ongole collectorate
-
నిరసనలతో హోరెత్తిన ఒంగోలు కలెక్టరేట్
-
మరింత నిఘాలో కలెక్టరేట్
ఒంగోలు టౌన్: కలెక్టరేట్లో నిఘా మరింత పెరిగిపోయింది. గతంలో ఎనిమిది సీసీ కెమేరాలు ఉండగా, తాజాగా మరో ఎనిమిది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు జిల్లా కలెక్టర్ చాంబర్ ముందు, జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్, కలెక్టరేట్ కారిడార్, విజిటర్స్ కూర్చునేచోట, కలెక్టరేట్లోని సెక్షన్లకు అటువైపు ఒకటి, ఇటువైపు ఒకటి, కలెక్టరేట్ బయట వాహనాల పార్కింగ్ వద్ద రెండు సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. మంగళవారం మరో ఎనిమిది సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. తాజాగా సీసీ కెమేరాల ఏర్పాటుకు మరో అడుగు వేశారు. కలెక్టరేట్లోని అన్ని సెక్షన్లలో కూడా వీటిని ఏర్పాటు చేశారు. దీంతో కలెక్టరేట్ మొత్తం సీసీ కెమేరాల నిఘాలోకి వచ్చేసినట్లయింది. కలెక్టరేట్లోని 16 సీసీ కెమేరాలను ఆపరేట్ చేసేందుకు రెండు డిజిటట్ వీడియో రికార్డులు ఏర్పాటు చేశారు. ఈ రెండూ సెన్సార్ మోడ్‌లో పనిచేయనున్నాయి. జిల్లా రెవెన్యూ అధికారి చాంబర్లో డిజిటల్ వీడియో రికార్డులు ఉన్నాయి. ఎవరు వస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు..? కలెక్టరేట్లోని అన్ని సెక్షన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడం ద్వారా సిబ్బంది పనితీరు మెరుగుపరచడంతోపాటు కలెక్టరేట్‌లోకి తరచూ ఎవరు వస్తున్నారు, వచ్చినవారు ఏ సెక్షన్లలోకి వెళ్తున్నారు, ఆ సెక్షన్లలో ఎవరిని ఎక్కువగా కలుస్తున్నారన్న దానిపై కూడా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించనుంది. కలెక్టరేట్‌కు నిత్యం వచ్చేవారి కదలికలపై కూడా నిఘా పెట్టనున్నారు. అదేవిధంగా కలెక్టరేట్లోని తన చాంబర్లో ఉన్న సమయంలో విజిటర్స్ తాకిడి ఎక్కువగా ఉంటుంది. కలెక్టర్‌ను కలిసేందుకు ఎవరు వస్తున్నారన్నది కూడా సీసీ కెమేరాల ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. అంతేగాకుండా కలెక్టరేట్ కారిడార్‌లో ఎవరు తిరుగుతున్నా కూడా సీసీ కెమేరాల్లో రికార్డు అవుతోంది. పదహారు సీసీ కెమేరాలతో కలెక్టరేట్లో నిఘా మరింత పెంచడం ద్వారా ప్రతిఒక్కరి కదలికలను తెలుసుకోనున్నారు. ఏ టు హెచ్ అలర్ట్... కలెక్టరేట్లో ఏ సెక్షన్ నుంచి హెచ్ సెక్షన్ల వరకు ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అన్ని సెక్షన్లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. దీంతో ఈ సెక్షన్లలో పనిచేసేవారు మరింత అలర్ట్ అవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్ కీలకమైనదే. ప్రతి సెక్షన్లో సంబంధిత సూపరింటెండెంట్‌తో పాటు సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పరిపాలనా యంత్రాంగానికే గుండెకాయ అయిన కలెక్టరేట్ పనితీరును మరింత మెరుగుపరిచి ఇతర శాఖలకు ఆదర్శంగా ఉంచేందుకు కసరత్తు చేస్తున్నారు. జిల్లాలో తొలిసారిగా కలెక్టరేట్ నుంచే ఈ–ఆఫీసు విధానాన్ని ప్రారంభించారు. ఈ–ఆఫీసు అమల్లోకి వచ్చిన తర్వాత కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్‌కు సంబంధించిన ఫైళ్ల స్థితిగతులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వాటిని పరుగెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టరేట్లోని ప్రతి సెక్షన్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయడంతో అక్కడ పనిచేసే సిబ్బంది మరింత అప్రమత్తం కానున్నారు. -
అయ్యా..రుణాలు మాఫీ కాలేదు
నెల్లూరు(అర్బన్): నగరంలోని కలెక్టరేట్లో రుణమాఫీపై శనివారం గ్రీవెన్స్ నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డితో పాటు వ్యవసాయ కమిషనర్, జిల్లా వ్యవసాయశాఖ అధికారులు రైతుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇప్పటి వరకు రుణమాఫీ పొందని, మొదటి విడత పొంది, రెండో విడత పొందని రైతులు భారీగా తరలిరావడంతో కలెక్టరేట్ కిక్కిరిసింది. అధి కారులు ఏర్పాట్లలో విఫలమవడంతో గందరగోళం నెలకొంది. మధ్యాహ్న భో జన విరామ సమయానికి సుమారు 1500 మంది రైతులు కలెక్టరేట్ వద్ద పడిగాపులు కాశారు. అధికారులు కేవలం 500 మంది కి టోకన్లు అందజేశారు. మధ్యాహ్నం నుం చి టోకన్లు అందజేసిన రైతుల దరఖాస్తులు మాత్రమే స్వీకరిస్తామని, మిగిలిన వా రు ఆదివారం రావాలని తెలిపారు. దీంతో వందలాది మంది రైతులు నిరాశతో వెనుదిరిగారు. ఈ విషయం తెలియక మధ్యాహ్నం నుంచి కలెక్టరేట్‌కు చేరుకున్న రైతులకు సమాధానం చెప్పే వారు కరువయ్యారు. రైతుల సంతోషం కోసమే రైతులు సంతోషంగా ఉండాలనే ధ్యేయంతో కష్టతరమైనా ప్రభుత్వం రుణమాఫీ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో రుణమాఫీ ఫిర్యాదుల విభాగాన్ని ప్రారంభించిన మంత్రి సోమిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. అన్ని బ్యాంకుల నుంచి పంట రుణాల వివరాలు తెప్పించుకుని రుణమాఫీ చేస్తున్నామన్నారు. 2007 నుంచి 2013 వరకు నిల్వ ఉన్న ఖాతాలను పరిశీలించి వడ్డీతో సహారుణమాఫీ చేస్తున్నామన్నారు. మూడో విడతతో కలిపి మొత్తం రూ.14,710 కోట్లు మాఫీ చేశామన్నారు. రైతు సాధికారత సంస్థ 9లక్షల ఫిర్యాదులను పరిశీలించిందని, అందులో 5.72 లక్షల ఫిర్యాదులు న్యాయమని తేల్చిందన్నారు. వీరందరికీ వివిధ దశల్లో రుణమాఫీ చేస్తున్నామన్నారు. ఉద్యానవన పంటల కింద రూ.384.47 కోట్లు, మరణించిన రైతులకు సంబంధించి రూ.51.54 కోట్లు రుణ ఉపశమనం కల్పించామన్నారు. బ్యాంకుల్లో సాంకేతిక కారణాలతో కొందరికి రుణమాఫీ జరగలేదని, వారందరికీ ఇప్పుడు ఇస్తున్నామని తెలిపారు. కలెక్టర్ ముత్యాలరాజు మాట్లాడుతూ అర్హులైన రైతులందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, జేసీ2 వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు. బ్యాంకర్లు తిప్పుకుంటున్నారు నాకు రూ.26,321 రుణమాఫీ జరిగినట్లుగా అధికారులు తెలిపారు. యూబీఐ బ్యాంకుకు వెళ్తే రుణమాఫీ జరగలేదన్నారు. విజయవాడ రైతు సాధికారత సంస్థ వద్దకు వెళ్తే వారు ఒకేసారి మొత్తం రుణ మాఫీ చేసినట్టు పది నెలల క్రితం లెటర్ ఇచ్చారు. బ్యాంకు అధికారులకు ఇచ్చే ఆన్లైన్లో చెక్ చేసి ప్రభుత్వం నిధులు విడుదల చేయలేదని చెబుతున్నారు. –వల్లూరు మస్తాన్, సాయిపేట ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మానాన్న పాశం చిన మాలకొండయ్య రూ.20 వేలు క్రాప్‌లోను తీసుకున్నాడు. రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకున్నా ఒక్క రూపాయి ఖాతాలో జమకాలేదు. అధికారులు స్పందించి రుణమాఫీ చేయాలి. –లక్ష్మి, తాళ్లూరు -
గడపగడపకు వైఎస్సార్ దిగ్విజయం
-
గడపగడపకు వైఎస్సార్ దిగ్విజయం
- వైఎస్సార్ కాంగ్రెస్ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెల్లడి - ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా 9న జిల్లా కేంద్రాల్లో ధర్నా - ప్రకాశం జిల్లా ధర్నాలో పాల్గొననున్న వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఐదు నెలల పాటు నిర్వహించిన గడపగడపకూ వైఎస్సార్ కార్యక్రమం దిగ్విజయంగా జరిగిందని వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అనుకున్న దానికంటే ఎక్కువగా ఎక్కువ లక్ష్యాన్ని చేరుకున్నామని పార్టీ నేతలు తమ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. రెండు రోజులుగా జరిగిన సమీక్షలో గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం తీరుతెన్నులపై 13 జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు, పరిశీలకులతో జగన్ సమీక్షిం చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తమ పార్టీనేతలు అధ్యక్షుడు జగన్ దృష్టికి తీసుకొచ్చారని, వాటిపై ఎలా పోరాడాలి అనే విషయంలో నేతలకు తమ అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారని తెలిపారు. మంగళవారం ఉమ్మారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సమీక్షలో గ్రామాల్లో పోలింగ్ బూత్ కమిటీల ఏర్పాటు పురోగతిపై చర్చించారన్నారు. అలాగే పార్టీ అనుబంధ విభాగాల్లో నూతన కమిటీల ఏర్పాటుకు పేర్లు సూచించాల్సిందిగా జగన్ చెప్పారని ఉమ్మారెడ్డి తెలిపారు. గడపగడపకు కార్యక్రమం 92 శాతం మేరకు జరిగిందని, పార్టీ నాయకులు పట్టుదలతో అన్ని నియోజకవర్గాల్లో కొనసాగించారని, అలాంటి వారిని జగన్ అభినందించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వెనుకబడిన వారిని ఫిబ్రవరి లోపు పూర్తి చేయాలని ఆదేశించారన్నారు. ఆరోగ్యశ్రీకి సుస్తీ.. రాష్ట్రంలో ఆరోగ్యశ్రీకి సుస్తీ చేసిందని.. చివరికి డయాలసిస్ కూడా చేయలేకపోతున్నారని, కేన్సర్ రోగుల విషయంలోనూ ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజలు మండిపడుతుండటాన్ని తమ నేతలు జగన్ దృష్టికి తీసుకువచ్చారని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకంపై ప్రభుత్వం ఉదాసీనతను నిరసిస్తూ అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల 9న ధర్నా చేపట్టాలని పార్టీ నిర్ణరుుంచినట్లు తెలిపారు. ప్రకాశం జిల్లాలో జరిగే ధర్నాలో పార్టీ అధ్యక్షుడు జగన్ పాల్గొంటారని ఉమ్మారెడ్డి తెలిపారు. తమ ప్రభుత్వ పనితీరు అద్భుతంగా ఉందని టీపీపీ నేతలు గొప్పలు చెప్పుకుంటున్నారని, నిజంగా అంత బావుంటే, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేరుుంచి ఎన్నికలకు ఎందుకు వెళ్లలేకపోతున్నారని ఉమ్మారెడ్డి ప్రశ్నించారు. అంబేడ్కర్‌కు ఘన నివాళి: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 61వ వర్ధంతి సందర్భంగా కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ నేతలు ఘనంగా నివాళి అర్పించారని ఉమ్మారెడ్డి తెలిపారు. జయలలితకు వైఎస్సార్ సీపీ ఘన నివాళి జయలలిత మృతికి సంతాపంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి, పార్టీ నేతలు రెండు నిమిషాలు మౌనం పాటించారని ఉమ్మారెడ్డి తెలిపారు. జయ మృతిపై వైఎస్ జగన్ స్పందిస్తూ దేశం మంచి నాయకురాల్ని కోల్పోరుుందని, ఆమె మరణించడం బాధాకరమన్నారని చెప్పారు. -
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా
-
ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ధర్నా
హైదరాబాద్: ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రభుత్వ వైఫల్యాలపై దృష్టిపెట్టాలని పార్టీ నేతలకు వైఎస్ఆర్సీపీ అధినేత, ఏపీలో ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారని ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం 'గడప గడపకు వైఎస్ఆర్' అంశంపై పార్టీ నేతలతో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష జరిపారు. సమీక్షలో చర్చించిన అంశాలపై ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి మీడియాతో మాట్లాడారు. బుత్ కమిటీలు, అనుబంధ సంఘాల కమిటీల నియామకాన్ని తర్వలో పూర్తి చేయాలని వైఎస్ జగన్ అదేశించినట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యం పట్ల టీడీపీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ 9న ఒంగోలు కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్ సీపీ ధర్నా చేపట్టనుందని ఎమ్మెల్సీ తెలిపారు. ఈ ధర్నాలో పార్టీ అధినేత వైఎస్ జగన్ పొల్గొని రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టనున్నారని శాసనమండలిలో వైఎస్ఆర్సీపీ పక్ష నేత ఉమ్మారెడ్డి వివరించారు. -
ప్రజల సాక్షిగా ప్రజాదర్బార్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజాదర్బార్ ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా కలెక్టర్ విజయకుమార్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అర్జీలు రాసేందుకు ప్రభుత్వ సిబ్బందిని నియమించడమేగాకుండా వాటిని అక్కడికక్కడ విచారించేందుకు వీలుగా అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారుల స్థాయిలో పరిష్కారం కాని వాటిని నేరుగా తన వద్దకు తీసుకొచ్చే విధంగా రూపకల్పన చేశారు. అందరి సమక్షంలో సంబంధిత సమస్య గురించి కింది వరుసలో కూర్చున్న అధికారులను మైక్ ద్వారా మాట్లాడిస్తూ బహిరంగంగా చెప్పించడంతో ప్రజలు కూడా వాటి స్థితిగతులను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఈ విధానంతో ప్రజలు కూడా సమస్య స్థితిగతిని సావధానంగా తెలుసుకుని ముందుకు కదులుతున్నారు. గతంలో గుంపులు గుంపులుగా ప్రజలు అర్జీలు చేతపట్టుకొని వచ్చేవారు. కొన్నిసార్లు గందరగోళంగా ఉండేది. ఈ సారి మాత్రం అలాంటి వాతావరణం కనిపించలేదు. ఒకరి తర్వాత ఒకరి అర్జీని కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్‌లు స్వీకరించారు. హెల్ప్ డెస్క్‌తో తీరిన రాత కష్టాలు ప్రజాదర్బార్ కోసం ప్రకాశం భవనంలోకి ప్రజలు అడుగు పెట్టగానే కుడివైపు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సమస్యలతో బాధపడుతున్నవారు ఆ సమస్యను అధికారులకు ఎలా తెలియజేయాలో తెలియక అక్కడే ఉన్న ప్రైవేట్ రైటర్లను ఆశ్రయించేవారు. వారు ఒక్కో అర్జీదారుడి నుంచి 10 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా సంబంధిత అధికారి తనకు బాగా పరిచయమని, తాను చెబితే మీ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికి 200 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌తో ప్రైవేట్ రైటర్లు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్డ్ డెస్క్‌లో సిబ్బంది ప్రజలకు అర్జీలు రాసే పనిలోనే నిమగ్నమయ్యారు. టెన్ టేబుల్స్ హెల్ప్ డెస్క్‌లో అర్జీలు రాయించుకున్న ప్రజలు సమీపంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ అర్జీపై నంబర్ వేస్తారు. ప్రత్యేకంగా శాఖల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్దకు నంబర్ వేసి పంపించే ప్రక్రియ చేపట్టారు. టేబుల్-1లో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, కార్మిక, ఎక్సైజ్, దేవాదాయ, రిజిస్ట్రార్, ట్రెజరీ, అటవీ, డీపీఆర్ఓ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్స్, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులను ఉంచారు. టేబుల్-2లో వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానశాఖ, జిల్లా సహకార సంస్థ, ఏపీఎస్ఐడీసీ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఉంచారు. టేబుల్-3లో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, ఐటీడీఏ, మహిళా శిశు సంక్షేమశాఖ, ఎల్డీఎం, భూగర్భ జలవనరుల శాఖ, నాబార్డు, పీడీసీసీ బ్యాంకులకు చెందిన అధికారులను ఉంచారు. టేబుల్-4లో డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి, సీపీఓ శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-5లో విద్యాశాఖ, గురుకుల పాఠశాలలు, రాజీవ్ విద్యామిషన్, వయోజన విద్యాశాఖ, ఆర్ఐఓ, జిల్లా గ్రంథాలయం, జిల్లా క్రీడాభివృద్ధి అధికారులను ఉంచారు. టేబుల్-6లో ఆర్అండ్బీ, ట్రాన్స్‌కో, ప్రాజెక్ట్స్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఉంచారు. టేబుల్-7లో జిల్లా పరిశ్రమల కేంద్రం, చేనేత జౌళిశాఖ, మార్కెటింగ్, మైన్స్, స్టెప్, ఖాదీ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-8లో డీఎంహెచ్ఓ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వైద్య విధాన పరిషత్, రిమ్స్, రెడ్‌క్రాస్‌లకు చెందిన వారిని ఉంచారు. టేబుల్-9లో మెప్మా, మునిసిపల్ కమిషనర్లను ఉంచారు. టేబుల్-10లో జిల్లాపరిషత్, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్టీఓ, ఆర్టీసీ అధికారులను ఉంచారు. -
రాజకీయ ‘ఉపాధి’కి రెడీ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాజకీయ ఉపాధికి అధికార పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులు రెడీ అవుతున్నారు. చౌకధరల దుకాణాలు తమకే కేటాయించాలని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాలను జనవరి 21వ తేదీలోపు భర్తీ చేయాలని ఆర్డీఓలకు కలెక్టర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేయడంతో గ్రామాల వారీగా ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాల జాబితాలను వారు తయారు చేస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ వారికి దుకాణాలు కేటాయించుకునేందుకు ఎమ్మెల్యేలు స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 2107 చౌకధరల రెడీ దుకాణాలున్నాయి. ఒంగోలు డివిజన్లో 924, కందుకూరు డివిజన్లో 751, మార్కాపురం డివిజన్లో 432 ఉన్నాయి. ప్రస్తుతం ఒంగోలు డివిజన్లో 52, కందుకూరు డివిజన్లో 83, మార్కాపురం డివిజన్లో 17 చౌకధరల దుకాణాలు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 152 దుకాణాలు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఇప్పుడలా కాదు! గతంలో డీలర్ల నియామకాలకు సంబంధించి క్లియర్ వేకెంట్ ఉంటే పక్షం రోజుల్లో భర్తీ చేసేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు. మితిమీరిన రాజకీయ జోక్యంతో ఖాళీలు అంత తొందరగా భర్తీ కావడం లేదు. సమీపంలోని డీలర్‌కు ఖాళీగా ఉన్న దుకాణం ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తున్నారు. దీంతో తమకు నిత్యావసరాలు పూర్తి స్థాయిలో అందడం లేదని కార్డుదారులే బహిరంగంగా ఆరోపిస్తున్నారు. తాము ఎప్పుడు వెళ్లినా దుకాణాలకు తాళాలు వేసే ఉంటున్నాయని కొంతమంది గ్రీవెన్స్‌లో సైతం ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఖాళీగా ఉన్న 152 చౌకధరల దుకాణాలకు వెంటనే నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేయాలని కలెక్టర్ విజయకుమార్ ముగ్గురు రెవెన్యూ డివిజనల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చౌకధరల దుకాణాల నిర్వహణపై గతంలో పెద్దగా ఆదాయం ఉండేది కాదు. ఇటీవల కాలంలో ఇవి మంచి ఆదాయ వనరులుగా మారాయి. దీంతో ఎక్కువ మంది ఈ దుకాణాలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై తీవ్ర ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. ఎన్నికల సీజన్ కావడంతోఎమ్మెల్యేలు కూడా చౌకధరల దుకాణాల భర్తీ విషయంలో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. మొదటి నుంచి తమను కనిపెట్టుకుని ఉన్న వారికి దుకాణాలు కేటాయించాలంటూ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తమ అనుయాయుల జాబితాలు అధికారులకు ఇచ్చినట్లు తెలుస్తోంది. సొమ్ము చేసుకునేందుకు సిద్ధం చౌకధరల దుకాణాల ద్వారా సొమ్ము చేసుకునేందుకు కొంతమంది ఇప్పటి నుంచే వెంపర్లాడుతున్నారు. గతంలో బియ్యం వంటి కొన్నిరకాల వస్తువులకే చౌకధరల దుకాణాలు పరిమితమయ్యాయి. ఎక్కువ మంది వాటిపై పెద్దగా దృష్టి సారించలేదు. ప్రస్తుతం వాటికి కేటాయింపులు పెరగడం..అక్రమార్కులకు ఈ దుకాణాలు కాసుల వర్షం కురిపిస్తుండటం.. గమనించిన అధికార పార్టీ ద్వితీయ శ్రేణి నాయడులు ఈ సారి ఆ దుకాణాలు తమకు కేటాయించేలా చూడాలని ఎమ్మెల్యేలను కోరుతున్నారు. తమ కళ్లెదుటే ఆర్థికంగా ఎదుగుతున్న కొంతమంది డీలర్లను చూసి వారు కూడా అదేవిధంగా ఎదగాలని ఆరాట పడుతున్నారు. చౌకధరల దుకాణాలకు కేటాయించే బియ్యానికి బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండటంతో వాటిని సొమ్ము చేసుకోవాలన్న ఆలోచనతో ఉన్నారు. కిలో రూపాయి బియ్యానికి పాలిష్ పెట్టించి బయట మార్కెట్లో ఎక్కువ ధరకు విక్రయించుకుంటున్న వారి వివరాలు తెసుకుంటూ తాము కూడా తాము కూడా అలాగే చెయ్యాలని ఆశపడుతున్నారు. నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా.. అని అధికార పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి నాయకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. -
వచ్చారు..వెళ్లారు
ఒంగోలు కలెక్టరేట్, చీరాల, పర్చూరు, ఇంకొల్లు, న్యూస్‌లైన్: జిల్లాను గత నెలలో కురిసిన భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. పంటలన్నీ దెబ్బతిన్నాయి. మనుషుల ప్రాణాలు నీటిలో కలిసిపోయాయి. వరద ఉధృతిలో పశువులు కొట్టుకుపోయాయి. వందల కోట్ల రూపాయల నష్టం సంభవించింది. భారీ వర్షాలకు ఆదుకోవలసిన జిల్లా మంత్రి మహీధరరెడ్డి మొహం చాటేశారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చుట్టపు చూపుగా వచ్చి వెళ్లారు. 26 రోజుల తరువాత బుధవారం జిల్లాలో అడుగుపెట్టిన కేంద్ర బృందంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు షెడ్యూల్ ఇచ్చినప్పటికీ దానిలో కొంత కుదించారు. చివరకు కొన్నిరకాల పంటలను చూసి బాగున్నాయంటూ బృంద సభ్యులు కామెంట్ చేశారు. కేంద్ర బృందం తీరును చూసిన రైతులు, అధికారులు విస్మయానికి గురయ్యారు. చీరాల మండలం బూర్లవారిపాలెంలో మొదలైన పర్యటన ఒంగోలులో అధికారులతో నిర్వహించిన సమీక్షతో ముగిసింది. కేంద్ర ఆంతరంగిక సంయుక్త కార్యదర్శి శంభుసింగ్ నేతృత్వంలో ఆర్పీ సింగ్, ఎం రమేష్కుమార్లు బృందం చీరాల, పర్చూరు, కారంచేడు, ఇంకొల్లు ప్రాంతాల్లో పర్యటించింది. చీరాల మండలం బూర్లవారిపాలెం సాయినగర్ కాలనీలో బండి ఓబులేసు అనే చేనేత కార్మికుడి ఇంటిని సందర్శించింది. మగ్గం గుంటలో నీరు నిలిచి ఉండటాన్ని గమనించింది. ఆ కార్మికుడి పేరు రాసుకొని అక్కడ నుంచి నిష్ర్కమించింది. వాస్తవానికి చీరాలలోని తోటవారిపాలెం చేనేతకాలనీ, మార్కండేయ కాలనీల్లో చేనేత గుంటల్లో నీరు నిలిచిపోయాయి. వాటివైపు బృందం కన్నెత్తి కూడా చూడలేదు. ఆ తరువాత చీరాల - కారంచేడు రోడ్డులో ముంపునకు గురైన పంట పొలాలను పరిశీలించింది. భారీ వర్షాలకు చీరాల తరచుగా ముంపునకు గురికావడానికి కారణమైన రొంపేరు డ్రైనేజీని సందర్శించింది. కాలువ నుంచి సముద్రంలోకి వరద నీరు వెళ్లాల్సి ఉండగా, సముద్రం నుంచి పోటు వచ్చి ముంపునకు దారితీస్తోందని స్థానికులు కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. వారు చెప్పిందంతా విని అక్కడ నుంచి బృందం కారంచేడు బాట పట్టింది. కారంచేడులో భారీ వర్షాలకు వరి పూర్తిగా దెబ్బతింది. దాంతో రైతులు తిరిగి నాట్లు వేసుకున్నారు. దానిని చూసిన శంభుసింగ్ ‘విత్తే దశలో ఉందికదా.. మళ్లీ నాట్లు వేసుకోవచ్చు కదా’ అని ఉచిత సలహా ఇవ్వడంతో పక్కనే ఉన్న అధికారులు, రైతులు విస్తుపోయారు. కారంచేడులోని కొమ్మమూరు కాలువ గండ్లను కేంద్ర బృందం పరిశీలించింది. అక్కడ నుంచి పర్చూరు మండలంలో పర్యటించింది. పోతుకట్ల వద్ద చెరువుకు పడిన గండ్లు పరిశీలించింది. తిమ్మరాజుపాలెంలో భారీ వర్షాలకు పత్తి దెబ్బతినడంతో రైతులు వాటిని తీసివేశారు. కొన్ని మొక్కలు అలాగే ఉంచేశారు. అవి పచ్చగా ఉండటంతో పత్తి పచ్చగా బాగుంది కదా అని మరోమారు వ్యాఖ్యానించారు. అక్కడ నుంచి ఇంకొల్లు మండలంలో కేంద్ర బృందం పర్యటించింది. కోతకు గురైన వాగు, వంకాయలపాడులో మిర్చి పొలాలను పరిశీలించింది. అనంతరం ఒంగోలుకు సమీపంలోని చెరువుకొమ్ముపాలెం చెరువుకట్టను సందర్శించి , నేరుగా ప్రకాశం భవనంలోని సీపీఓ కాన్ఫరెన్స్ హాలుకు చేరుకొంది. భారీ వర్షాల వల్ల జరిగిన నష్టంపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించింది. సీపీఓ కాన్ఫరెన్స్ హాలులో పవర్ పాయింట్ ప్రజంటేషన్లో నష్టం వివరాలను తెలుసుకుంది. బలరాం కాలనీవైపు కన్నెత్తి చూడలేదు ఒంగోలులో భారీ వర్షాలకు ముంపునకు గురయ్యే కాలనీల్లో బలరాం కాలనీ ముందు వరుసలో ఉంటుంది. ఆ కాలనీని కేంద్ర బృందం సందర్శిస్తుందని షెడ్యూల్లో ప్రకటించారు. బృందం వస్తుండటంతో కార్పొరేషన్ అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా రోడ్డుపక్కన బ్లీచింగ్ చల్లించారు. ముంపునకు కారణమయ్యే పోతురాజు కాలువ బ్రిడ్జి వద్ద చిన్న బ్యానర్ కట్టారు. కొంతమంది అధికారులతోపాటు మీడియా కూడా బృందం కోసం ఎదురు చూసింది. అయితే కేంద్ర బృందం అటువైపు కన్నెత్తి చూడకపోవడం విమర్శలకు తావిచ్చింది. -
పొంచి ఉన్న వాయు‘గండం’
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : జిల్లాకు వాయు‘గండం’ పొంచి ఉంది. వాయుగుండం తీవ్ర వాయుగుండంగా మారి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని శుక్రవారం సాయంత్రం హెచ్చరికలు రావడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. చెన్నై-నాగపట్నం మధ్య శనివారం సాయంత్రం తీరం దాటుతుందని, ఆ సమయంలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ప్రభావం కారణంగా శనివారం ఉదయం నుంచి వాతారణంలో మార్పు కనిపించింది. ఆకాశం మేఘావృతమై చల్లని గాలులు వీచాయి. మధ్యాహ్నం పన్నెండు గంటల ప్రాంతంలో నాగపట్నం వద్ద వాయుగుండం తీరం దాటింది. దీంతో కొన్ని ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. సాయంత్రానికి వాతావరణంలో ఒక్కసారిగా మార్పు వచ్చింది. ఒంగోలుతో పాటు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రానున్న పన్నెండు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని జిల్లాకు హెచ్చరికలు రావడంతో తీర ప్రాంత మండలాల్లోని అధికారులను జిల్లా యంత్రాం గం అప్రమత్తం చేసింది. మండలాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తూ పరిస్థితులను బట్టి నిర్ణయాలు తీసుకోవాలని కలెక్టర్ జీఎస్‌ఆర్‌ఆర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. -
విద్యా రంగ అభివృద్ధికి పీడీఎస్‌యూ పోరాటం
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: విద్యా రంగాన్ని సామ్రాజ్యవాద శక్తుల నుంచి విముక్తి చేసేందుకు పీడీఎస్‌యూ పోరాటాలు నిర్వహించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర నాయకుడు ఆర్ హరిబాబు పిలుపునిచ్చారు. 1974లో ఏర్పడిన పీడీఎస్‌యూ రాజీలేని పోరాటాలు నిర్వహిస్తూ విద్యార్థులకు వెన్నుదన్నుగా నిలుస్తోందని, అదే పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కోరారు. స్థానిక జిల్లా కార్యాలయంలో ఆదివారం ప్రారంభమైన పీడీఎస్‌యూ రాజకీయ తరగతులకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. జార్జిరెడ్డి, జంపాల, శ్రీహరి, చేరాలు, శంకర్ వంటి విద్యార్థి నాయకుల త్యాగాలతో పీడీఎస్‌యూ ఎరుపెక్కిందన్నారు. పీడీఎస్‌యూ ఆవిర్భావం నుంచే అనేక రకాల నిర్బంధాలు, దాడులను ఎదుర్కొని ముందుకు సాగిన విషయాన్ని గుర్తు చేశారు. ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు మురళీ ‘పరిణామవాదం’ అంశంపై ప్రసంగిస్తూ మానవ నాగరికత శ్రమ జీవుల కృషి ఫలితమేనన్నారు. ప్రగతిశీల విద్యార్థులు శాస్త్రీయ విజ్ఞానంతో ఆలోచించి ముందుకు సాగాలని సూచించారు. పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి బీ పద్మ ‘పాశ్చాత్య విష సంస్కృతి-విద్యార్థుల కర్తవ్యాలు’ అనే అంశంపై ప్రసంగిస్తూ తరతరాలుగా సమాజంలో స్త్రీని రెండో తరగతి పౌరులుగానే చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో పోటీ పడుతున్నా అడుగడుగునా అత్యాచారాలు, దాడులను ఎదుర్కోవలసిన పరిస్థితి నెలకొందన్నారు. మహిళలపై దాడులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాలని కోరారు. తరగతులకు రాజశేఖర్, రమేష్, జాన్ అధ్యక్ష వర్గంగా వ్యవహరించారు. తొలుత పీడీఎస్‌యూ అరుణ పతాకాన్ని జిల్లా కార్యదర్శి ఎల్ రాజశేఖర్ ఆవిష్కరించారు. అరుణోదయ కళాకారులు ఆలపించిన విప్లవ గీతాలు ఆకట్టుకున్నాయి. -
ఆకలి కేకలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : సమైక్యాంధ్ర సమ్మె పేదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం సరఫరా కాకపోవడంతో బయట మార్కెట్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. బియ్యంతో పాటు ఇతర నిత్యావసరాలు ఇళ్లకు చేరాల్సి ఉన్నా వాటి జాడే లేకపోవడంతో పేదల కడుపులు కాలిపోతున్నాయి. ఎన్ని రోజులు సమ్మె ఉంటుందో స్పష్టంగా తెలియకపోవడంతో బయట మార్కెట్లో వందల రూపాయలు వెచ్చించి బియ్యం, ఇతర నిత్యావసరాలు కొనుగోలు చేయలేక పస్తులతో బతుకు బండి లాగిస్తున్నారు. రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయకుండా సమైక్యంగా ఉంచాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులంతా నిరవధిక సమ్మెలోకి దిగారు. వారితో పాటు హమాలీలు కూడా సమ్మె బాట పట్టారు. దీంతో సెప్టెంబర్‌కు సంబంధించి చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసరాల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. గోదాముల్లో నిత్యావసరాలు నిండుగా ఉన్నా వాటిని తరలించే హమాలీలు కూడా సమ్మెలో ఉన్నారు. దీంతో జిల్లాలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న 8 లక్షల 55 వేల 439 కుటుంబాలు చౌకధరల దుకాణాల నుంచి బియ్యంతో పాటు నిత్యావసరాలకు దూరమయ్యారు. జిల్లాలో 2100 చౌకధరల దుకాణాలున్నాయి. వాటి పరిధిలో 8 లక్షల 55 వేల 439 తెల్లకార్డుదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా కిలో రూపాయి బియ్యం 12 వేల టన్నులు సరఫరా చేస్తారు. ప్రస్తుతం పౌరసరఫరాల సంస్థ గోడౌన్లో 9 వేల టన్నుల బియ్యం సిద్ధంగా ఉన్నాయి. చౌకధరల దుకాణాదారులంతా నిత్యావసరాలకు సంబంధించిన డీడీలు తీసి సిద్ధంగా ఉంచుకున్నారు. గోడౌన్ నుంచి ఎంఎల్ఎస్ పాయింట్లకు బియ్యం, ఇతర సరుకులు తరలించేవారే కరువయ్యారు. సకలం సమ్మెలో ఉండటంతో సంబంధిత అధికారులు సైతం ఏమి చేయాలో పాలుపోక చేతులెత్తేశారు. ఈ నెల 15వ తేదీ నాటికి నిత్యావసరాలు పూర్తిగా పంపిణీ చేయాల్సి ఉన్నా పౌరసరఫరాల సంస్థ గోడౌన్‌కు వేసిన తాళం వేసినట్లే ఉంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకంపై కూడా సమ్మె ప్రభావం చూపుతోంది. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నిరవధిక సమ్మెకు దిగారు. దీంతో అనేక పాఠశాలలు మూతపడ్డాయి. అమృత హస్తం పేరుతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరించారు. పథకం ప్రారంభించిన సమయంలో అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం సరఫరా కాకపోవడంతో కొంతమంది కార్యకర్తలు ఇళ్ల నుంచి బియ్యం తెచ్చి కొన్ని రోజులు నిర్వహించారు. ఆ తరువాత కూడా ఇదే పరిస్థితి ఉండటంతో వారు చేతులెత్తేశారు. అదే సమయంలో సమైక్యాంధ్ర సాధన కోసం ఉద్యోగులంతా నిరవధిక సమ్మెకు దిగడంతో అంగన్వాడీ కేంద్రాల్లో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయినట్లయింది. ‘అమ్మహస్తం’కు అవస్థలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమ్మహస్తం పథకానికి అవస్థలు వచ్చిపడ్డాయి. 185 రూపాయలకే 9 రకాల నిత్యావసరాలు చౌకధరల దుకాణాల నుంచి పంపిణీ ప్రక్రియను అట్టహాసంగా ప్రారంభించింది. అమ్మహస్తం ద్వారా అందించే నిత్యావసరాలు నాసిరకంగా ఉన్నా కొన్ని వర్గాలకు చెందినవారు వాటిని వినియోగించుకుంటూనే ఉన్నారు. నిరవధిక సమ్మె ప్రభావం అమ్మహస్తంపై పడింది. నేటి నుంచి సరఫరా చేస్తాం : పౌరసరఫరాల సంస్థ డీఎం చౌకధరల దుకాణాల ద్వారా బియ్యం, ఇతర నిత్యావసరాలు ఈ నెల 8వ తేదీ నుంచి సరఫరా చేస్తామని పౌరసరఫరాల సంస్థ డీఎం ఉదయభాస్కర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పేదలకు అందించే బియ్యం సరఫరా నిలిచిపోయిన విషయాన్ని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకుల దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారన్నారు. ఆదివారం నుంచి నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలగకుండా సిబ్బంది పాల్గొనేలా చూస్తామని ఉదయభాస్కర్ వివరించారు.