ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజాదర్బార్ ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా కలెక్టర్ విజయకుమార్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అర్జీలు రాసేందుకు ప్రభుత్వ సిబ్బందిని నియమించడమేగాకుండా వాటిని అక్కడికక్కడ విచారించేందుకు వీలుగా అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారుల స్థాయిలో పరిష్కారం కాని వాటిని నేరుగా తన వద్దకు తీసుకొచ్చే విధంగా రూపకల్పన చేశారు. అందరి సమక్షంలో సంబంధిత సమస్య గురించి కింది వరుసలో కూర్చున్న అధికారులను మైక్ ద్వారా మాట్లాడిస్తూ బహిరంగంగా చెప్పించడంతో ప్రజలు కూడా వాటి స్థితిగతులను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.
గతంలో ఎన్నడూ లేనివిధంగా సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఈ విధానంతో ప్రజలు కూడా సమస్య స్థితిగతిని సావధానంగా తెలుసుకుని ముందుకు కదులుతున్నారు. గతంలో గుంపులు గుంపులుగా ప్రజలు అర్జీలు చేతపట్టుకొని వచ్చేవారు. కొన్నిసార్లు గందరగోళంగా ఉండేది. ఈ సారి మాత్రం అలాంటి వాతావరణం కనిపించలేదు. ఒకరి తర్వాత ఒకరి అర్జీని కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్‌లు స్వీకరించారు.
హెల్ప్ డెస్క్‌తో తీరిన రాత కష్టాలు
ప్రజాదర్బార్ కోసం ప్రకాశం భవనంలోకి ప్రజలు అడుగు పెట్టగానే కుడివైపు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సమస్యలతో బాధపడుతున్నవారు ఆ సమస్యను అధికారులకు ఎలా తెలియజేయాలో తెలియక అక్కడే ఉన్న ప్రైవేట్ రైటర్లను ఆశ్రయించేవారు. వారు ఒక్కో అర్జీదారుడి నుంచి 10 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు.
అంతేగాకుండా సంబంధిత అధికారి తనకు బాగా పరిచయమని, తాను చెబితే మీ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికి 200 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌తో ప్రైవేట్ రైటర్లు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్డ్ డెస్క్‌లో సిబ్బంది ప్రజలకు అర్జీలు రాసే పనిలోనే నిమగ్నమయ్యారు.
టెన్ టేబుల్స్
హెల్ప్ డెస్క్‌లో అర్జీలు రాయించుకున్న ప్రజలు సమీపంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ అర్జీపై నంబర్ వేస్తారు. ప్రత్యేకంగా శాఖల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్దకు నంబర్ వేసి పంపించే ప్రక్రియ చేపట్టారు. టేబుల్-1లో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, కార్మిక, ఎక్సైజ్, దేవాదాయ, రిజిస్ట్రార్, ట్రెజరీ, అటవీ, డీపీఆర్‌ఓ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్స్, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులను ఉంచారు. టేబుల్-2లో వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానశాఖ, జిల్లా సహకార సంస్థ, ఏపీఎస్‌ఐడీసీ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఉంచారు. టేబుల్-3లో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, ఐటీడీఏ, మహిళా శిశు సంక్షేమశాఖ, ఎల్‌డీఎం, భూగర్భ జలవనరుల శాఖ, నాబార్డు, పీడీసీసీ బ్యాంకులకు చెందిన అధికారులను ఉంచారు.
టేబుల్-4లో డీఆర్‌డీఏ, డ్వామా, హౌసింగ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి, సీపీఓ శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-5లో విద్యాశాఖ, గురుకుల పాఠశాలలు, రాజీవ్ విద్యామిషన్, వయోజన విద్యాశాఖ, ఆర్‌ఐఓ, జిల్లా గ్రంథాలయం, జిల్లా క్రీడాభివృద్ధి అధికారులను ఉంచారు. టేబుల్-6లో ఆర్‌అండ్‌బీ, ట్రాన్స్‌కో, ప్రాజెక్ట్స్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఉంచారు. టేబుల్-7లో జిల్లా పరిశ్రమల కేంద్రం, చేనేత జౌళిశాఖ, మార్కెటింగ్, మైన్స్, స్టెప్, ఖాదీ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-8లో డీఎంహెచ్‌ఓ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వైద్య విధాన పరిషత్, రిమ్స్, రెడ్‌క్రాస్‌లకు చెందిన వారిని ఉంచారు. టేబుల్-9లో మెప్మా, మునిసిపల్ కమిషనర్‌లను ఉంచారు. టేబుల్-10లో జిల్లాపరిషత్, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్‌టీఓ, ఆర్టీసీ అధికారులను ఉంచారు.
ప్రజల సాక్షిగా ప్రజాదర్బార్
Published Tue, Dec 31 2013 3:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:07 AM