cash incentive
-
ఆశా మాలవ్యకు సీఎం జగన్ అభినందనలు.. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం
సాక్షి, అమరావతి: తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పర్వతారోహకురాలు ఆశా మాలవ్య సోమవారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. కొద్దిరోజులుగా సైక్లింగ్ చేస్తూ అనేక రాష్ట్రాలలో పర్యటిస్తున్న ఆశా లక్ష్యం నెరవేరాలని సీఎం జగన్ ఆకాంక్షించారు. రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని సీఎం ప్రకటించారు. సైకిల్‌పై దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 25,000 కిలో మీటర్లు ప్రయాణించాలని లక్ష్యంగా పెట్టుకున్నానని చెప్పిన ఆశా.. ఇప్పటివరకు ఏపీ సహా 8 రాష్ట్రాల్లో 8 వేలకు పైగా కిలోమీటర్లు పూర్తయిందని సీఎంకి వివరించారు. మధ్యప్రదేశ్‌లోని రాజ్‌ఘర్ జిల్లా నతారామ్ గ్రామానికి చెందిన ఆశా మాలవ్య మహిళా భద్రత, మహిళా సాధికారత అంశాలను విస్తృతంగా సమాజంలోకి తీసుకెళ్ళేందుకు దేశవ్యాప్తంగా ఒంటరిగా సైకిల్‌యాత్ర చేస్తున్నారు. సీఎంను కలిసిన అనంతరం ఆశా మాలవ్య మీడియాతో మాట్లాడుతూ, స్కూల్స్, కాలేజీల్లో అమ్మాయిల కోసం సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వైఎస్ జగన్‌లాంటి ముఖ్యమంత్రి దేశానికే ఆదర్శమన్నారు. ‘‘ప్రస్తుతం నేను 25వేల కిలోమీటర్ల సంపూర్ణ భారత యాత్ర చేస్తున్నాను. నవంబర్ 1న భోపాల్‌లో నా సైకిల్ యాత్ర ప్రారంభించి నేడు విజయవాడ చేరుకున్నాను. మొత్తం 28రాష్ట్రాల్లో నా యాత్ర నిర్వహించాలనేది టార్గెట్ ఇప్పటికే 7రాష్ట్రాల్లో నా సైకిల్ యాత్ర పూర్తయింది’’ అని ఆమె పేర్కొన్నారు. భారత దేశం మహిళలకు అంత సురక్షితమైన దేశం కాదని విదేశాల్లో తప్పుడు అభిప్రాయం ఉంది. మహిళలకు భారతదేశంలో పూర్తి భద్రత ఉందని నేను ప్రపంచానికి చాటి చెప్పాలనుకుంటున్నాను. నేను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిగారిని కలిశాను. సీఎంని కలవడం ఎంతో ఉద్వేగంగా, గర్వంగా ఉంది. దేశం అభివృద్ధితో పాటు మహిళల భద్రతలాంటి విషయాలపై ముఖ్యమంత్రి అభిప్రాయాలు ఎంతో గొప్పగా ఉన్నాయి’’ అని ఆశా మాలవ్య అన్నారు. చదవండి: విశాఖ అమ్మాయి.. భారీ ప్యాకేజ్‌తో కొలువు ‘‘మహిళల భద్రత కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలను చేపట్టింది. ఏపీలో మహిళల భద్రత కోసం దిశా యాప్ ప్రవేశపెట్టారు. నేను దిశా యాప్ డౌన్లోడ్ చేసుకుని దానిని చెక్ చేశాను. దిశా యాప్ ఎంతో గొప్పగా పనిచేస్తోంది. ఏపీలో మహిళలు మాత్రమే కాదు అందరూ సురక్షితంగా ఉన్నారు. నా ఆశయం కోసం ముఖ్యమంత్రి నాకు 10లక్షల రూపాయలు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. నేను తిరుపతి వద్ద రాష్ట్రంలోకి ప్రవేశించాను. అక్కడి నుంచి నాకు ప్రత్యేక రక్షణ అందించారు’’ అని ఆశా మాలవ్య చెప్పారు. -
Chess Olympiad 2022:చెస్ విజేతలకు నజరానా
సాక్షి, చెన్నై: 44వ చెస్ ఒలింపియాడ్‌లో సత్తా చాటిన భారత ఆటగాళ్లను ఆతిథ్య తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. ఈ మెగా ఈవెంట్లో భారత్ తరఫున ఆరు జట్లు పాల్గొనగా...ఓపెన్ విభాగంలో భారత ‘బి’ జట్టు, మహిళల విభాగంలో భారత ‘ఎ’ జట్టు మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాలు సాధించాయి. ఓపెన్ జట్టులో గుకేశ్, నిహాల్ సరీన్, ప్రజ్ఞానంద, ఆదిబన్, రౌనక్ సాధ్వాని సభ్యులు కాగా, మహిళల టీమ్‌లో కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలి, తానియా సచ్దేవ్, భక్తి కులకర్ణి భాగంగా ఉన్నారు. బుధవారం సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో వీరందరి ఘనతను సీఎం ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆయన ఒక్కో జట్టుకు రూ. 1 కోటి చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత చెస్ సమాఖ్య (ఏఐసీఎఫ్) అధికారులతో పాటు మంత్రి మెయ్యనాథన్, సీఎస్ ఇరై అన్బు తదితరులు పాల్గొన్నారు. ‘టాటా స్టీల్’లో మహిళలు చెన్నై: ప్రతిష్టాత్మక టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నమెంట్ నిర్వాహకులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాదినుంచి ఈ టోర్నీలో మహిళల విభాగంలో కూడా పోటీలు నిర్వహించబోతున్నారు. పురుషులతో సమానంగా ప్రైజ్‌మనీని అందిస్తూ తొలిసారి మహిళల కేటగిరీని చేర్చారు. ఈ టోర్నమెంట్ నవంబర్ 29నుంచి డిసెంబర్ 4 వరకు కోల్‌కతాలో జరుగుతుంది. ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఈవెంట్లలో జరిగే టోర్నమెంట్లో ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ ఆటగాళ్లంతా భాగం కానున్నారు. మహిళల విభాగంలో భారత్‌నుంచి కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలిలతో పాటు అనా ముజిచుక్, మారియా ముజిచుక్ (ఉక్రెయిన్), నానా జాగ్నిజ్ (జార్జియా), అలినా కష్లిన్స్కయా (పోలండ్) తదితరులు పాల్గొంటారని నిర్వాహకులు వెల్లడించారు. టాటా స్టీల్ చెస్ టోర్నీకి భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ సలహాదారుడు కావడంతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తుండటం విశేషం. -
Tokyo Olympics 2021: స్వర్ణం గెలవండి.. ఆరు కోట్లు పొందండి
భువనేశ్వర్: ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్ 2021లో పాల్గొనే ఒడిశా అథ్లెట్లకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రోత్సహకాలు ప్రకటించారు. జపాన్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్ 2021లో పతకాలు సాధించిన క్రీడాకారులకు భారీ నగదు ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు తెలిపారు. బంగారు పతకం సాధించిన వారికి రూ. 6 కోట్లు, రజతం సాధిస్తే రూ. 4 కోట్లు, కాంస్య పతకం సాధించిన వారికి రూ . 2.5 కోట్లు చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 23 నుంచి జరగనున్న టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న క్రీడాకారులందరికీ రూ.15లక్షలు చొప్పున నగదు ఇస్తామని సీఎం నవీన్ పట్నాయక్ తెలిపారు. విశ్వక్రీడలకు సన్నద్ధమయ్యేందుకు ఈ నగదు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. ఒలింపిక్స్‌కు ఎంపికైన క్రీడాకారులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒలింపిక్స్‌కు వెళ్లాలనేది ప్రతి క్రీడాకారుడి కల అని, పతకం గెలవడం ద్వారా ఆ కల సాకారమవుతుందని అన్నారు. తమ రాష్ట్రం నుంచి ఒలింపిక్స్‌కు వెళ్తున్న ద్యుతి చంద్, ప్రమోద్ భగత్, దీప్ గ్రేస్ ఎక్కా, నమిత టొప్పో, వీరేంద్ర లక్రా, అమిత్ రోహిదాస్‌లకు సీఎం అభినందనలు తెలిపారు. ఇక టోక్యో ఒలింపిక్స్ కోసం ఈ నెల 17న భారత తొలి బృందం బయల్దేరనుంది. 14నే ఈ బృందాన్ని పంపాలని భారత ఒలింపిక్ సంఘం భావించినప్పటికీ.. ఒలింపిక్స్ నిర్వాహకుల నుంచి అనుమతి లభించలేదు. దీంతో 17వ తేదీన భారత బృందం టోక్యోకు వెళ్లనుంది. ఒలింపిక్స్ గ్రామానికి చేరుకున్నాక మూడు రోజులు క్రీడాకారులందరూ క్వారంటైన్లో ఉండాలి. మిగతా క్రీడాకారులు మరో రెండు రోజుల తర్వాత టోక్యోకు వెళ్తారు. మరోవైపు ప్రస్తుతం క్రొయేషియాలో ఉన్న భారత షూటింగ్ జట్టు 16న టోక్యోకు బయల్దేరనుంది. మొత్తంగా భారత్ నుంచి 120కి పైగా అథ్లెట్లు విశ్వక్రీడలకు వెళ్లనున్నారు. -
చిప్ మేకర్స్‌కు కేంద్రం బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో సెమీ కండక్టర్ తయారీ యూనిట్లను ఏర్పాటు చేసే ప్రతి కంపెనీకి కేంద్రం ఓ ఆఫర్ ప్రకటించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 'మేక్ ఇన్ ఇండియా' కార్యక్రమంలో భాగంగా ఈ నగదు ప్రోత్సాహాన్నిఇవ్వనున్నట్లు తెలిపింది. చైనా తర్వాత భారతదేశాన్ని రెండవ అతిపెద్ద మొబైల్ తయారీదారునిగా అంతర్జాతీయ మార్కెట్లో నిలబెట్టడానికి ఇది సహాయ పడుతుందని కేంద్రం భావిస్తోంది. "చిప్ ఫాబ్రికేషన్ యూనిట్లను ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం 1 బిలియన్ డాలర్లకు ( సుమారు 7వేల కోట్ల రూపాయలు) పైగా నగదు ప్రోత్సాహకాలను ఇవ్వనున్నట్లు ఒక సీనియర్ ప్రభుత్వ అధికారి మీడియాతో అన్నారు. అంతేకాక కంపెనీలు తయారు చేసే చిప్‌లను ప్రభుత్వమే కొనుగోలు కూడా చేస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ నగదు ప్రోత్సాహకాలను ఎలా పంపిణీ చేయాలో ఇంకా ఎటువంటి నిర్ణయానికి రాలేదు. అంతర్జాతీయ మార్కెట్లో ఆటో,ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్లో చిప్స్ కొరత కారణంగా ప్రపంచం వాటి కోసం తైవాన్‌పై ఆధారపడుతోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు ప్రభుత్వాలు సెమీకండక్టర్ ప్లాంట్ల నిర్మాణానికి సబ్సిడీలు, రాయితీలు ఇస్తున్నాయి. ఇప్పటి వరకు భారత్ ఎలక్ట్రానిక్స్, టెలికాం పరిశ్రమకు కావాల్సిన వస్తువుల కోసం చైనా వైపే చూస్తోంది. గత ఏడాది సరిహద్దు ఘర్షణ తరువాత భవిషత్తుల్లో డ్రాగన్ దేశంపై ఆధారపడటం తగ్గించే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వదేశీ చిప్‌లు, సీసీటీవీ కెమెరాల నుంచి 5 జీ పరికరాల ఉత్పత్తుల్లో ఉపయోగించేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. కాకపోతే సెమీకండక్టర్ తయారీ కంపెనీలు తమ యూనిట్లను భారతదేశంలో ఏర్పాటుకు ఆసక్తి చూపించాయో లేదో ఆ ఆధికారులు ఏ సమాచారం ఇవ్వలేదు. ( చదవండి: ఆ ఐటీ నిపుణులకు కాగ్నిజెంట్ తీపి కబురు ) -
కచ్చలూరు ప్రమాదం : మత్స్యకారులకు ప్రోత్సాహం అందజేత
సాక్షి, తూర్పు గోదావరి జిల్లా : కచ్చలూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో 26 మంది టూరిస్టులను రక్షించిన మత్స్యకారులకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం అందజేసింది. 20 మందికి రూ. 25 వేల రూపాయల చొప్పున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నజరానా ప్రకటించగా, శనివారం రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి ఈ నగదు ప్రోత్సహాన్ని మత్స్యకారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో అనంత ఉదయభాస్కర్, ఐటీడీఏ పీఓ నిశాంత్ కుమార్‌లు పాల్గొన్నారు. -
ప్రతిభకు నిరుత్సాహం
రాయవరం : ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిభా పురస్కారాల పథకం సాంకేతిక సమస్యలతో విద్యార్థులను వేధిస్తోంది. ప్రతిభా అవార్డులకు ఎంపికైన వారు ప్రశంసా పత్రాలు అందుకుని మూడు నెలలు కావస్తున్నా నగదు ప్రోత్సాహం ఇంకా అందలేదు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి ప్రతిభ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరికి ప్రభుత్వ ప్రశంసా పత్రంతో పాటు ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత ఏడాది పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులను గుర్తించి ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. గత నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. నగదు ప్రోత్సాహకాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని విద్యాశాఖాధికారులు తెలిపారు. జిల్లాలో ప్రతిభా పురస్కారాలకు 111 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరందరికీ తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వారి బ్యాంకు ఖాతాల వివరాలను కూడా తీసుకున్నారు. ప్రతిభా పురస్కారాలు ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా నగదు ప్రోత్సాహకం అందకపోవడంతో విద్యార్థులు అసంతృప్తికి గురవుతున్నారు. ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన విద్యార్థుల్లో ఎక్కువ మంది పేదలే. ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఇంటర్మీడియెట్ చదువుకు ఉపయోగపడుతుందని వారు ఆశించారు. విద్యా సంవత్సరం ముగిసే సమయం వస్తున్నా నగదు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. మార్చి నెలలో సబ్‌ట్రెజరీల్లో నగదు లావాదేవీలపై నియంత్రణ విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో నగదు ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
మొండి ‘సహకారం’
మధిర, న్యూస్‌లైన్: ఏకగ్రీవమైన సహకార సంఘాలకు ప్రభుత్వం ప్రకటించిన నగదు ప్రోత్సాహకాన్ని ఏడాదైనా విడుదల చేయకపోవడంపై ఆయా సంఘాల పాలకవర్గాలు మండిపడుతున్నాయి. రూ.లక్ష ఉన్న ప్రోత్సాహకాన్ని రూ.2 లక్షలకు పెంచడంతో సంతోషించిన పాలకవర్గాలు ఇప్పుడు ఆగ్రహంతో ఉన్నాయి. జిల్లాలో 105 సహకారసంఘాలు ఉండగా 33 జిల్లా కేంద్ర సహకారబ్యాంకు శాఖలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండువిడతలుగా ఈ సహకార సంఘాలకు ఎన్నికలు జరిగాయి. మొదటి విడత 2013 జనవరి 31న, జిల్లాలో ఫిబ్రవరి 4, 2013న ఎన్నికలు జరిగాయి. బ్రాహ్మణపల్లి, నారాయణపురం, పెద్దబీరవల్లి సహకార సంఘాలకు సం బంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. ఈ సంఘాలకు ఎన్నికలు జరగలేదు. మిగిలిన 102 సంఘాలకు ఎన్నికలు జరగ్గా 14 సంఘా లు ఏకగ్రీవమయ్యాయి. జిల్లా కేంద్ర సహకారబ్యాంకు వెయ్యికోట్ల వ్యాపారం చేస్తోంది. రుణాల వసూళ్లు, చెల్లింపుల్లో అగ్రభాగాన ఉంది. ఖమ్మం డివిజన్లో ఫిబ్రవరి 4న ఎన్నికలు జరగ్గా గెలుపొందిన అధ్యక్షులు 5న ప్రమాణస్వీకారం చేశారు. ఏకగ్రీవంగా ఎన్నికైన ఒక్కో సంఘానికి ప్రోత్సాహక నగదు కింద రూ.2 లక్షల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ఆ దిశగా చర్యలు చేపట్టలేదని ఏకగ్రీవ సంఘాల పాలకవర్గాలు మండిపడుతున్నాయి. సహకారసంఘాలు పరపతేతర వ్యాపారాలైన ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, రేషన్‌షాపులు, వాటర్ప్లాంట్లు, ధాన్యం సేకరణ కేంద్రాలు వంటి పనులను చేపడుతున్నాయి. మధిర మండలంలో సిద్దినేనిగూడెం, ఖమ్మంపాడు, ఎర్రుపాలెం మండలంలో రాజుపాలెం సహకారసంఘాలు ఏకగ్రీవమయ్యాయి. సత్తుపల్లి డివిజన్లోని ఐదు మండలాల్లో 24 సంఘాలు ఉండగా 8 సంఘాలు ఏకగ్రీవమయ్యాయి. వాటిలో సత్తుపల్లి, గంగారం, తుంబూరు, పెనుబల్లి, పోచా రం, వేంసూరు తదితర సంఘాలు ఉన్నాయి. తుంబూరు సహకార సంఘ భవనం శిథిలావస్థకు చేరింది. ఖమ్మం డివిజన్లో పలు సంఘాల్లో నీటిశుద్ధి యంత్రాలున్నాయి. సత్తుపల్లి డివిజన్లోని సత్తుపల్లి, గంగారం, పెనుబల్లి, తుంబూరు తదితర సంఘాలకు వాటర్ప్లాంట్లు లేవు. ఈ ఏకగ్రీవమైన సంఘాలకు ప్రోత్సాహక నగదు రూ.2లక్షలు మంజూరు చేస్తే వాటితో వాటర్ప్లాంట్లను నెలకొల్పుకోవచ్చని పాలకవర్గాలు భావిస్తున్నాయి. కొన్ని సంఘాలకు ప్రహరీగోడలు, గోదాంలు లేవు. సిద్దినేనిగూడెం సహకారసంఘ భవనం శిథిలావస్థకు చేరుకుంది. స్లాబ్పెచ్చులు ఊడిపోతున్నాయి. ఎరువులు నిల్వ చేసినప్పుడు తేమవల్ల ఎరువుల బస్తాలు గడ్డకడుతున్నాయని రైతులు వాపోతున్నారు. గ్రామాల్లో వైషమ్యాలను పక్కనబెట్టి ఏకగ్రీవం చేసుకుంటే ప్రోత్సాహకం విడుదల చేయకపోవడం సరికాదని పాలకవర్గాలు ధ్వజమెత్తుతున్నాయి.