ఇసుక సరిహద్దులు దాటితే కేసులు
చిత్తూరు (అర్బన్): ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలోని ఇసుక సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలకు తరలిస్తే కఠినంగా వ్యవహరించాలని రాలయసీమ ఐజీ వీ.వేణుగోపాలకృష్ణ ఆదేశాలు జారీచేశారు. శనివారం చిత్తూరుకు వచ్చిన ఆయన ఇక్కడున్న జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఘట్టంనేని శ్రీనివాస్‌తో కలిసి జిల్లాలోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రజలకు ఇసుక ఉచితంగా అందిస్తున్నట్లు ప్రభుత్వం చెప్పడంతో ఎక్కడా దీనికి డబ్బులు వసూలు చేయకూడదన్నారు. కట్టడాల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమో అంతే తీసుకెళ్లాలన్నారు.
అలా కాకుండే ఒకే ప్రాంతంలో గుట్టలుగా ఇసుక నిల్వచేసినా, ఇతర రాష్ట్రాలకు ఇసుక తీసుకెళ్లినా వారిపై కేసులు నమోదు చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఇందులో ఎలాంటి ఒత్తిళ్లకు, రాజకీయ జోక్యాలకు తలొంచద్దని సూచించారు. ఇసుక రేవుల్లో జేసీబీలు, ఇతర యంత్రాలతో ఇసుకను తవ్వడం కూడా చట్ట విరుద్దమన్నారు. దీనిపై పోలీసు అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. ఈ సమావేశంలో చిత్తూరు ఏఎస్పీ అభిషేక్ మొహంతి, ఓఎస్డీ రత్న, డీఎస్పీలు గిరి, లక్ష్మీనాయుడు, గిరిధర్, శంకర్, శ్రీకాంత్, పలువురు సీఐలు పాల్గొన్నారు.