అశ్వాపురం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలని, కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు పాయం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఆయన ఆదివారం ఇక్కడ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. గిరిజనులను విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టడం ఖాయమని అన్నారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మిస్తే గిరిజనుల జీవనం దెబ్బతినే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
ముంపు గ్రామాలన్నిటినీ జిల్లాలోనే ఉంచాలన్నారు. పోలవరం ప్రాజెక్ట్ పేరుతో గిరిజనులకు ఏమాత్రం అన్యాయం జరిగినా ప్రభుత్వం తీవ్ర మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నిర్వాసిత కుటుంబాలకు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ద్వారా భూమికి బదులు భూమి చూపించాలని, వారికి ఎక్కడ పునరావాసం ఇచ్చేదీ ముందే చెప్పాలని డిమాండ్ చేశారు.
ముంపు గ్రామాలు 134 కాదు.. 200 పైనే..
పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంతో భద్రాచలం, పాల్వంచ డివిజన్‌లో ప్రభుత్వం 134 గ్రామాలు మునిగిపోతాయని ప్రభుత్వం చెబుతున్న లెక్కల్లో వాస్తవం లేదన్నారు. సంఖ్య సుమారు 200కు పైనే ఉంటుందన్నారు. ప్రాజెక్ట్ నిర్మాణంతో అటవీ సంపద కూడా కనుమరుగవుతుందని అన్నారు. అనాదిగా అడవులతో అనుబంధాన్ని కలిగిన, అటవీ సంపదపై ఆధారపడి జీవిస్తున్న గిరిజనులను అక్కడి నుంచి వెళ్లగొడితే వారి జీవనం చాలా కష్టమవుతుందని, దీనిని పూడ్చడం దాదాపు అసాధ్యమని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ మండల అధ్యక్షుడు మాదినేని రాంబాబు, నాయకులు గజ్జల లక్ష్మారెడ్డి, ఓరుగంటి రమేష్, ఎస్‌కె.ఖదీర్, చిటికెన భాస్కరరావు, సోవలం నారాయణ, నర్సింహారావు, ఎస్‌కె.గౌస్ పాల్గొన్నారు.
ముంపు గ్రామాలను తెలంగాణలోనే ఉంచాలి
Published Mon, Feb 17 2014 1:59 AM | Last Updated on Tue, Aug 21 2018 8:34 PM
Advertisement
Advertisement