మధిర, న్యూస్‌లైన్: ఏకగ్రీవమైన సహకార సంఘాలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాన్ని ఏడాదైనా విడుదల చేయకపోవడంపై ఆయా సంఘాల పాలకవర్గాలు మండిపడుతున్నాయి. రూ.లక్ష ఉన్న ప్రోత్సాహకాన్ని రూ.2 లక్షలకు పెంచడంతో సంతోషించిన పాలకవర్గాలు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నాయి. జిల్లాలో 105 సహకారసంఘాలు ఉండగా 33 జిల్లా కేంద్ర సహకారబ్యాంకు శాఖలు ఉన్నాయి.
రాష్ట్రంలో రెండువిడతలుగా ఈ సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడత 2013 జనవరి 31న, జిల్లాలో ఫిబ్రవరి 4, 2013న ఎన్నికలు జరిగాయి. బ్రాహ్మణపల్లి, నారాయణపురం, పెద్దబీరవల్లి సహకార సంఘాలకు సం బంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఈ సంఘాలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 102 సంఘాలకు ఎన్నికలు జరగ్గా 14 సంఘా లు ఏకగ్రీవమయ్యాయి. జిల్లా కేంద్ర సహకారబ్యాంకు వెయ్యికోట్ల వ్యాపారం చేస్తోంది. రుణాల వసూళ్లు, చెల్లింపుల్లో అగ్రభాగాన ఉంది. ఖమ్మం డివిజన్‌లో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగ్గా గెలుపొందిన అధ్యక్షులు 5న ప్రమాణస్వీకారం చేశారు.
ఏకగ్రీవంగా ఎన్నికైన ఒక్కో సంఘానికి ప్రోత్సాహక నగదు కింద రూ.2 లక్షల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఏకగ్రీవ సంఘాల పాలకవర్గాలు మండిపడుతున్నాయి. సహకారసంఘాలు పరపతేతర వ్యాపారాలైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, రేషన్‌షాపులు, వాటర్‌ప్లాంట్లు, ధాన్యం సేకరణ కేంద్రాలు వంటి పనులను చేపడుతున్నాయి. మధిర మండలంలో సిద్దినేనిగూడెం, ఖమ్మంపాడు, ఎర్రుపాలెం మండలంలో రాజుపాలెం సహకారసంఘాలు ఏకగ్రీవమయ్యాయి. సత్తుపల్లి డివిజన్‌లోని ఐదు మండలాల్లో 24 సంఘాలు ఉండగా 8 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో సత్తుపల్లి, గంగారం, తుంబూరు, పెనుబల్లి, పోచా రం, వేంసూరు తదితర సంఘాలు ఉన్నాయి.
తుంబూరు సహకార సంఘ భవనం శిథిలావస్థకు చేరింది. ఖమ్మం డివిజన్‌లో పలు సంఘాల్లో నీటిశుద్ధి యంత్రాలున్నాయి. సత్తుపల్లి డివిజన్‌లోని సత్తుపల్లి, గంగారం, పెనుబల్లి, తుంబూరు తదితర సంఘాలకు వాటర్‌ప్లాంట్లు లేవు. ఈ ఏకగ్రీవమైన సంఘాలకు ప్రోత్సాహక నగదు రూ.2లక్షలు మంజూరు చేస్తే వాటితో వాటర్‌ప్లాంట్లను నెలకొల్పుకోవచ్చని పాలకవర్గాలు భావిస్తున్నాయి.
కొన్ని సంఘాలకు ప్రహరీగోడలు, గోదాంలు లేవు. సిద్దినేనిగూడెం సహకారసంఘ భవనం శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్‌పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎరువులు నిల్వ చేసినప్పుడు తేమవల్ల ఎరువుల బస్తాలు గడ్డకడుతున్నాయని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో వైషమ్యాలను పక్కనబెట్టి ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహకం విడుదల చేయకపోవడం సరికాదని పాలకవర్గాలు ధ్వజమెత్తుతున్నాయి.
మొండి ‘సహకారం’
Published Wed, Feb 5 2014 5:17 AM | Last Updated on Sat, Sep 2 2017 3:20 AM
Advertisement
Advertisement