలగించడంపై ధ్వజమెత్తుతున్నారు. అధికార పార్టీ వారికో న్యాయం, ఇతరులకో న్యాయం అమలు చేయడంపై మండిపడుతున్నారు. పారదర్శకతకు పెద్ద పీట వేస్తున్నట్టు చెప్పే కమిషనర్ విజయరామరాజు కాలువల నిర్మాణంలో బాహాటంగా జరుగుతున్న ఈ వివక్షపై ఏమంటారని ప్రశ్నిస్తున్నారు.
Advertisement