రాయవరం : ప్రతిభావంతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతిభా పురస్కారాల పథకం సాంకేతిక సమస్యలతో విద్యార్థులను వేధిస్తోంది. ప్రతిభా అవార్డులకు ఎంపికైన వారు ప్రశంసా పత్రాలు అందుకుని మూడు నెలలు కావస్తున్నా నగదు ప్రోత్సాహం ఇంకా అందలేదు. పదవ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి ప్రతిభ పురస్కారాలకు ఎంపిక చేశారు.
వీరికి ప్రభుత్వ ప్రశంసా పత్రంతో పాటు ఒక్కొక్కరికి రూ.20 వేలు చొప్పున నగదు బహుమతులు ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా గత ఏడాది పదిలో ప్రతిభ చాటిన విద్యార్థులను గుర్తించి ప్రతిభా పురస్కారాలకు ఎంపిక చేశారు. గత నవంబర్ 14న బాలల దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. నగదు ప్రోత్సాహకాన్ని విద్యార్థుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని విద్యాశాఖాధికారులు తెలిపారు.
జిల్లాలో ప్రతిభా పురస్కారాలకు 111 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వీరందరికీ తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో ప్రశంసా పత్రాలు అందజేశారు. నగదును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వారి బ్యాంకు ఖాతాల వివరాలను కూడా తీసుకున్నారు. ప్రతిభా పురస్కారాలు ప్రకటించి మూడు నెలలు కావస్తున్నా నగదు ప్రోత్సాహకం అందకపోవడంతో విద్యార్థులు అసంతృప్తికి గురవుతున్నారు. ప్రతిభా పురస్కారాలకు ఎంపికైన విద్యార్థుల్లో ఎక్కువ మంది పేదలే.
ప్రభుత్వం ఇచ్చే సొమ్ము ఇంటర్మీడియెట్ చదువుకు ఉపయోగపడుతుందని వారు ఆశించారు. విద్యా సంవత్సరం ముగిసే సమయం వస్తున్నా నగదు రాకపోవడంతో నిరాశకు గురవుతున్నారు. మార్చి నెలలో సబ్‌ట్రెజరీల్లో నగదు లావాదేవీలపై నియంత్రణ విధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో నగదు ప్రోత్సాహకాలు ఇవ్వకుంటే మరింత జాప్యం జరిగే అవకాశం ఉందని విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ప్రతిభకు నిరుత్సాహం
Published Fri, Feb 12 2016 1:49 AM | Last Updated on Mon, Aug 13 2018 3:58 PM
Advertisement
Advertisement