మచిలీపట్నం : చారిత్రక నేపథ్యం ఉన్న బందరు పట్టణంలో ఇప్పటికీ కనీస వసతులు నామమాత్రంగానే ఉన్నాయి. రోడ్లు, డ్రెయిన్లు, తాగునీటి సమస్య వంటివి పట్టణ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం 2015లో అటల్ మిషన్ ఫర్ రెజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫార్మేషన్ (అమృత్) పథకంలో మచిలీపట్నం మున్సిపాలిటీకి చోటు కల్పించింది. కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున నిధులు వస్తాయని పాలకులు ప్రచారం చేశారు. రూ.613 కోట్లతో ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయినా 2015–16వ ఆర్థిక సంవత్సరంలో
కేవలం రూ.3.14 కోట్లు మాత్రమే నిధులు మంజూరయ్యాయి. అమృత్ పథకంలో మచిలీపట్నం పురపాలక సంఘం చేరినా అందుకు అనుగుణంగా పనులు జరగని పరిస్థితి నెలకొంది. పట్టణంలో ప్రతి వీధిలోనూ పాత తాగునీటి పైప్‌లైన్ స్థానంలో నూతన పైప్‌లైన్ వేసేందుకు ఇటీవల సర్వే నిర్వహించారు. ఈ ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రెండేళ్లలో ఎటువంటి పనులు చేయకపోడంతో అమృత్ పథకం అక్కరకు వచ్చేనా.. అని పట్టణ వాసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.
ప్రతిపాదనలు ఇలా...
మచిలీపట్నం పురపాలక సంఘాన్ని అమృత్ ప్రాజెక్టులో చేర్చడంతో భారీగా అభివృద్ధి పనులు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి పురపాలక సంఘం ద్వారా ప్రతిపాదనలు పంపారు. మంచినీటి సరఫరాకు రూ.246.25 కోట్లు, భూగర్భ డ్రెయినేజీకి రూ.222.59 కోట్లు, వరద నీటి పారుదల డ్రెయినేజీకి రూ.84.69 కోట్లు, అర్బన్ ట్రాన్స్‌పోర్ట్‌కు రూ.49.60 కోట్లు, గ్రీనరీ, పార్కుల అభివృద్ధికి రూ.10.71 కోట్లు మొత్తం రూ.613.84 కోట్లతో ప్రతిపాదనలు పంపారు. కేంద్ర ప్రభుత్వం రూ.3.14 కోట్లు నిధులు విడుదల చేయగా, ఇంటింటికీ కుళాయి కనెక్షన్, పైప్‌లైన్ల ఏర్పాటు, రిజర్వాయర్ల నిర్మాణం కోసం రూ.2.64 కోట్లు, పార్కులు, గ్రీనరీ అభివృద్ధికి రూ.50 లక్షలు ఖర్చు చేసినట్లు చెబుతున్నారు. మచిలీపట్నంలోని ప్రధాన పార్కు మినహా ఇతర ఉద్యానవనాలు సక్రమంగా అభివృద్ధి చేయలేదు. రూ.59 కోట్లతో ఐదు ఓవర్ హెడ్ ట్యాంకులు భాస్కరపురం, రుస్తుంబాద, చిలకలపూడి, వలందపాలెం, 28వ వార్డులో నిర్మించేందుకు ప్రతిపాదనలు తయారుచేశారు. వాటిలో రూ.1.48 కోట్లతో చేపట్టే వలందపాలెంలోని ఓవర్‌హెడ్ ట్యాంక్ పనులకు సోమవారం శంకుస్థాపన చేశారు. మిగిలిన ఓవర్‌హెడ్ ట్యాంకులను ఎప్పటికి నిర్మిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది.
డ్రెయినేజీ నిర్మాణం ఎప్పటికో...
మచిలీపట్నం సముద్ర మట్టానికి రెండు అడుగుల దిగువన ఉంది. కొద్దిపాటి వర్షం కురిసినా వర్షపునీరు రోడ్లపైనే ప్రవహిస్తూ ఉంటుంది. మురుగునీరు త్వరగా డ్రెయిన్ల ద్వారా సముద్రంలో కలవదు. టీడీపీ అధికారం చేపట్టినప్పటి నుంచి డ్రెయినేజీ పనులను చేస్తామని చెబుతూ వస్తున్నారు. రూ. 68 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసినా, ఇవి కాగితాలకే పరిమితమయ్యాయి. టెండర్లు పిలిచామని చెబుతున్నా, ఎప్పటికి ఖరారు చేస్తారు, పనులు ఎప్పుడు ప్రారంభిస్తారనే విషయం తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వర్షాకాలంలో కొద్దిపాటి వానకే రోడ్లన్నీ జలమయమవుతున్నాయి.
వేధిస్తున్న సిబ్బంది కొరత
అభివృద్ధి పనులను పర్యవేక్షించేందుకు మున్సిపల్ కార్యాలయంలో సరిపడా సిబ్బంది లేరు. మచిలీపట్నం పురపాలక సంఘంలో ఒక డీఈ పోస్టు ఖాళీగా ఉంది. ఆరుగురు ఏఈలకు ఒక్కరే పనిచేస్తున్నారు. టౌన్‌ప్లానింగ్‌లో సూపర్‌వైజర్లు ఆరుగురు ఉండాల్సి ఉండగా, ఇద్దరే ఉన్నారు. అధికారులు, సిబ్బంది లేకుండా అమృత్ పథకం, ఇతర పనులు ముందుకు వెళ్లడం కష్టమే. కాబట్టి సిబ్బందిని నియమించి, అమృత్ పథకాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.
అమృత్ ... అక్కరకొచ్చేనా!
Published Tue, Jun 27 2017 11:14 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement