కరప (తూర్పు గోదావరి) : తూర్పు గోదావరి జిల్లా కరప మండలం ఎస్వీపేటలోని వీధి కుళాయి నుంచి నీటితోపాటు వానపాములు, రొయ్యపిల్లలు వచ్చాయి. తాళ్లరేవు మండలం జి.వేమవరంలోని సామూహిక రక్షిత నీటి పథకం నుంచి ఆరు గ్రామాలకు మంచి నీరు సరఫరా అవుతుంది. అయితే శుక్రవారం మధ్యాహ్నం విడుదలైన నీటిని కరప మండలం ఎస్వీపేట వాసులు పట్టుకుంటుండగా వానపాములు, రొయ్య పిల్లలు వచ్చాయి. దీంతో జనం ఆందోళన చెందారు. కొద్దిసేపటి తర్వాత శుభ్రమైన మంచి నీరు రావటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయమై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు రంగంలోకి దిగారు. మంచి నీటి పథకం నిర్వహణను మెరుగుపరుస్తామని హామీ ఇచ్చారు.