రాజధాని భూ కుంభకోణంపై సీబీఐ విచారణ జరపాలి
రైతుల భూములులాక్కొని-మంత్రులు
అడ్డగోలుగా కొంటారాసీబీఐ విచారణ చేపట్టకపోతే ఆందోళన చేపడతాం
ధ్వజమెత్తిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
ఒంగోలు సబర్బన్: రాజధాని భూముల కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు స్థానిక డీసీసీ కార్యాలయంలో గురువారం సాయంత్రం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రాజధాని భూ కుంభకోణానికి సంబంధించిన అక్రమాలను వివరించారు. పీసీసీ కార్యదర్శి డాక్టర్ గుర్రం రాజ్ విమల్, జిల్లా ఆ పార్టీ ఎస్సీ విభాగం చైర్మన్ వేమా శ్రీనివాసరావుతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు టీడీపీ నాయకులపై, మంత్రులపై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం రాజధాని నిర్మాణం పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయటం అత్యంత దారుణమైన చర్యగా అభివర్ణించారు. రైతుల భూములను అడ్డగోలుగా లాక్కొని వారిని నానా అవస్థలు పెట్టిన అధికార పార్టీకి చెందిన మంత్రులు, వారి అనుచరులు, కుటుంబ సభ్యుల పేరిట వేలాది ఎకరాలు అడ్డగోలుగా కొని అక్రమాలకు పాల్పడటంపై సీబీఐ చేత విచారణ జరపాలన్నారు.
రాజధాని నిర్మాణం ఎక్కడ అనేది నిర్ణయించుకున్న ప్రభుత్వ పెద్దలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన వ్యవసాయ అసైన్డ్‌మెంట్ భూములు దౌర్జన్యంగా రాజధాని పేరిట లాక్కోవటం అత్యంత దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. అక్రమాలు మీడియా ద్వారా బయటకు రావడంతో తొలుత మాకేం సంబంధం లేదని బుకాయించి, తీరా ఆధారాలతో సహా బయట పెట్టడంతో మా ఉద్యోగులు కొన్నారు... అని బొంకటం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.
రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను సైతం మీడియాలో బయటకు రావడంతో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ప్రభుత్వ వెబ్‌సైట్‌ను నిలిపేయడం అధికారాన్ని దుర్వినియోగం చేయటమేనన్నారు సమావేశంలో జిల్లా యూత్ కోఆర్డినేటర్ చెరుకూరి కిరణ్, డీసీసీ జనరల్ సెక్రటరీ సొలస శ్రీనివాసరావు, డీసీసీ ఉపాధ్యక్షుడు ఎద్దు కోటేశ్వరరావు పాల్గొన్నారు.