ఒంగోలు టౌన్: కలెక్టరేట్‌లో నిఘా మరింత పెరిగిపోయింది. గతంలో ఎనిమిది సీసీ కెమేరాలు ఉండగా, తాజాగా మరో ఎనిమిది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ చాంబర్ ముందు, జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్, కలెక్టరేట్ కారిడార్, విజిటర్స్ కూర్చునేచోట, కలెక్టరేట్‌లోని సెక్షన్లకు అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, కలెక్టరేట్ బయట వాహనాల పార్కింగ్ వద్ద రెండు సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. మంగళవారం మరో ఎనిమిది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. తాజాగా సీసీ కెమేరాల ఏర్పాటుకు మరో అడుగు వేశారు. కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్లలో కూడా వీటిని ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టరేట్ మొత్తం సీసీ కెమేరాల నిఘాలోకి వచ్చేసినట్లయింది. కలెక్టరేట్‌లోని 16 సీసీ కెమేరాలను ఆపరేట్ చేసేందుకు రెండు డిజిటట్ వీడియో రికార్డులు ఏర్పాటు చేశారు. ఈ రెండూ సెన్సార్ మోడ్‌లో పనిచేయనున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్‌లో డిజిటల్ వీడియో రికార్డులు ఉన్నాయి.
ఎవరు వస్తున్నారు..
ఎవరిని కలుస్తున్నారు..?
కలెక్టరేట్‌లోని అన్ని సెక్షన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడం ద్వారా సిబ్బంది పనితీరు మెరుగుపరచడంతోపాటు కలెక్టరేట్‌లోకి తరచూ ఎవరు వస్తున్నారు, వచ్చినవారు ఏ సెక్షన్లలోకి వెళ్తున్నారు, ఆ సెక్షన్లలో ఎవరిని ఎక్కువగా కలుస్తున్నారన్న దానిపై కూడా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించనుంది. కలెక్టరేట్‌కు నిత్యం వచ్చేవారి కదలికలపై కూడా నిఘా పెట్టనున్నారు. అదేవిధంగా కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఉన్న సమయంలో విజిటర్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. కలెక్టర్‌ను కలిసేందుకు ఎవరు వస్తున్నారన్నది కూడా సీసీ కెమేరాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అంతేగాకుండా కలెక్టరేట్ కారిడార్‌లో ఎవరు తిరుగుతున్నా కూడా సీసీ కెమేరాల్లో రికార్డు అవుతోంది. పదహారు సీసీ కెమేరాలతో కలెక్టరేట్‌లో నిఘా మరింత పెంచడం ద్వారా ప్రతిఒక్కరి కదలికలను తెలుసుకోనున్నారు.
ఏ టు హెచ్ అలర్ట్...
కలెక్టరేట్‌లో ఏ సెక్షన్ నుంచి హెచ్ సెక్షన్ల వరకు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని సెక్షన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ సెక్షన్లలో పనిచేసేవారు మరింత అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్‌లోని ప్రతి సెక్షన్ కీలకమైనదే. ప్రతి సెక్షన్‌లో సంబంధిత సూపరింటెండెంట్‌తో పాటు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పరిపాలనా యంత్రాంగానికే గుండెకాయ అయిన కలెక్టరేట్ పనితీరును మరింత మెరుగుపరిచి ఇతర శాఖలకు ఆదర్శంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో తొలిసారిగా కలెక్టరేట్ నుంచే ఈ–ఆఫీసు విధానాన్ని ప్రారంభించారు. ఈ–ఆఫీసు అమల్లోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్‌లోని ప్రతి సెక్షన్‌కు సంబంధించిన ఫైళ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరుగెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్‌లోని ప్రతి సెక్షన్‌లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడంతో అక్కడ పనిచేసే సిబ్బంది మరింత అప్రమత్తం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment