yakub naik
-
భూమి ధర చెల్లిస్తాం
తోకపల్లె(పెద్దారవీడు) : పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల కోసం పునరావాస స్థలాల సేకరణ అంశంపై వై.పాలెం ఎమ్మెల్యే పాలపర్తి డేవిడ్‌రాజు, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్‌లు గురువారం పరిశీలించారు. తోకపల్లె గ్రామస్తులు మాట్లాడుతూ పునరావాసానికి ఎంపిక చేసిన స్థలాలను, పొలాలను వదిలివేయూలని జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకుని వచ్చారు. దీనిపై అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం 12 ఎకరాలు తీసుకోగా.. వారు కోర్టుకు వెళ్లారని వివరించారు. జేసీ మాట్లాడుతూ రెవెన్యూ రికార్డుల్లో అసైన్మెంట్ భూములుగా గుర్తిస్తే మరో చోట పొలాలు ఇస్తామని..సెటిల్మెంట్ భూమి అయితే ప్రస్తుత ధర ప్రకారం నగదు చెల్లిస్తామన్నారు. సుంకేసుల గ్రామ ఎస్సీలకు, గుండంచర్ల గ్రామానికి చెందిన నిర్వాసితులకు గృహాలు నిర్మించేందుకు ప్లాన్‌ను తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్సీ, బీసీ జనరల్, ముస్లింలకు వేర్వేరుగా గృహాలను నిర్మించాలని.. మసీదు, చర్చి, దేవాలయాలు వారి ఇళ్ల వద్దే ఉండేలా ప్రణాళిక రూపొందించాలన్నారు. ఈ నెలాఖరు లోపు పట్టాలను మంజూరు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే డేవిడ్‌రాజు మాట్లాడుతూ ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరారు. ముఖ్యంగా పాఠశాలలుండాలన్నారు. -
నూరుశాతం ఆధార్‌తో అనుసంధానం చేయాలి
ఒంగోలు టౌన్ : జిల్లాలోని పట్టాదారు పాస్ పుస్తకాలను రెండు మూడు రోజుల్లో నూరుశాతం ఆధార్‌తో అనుసంధానం చేయాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ఆదేశించారు. గురువారం ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో ఒంగోలు డివిజన్ పరిధిలోని తహశీల్దార్లు, సర్వేయర్లతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పట్టాదారు పాస్ పుస్తకాలను ఆధార్‌తో అనుసంధానం చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే తహశీల్దార్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇకనుంచి ఈ-పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు. ఎక్కడైనా మ్యాన్యువల్ పట్టాదారు పాస్ పుస్తకాలు ఉంటే వెంటనే వాటిని ఈ-పట్టాదారు పాస్ పుస్తకాలుగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. కొత్తపట్నం, చినగంజాం మండలాల్లో గ్రామానికి ఒకటి చొప్పున 1-బీలు ఉండాల్సి ఉండగా, రెండు మూడు ఉన్నాయని, వాటిని సమగ్రంగా విచారించాలని ఆదేశించారు. కొంతమంది రైతులు గ్రామాల్లో ఉండకపోవడంతో ఆధార్ అనుసంధానంలో జాప్యం జరుగుతోందని జాయింట్ కలెక్టర్ దృష్టికి తహశీల్దార్లు తీసుకురాగా వారంతా వచ్చేవిధంగా చొరవచూపాలని సూచించారు. సర్వే నంబర్లు కనిపించకుండా ఉన్నా వాటిపై కూడా విచారించాలన్నారు. కౌలు రైతులందరికీ రుణ అర్హత కార్డులు అందించాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. ప్రస్తుతం వ్యవసాయ సీజన్ ప్రారంభమైనందున సకాలంలో రుణ అర్హత కార్డులు అందించడం వల్ల కొంతమేర కౌలు రైతులకు ప్రయోజనం కలుగుతుందన్నారు. మండలాల వారీగా కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు లక్ష్యాలు కేటాయించామని, వాటి ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అక్టోబర్ మొదటి వారంలో పండుగలు ఉన్నందు న వాటికి ముందుగానే చౌకధరల దుకాణాల నుంచి నిత్యావసరాలు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. డీలర్లు సకాలంలో డీడీలు చెల్లించే విధంగా చూడటంతో పాటు సరుకు రవా ణా, ప్రజలకు అందడంలో జాప్యం జరగకుండా చూడాలన్నారు. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బియ్యం కూడా పాఠశాలలకు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్‌గౌడ్, నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ డీఐఓ మోహన్‌కృష్ణ, ఒంగోలు ఆర్డీఓ ఎంఎస్ మురళి పాల్గొన్నారు. -
భూసేకరణ కసరత్తు
సాక్షి, ఒంగోలు: అవశేషాంధ్ర పునర్నిర్మాణ ప్రతిపాదనలపై భూసేకరణ కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా జిల్లాలో పలుచోట్ల అభివృద్ధి నిర్మాణాలపై ప్రభుత్వం ప్రతిపాదనలు తయారుచేసింది. కలెక్టర్‌కు అందిన ఆదేశాల మేరకు అవసరమైన భూములు సేకరించేందుకు రెవెన్యూ అధికారులు, సిబ్బంది మండలాల వైపు దృష్టి సారించారు. ఇప్పటికే ఈ విషయాలపై కలెక్టర్ విజయ్‌కుమార్, జేసీ యాకూబ్‌నాయక్, డీఆర్వో గంగాధర్ గౌడ్ పలుమార్లు సమీక్షించారు. అభివృద్ధి ప్రతిపాదనలెలా ఉన్నా, ముందస్తు జాగ్రత్తగా జిల్లాలో భూముల గుర్తింపు చేపట్టి నివేదిక సిద్ధం చేసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. తాజాగా, కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుపై ప్రభుత్వం అందుబాటులో ఉన్న భూముల వివరాలను రెండ్రోజుల కిందట్నే కోరింది. సెంట్రల్ యూనివర్శిటీ అభివృద్ధి చేయనున్న విద్యాసంస్థలకు మొత్తం 1100 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. వాటి ల్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)కి వంద ఎకరాలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)కు 200 ఎకరాలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్)కు మరో 200 ఎకరాలు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఏర్పాటుకు 300 ఎకరాలు అవసరం కానుంది. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)కు 300 ఎకరాల స్థలం అవసరం. అయితే, మండలాల్లోని గ్రామాల వారీగా భూసేకరణ, మౌలిక సదుపాయాల పరిస్థితి, జనసంబంధాల అందుబాటు తదితర అంశాలపై జిల్లా అధికారులు స్పష్టమైన నివేదిక తయారుచేసి పంపాల్సి ఉంది. ఇక్కడ్నుంచి సమర్పించే నివేదికల్లోని వనరుల అంశాలపై ఎటువంటి కేంద్ర విద్యాసంస్థ జిల్లాకొస్తుందనేది తేలనుంది. పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు.. అభివృద్ధి విస్తరణలో భాగంగా జిల్లాలో పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ప్రతిపాదనలు చేశారు. కనిగిరి నియోజకవర్గం, సీఎస్‌పురం మండలంలో ‘నింజా’ (నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యాన్యుఫాక్చరింగ్ జోన్) ఏర్పాటుకు 7,590 ఎకరాల భూమి అవసరమని తేల్చారు. అదేవిధంగా విజయవాడ నుంచి చెన్నై వరకు కోస్టల్ కారిడార్ ప్రతిపాదనపై ఇప్పటికే భూముల సేకరణ మొదలైంది. ఉలవపాడు మండలం రామాయపట్నంలో ఓడరేవు నిర్మాణానికి 2,135 ఎకరాలు అవసరం కాగా, కొత్తపట్నం ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సుమారు 2,293 ఎకరాల స్థలం కావాలంటూ కేంద్ర ప్రతిపాదనలపై ఇప్పటికే పరిశీలనా బృందం కూడా జిల్లాకొచ్చి వెళ్లింది. కొత్తపట్నం మండలంలోని ఆలూరు, అల్లూరు, పాదర్తి గ్రామాల్లో ఎయిర్‌పోర్టు కోసం భూసేకరణ పనులు జరుగుతున్నాయి. భూ వివరాలపై నివేదిక సిద్ధం: జిల్లాలో ఇప్పటి వరకు ఏడు విడతలుగా 3,10,779 ఎకరాల అసైన్డ్ భూములను 1,62,807 మంది లబ్ధిదారులకు పంపిణీ చే శారు. ఇంకా జిల్లా వ్యాప్తంగా అసైన్డ్, ప్రభుత్వ భూముల గుర్తింపునకు సంబంధించి రెవెన్యూ ఆర్ఐ, వీఆర్వో, వీఆర్ఏలు క్షేత్రస్థాయి పరిశీలన చేస్తున్నారు. ఇప్పటి వరకు అనాధీన భూమి 41,308 ఎకరాలు, బంజరు భూములు 20,445 ఎకరాలు అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. వాగు, పోరంబోకు, చెరువు భూములు 2,40,629 ఎకరాలున్నట్లు తేల్చగా.. ప్రయివేటు వ్యక్తుల ఆధీనంలో ఉన్న భూములను కూడా సత్వరమే స్వాధీనం చేసుకునేందుకు నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం సాయంత్రం కమిషనర్లు, తహసీల్దార్లతో ప్రకాశం భవనం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ జరగనున్న మున్సిపాలిటీల ఎన్నికల విధులకు 1313 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు. మార్కాపురం మున్సిపాలిటీలో 49పోలింగ్ కేంద్రాలకు 294 మంది, చీరాలలో 66 పోలింగ్ కేంద్రాలకు 238 మందిని, గిద్దలూరు నగర పంచాయతీలో 27 పోలింగ్ కేంద్రాలకు 101 మంది, కనిగిరిలో 31 పోలింగ్ కేంద్రాలకు 186 మంది, అద్దంకిలో 25 పోలింగ్ కేంద్రాలకు 150 మంది, చీమకుర్తి నగర పంచాయతీలో 21 పోలింగ్ కేంద్రాలకు 126 మంది సిబ్బందిని నియమించినట్లు వివరించారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి ఈనెల 15వ తేదీలోపు విధుల ఉత్తర్వులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను సేకరించి భద్రపరచుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సాక్షిగా ప్రజాదర్బార్
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రకాశం భవనంలోని ఓపెన్ ఆడిటోరియంలో నిర్వహించే ప్రజాదర్బార్ ప్రజలకు మరింత ఉపయోగపడే విధంగా కలెక్టర్ విజయకుమార్ పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. అర్జీలు రాసేందుకు ప్రభుత్వ సిబ్బందిని నియమించడమేగాకుండా వాటిని అక్కడికక్కడ విచారించేందుకు వీలుగా అధికారుల బృందాలను ఏర్పాటు చేశారు. సంబంధిత అధికారుల స్థాయిలో పరిష్కారం కాని వాటిని నేరుగా తన వద్దకు తీసుకొచ్చే విధంగా రూపకల్పన చేశారు. అందరి సమక్షంలో సంబంధిత సమస్య గురించి కింది వరుసలో కూర్చున్న అధికారులను మైక్ ద్వారా మాట్లాడిస్తూ బహిరంగంగా చెప్పించడంతో ప్రజలు కూడా వాటి స్థితిగతులను తెలుసుకునే వెసులుబాటు కల్పించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా సోమవారం నిర్వహించిన ప్రజాదర్బార్‌లో ఈ విధానంతో ప్రజలు కూడా సమస్య స్థితిగతిని సావధానంగా తెలుసుకుని ముందుకు కదులుతున్నారు. గతంలో గుంపులు గుంపులుగా ప్రజలు అర్జీలు చేతపట్టుకొని వచ్చేవారు. కొన్నిసార్లు గందరగోళంగా ఉండేది. ఈ సారి మాత్రం అలాంటి వాతావరణం కనిపించలేదు. ఒకరి తర్వాత ఒకరి అర్జీని కలెక్టర్ విజయకుమార్, జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్‌లు స్వీకరించారు. హెల్ప్ డెస్క్‌తో తీరిన రాత కష్టాలు ప్రజాదర్బార్ కోసం ప్రకాశం భవనంలోకి ప్రజలు అడుగు పెట్టగానే కుడివైపు హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. సమస్యలతో బాధపడుతున్నవారు ఆ సమస్యను అధికారులకు ఎలా తెలియజేయాలో తెలియక అక్కడే ఉన్న ప్రైవేట్ రైటర్లను ఆశ్రయించేవారు. వారు ఒక్కో అర్జీదారుడి నుంచి 10 నుంచి 30 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. అంతేగాకుండా సంబంధిత అధికారి తనకు బాగా పరిచయమని, తాను చెబితే మీ సమస్య పరిష్కారం అవుతుందని నమ్మబలికి 200 నుంచి 500 రూపాయల వరకు వసూలు చేసుకోవడం ఆనవాయితీగా మారింది. తాజాగా ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌తో ప్రైవేట్ రైటర్లు అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు హెల్డ్ డెస్క్‌లో సిబ్బంది ప్రజలకు అర్జీలు రాసే పనిలోనే నిమగ్నమయ్యారు. టెన్ టేబుల్స్ హెల్ప్ డెస్క్‌లో అర్జీలు రాయించుకున్న ప్రజలు సమీపంలోని కౌంటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ ఆ అర్జీపై నంబర్ వేస్తారు. ప్రత్యేకంగా శాఖల వారీగా ఏర్పాటు చేసిన టేబుల్స్ వద్దకు నంబర్ వేసి పంపించే ప్రక్రియ చేపట్టారు. టేబుల్-1లో పోలీసు, రెవెన్యూ, పౌరసరఫరాలు, కార్మిక, ఎక్సైజ్, దేవాదాయ, రిజిస్ట్రార్, ట్రెజరీ, అటవీ, డీపీఆర్ఓ, భూసేకరణ స్పెషల్ కలెక్టర్, సర్వే అండ్ ల్యాండ్స్, జిల్లా సైనిక సంక్షేమశాఖ అధికారులను ఉంచారు. టేబుల్-2లో వ్యవసాయశాఖ, పశుసంవర్థకశాఖ, మత్స్యశాఖ, ఉద్యానశాఖ, జిల్లా సహకార సంస్థ, ఏపీఎస్ఐడీసీ, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఉంచారు. టేబుల్-3లో ఎస్సీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్, మైనార్టీ కార్పొరేషన్, సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, గిరిజన సంక్షేమశాఖ, వికలాంగుల సంక్షేమశాఖ, ఐటీడీఏ, మహిళా శిశు సంక్షేమశాఖ, ఎల్డీఎం, భూగర్భ జలవనరుల శాఖ, నాబార్డు, పీడీసీసీ బ్యాంకులకు చెందిన అధికారులను ఉంచారు. టేబుల్-4లో డీఆర్డీఏ, డ్వామా, హౌసింగ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి, సీపీఓ శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-5లో విద్యాశాఖ, గురుకుల పాఠశాలలు, రాజీవ్ విద్యామిషన్, వయోజన విద్యాశాఖ, ఆర్ఐఓ, జిల్లా గ్రంథాలయం, జిల్లా క్రీడాభివృద్ధి అధికారులను ఉంచారు. టేబుల్-6లో ఆర్అండ్బీ, ట్రాన్స్‌కో, ప్రాజెక్ట్స్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఉంచారు. టేబుల్-7లో జిల్లా పరిశ్రమల కేంద్రం, చేనేత జౌళిశాఖ, మార్కెటింగ్, మైన్స్, స్టెప్, ఖాదీ గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులను ఉంచారు. టేబుల్-8లో డీఎంహెచ్ఓ, రాజీవ్ ఆరోగ్యశ్రీ, వైద్య విధాన పరిషత్, రిమ్స్, రెడ్‌క్రాస్‌లకు చెందిన వారిని ఉంచారు. టేబుల్-9లో మెప్మా, మునిసిపల్ కమిషనర్లను ఉంచారు. టేబుల్-10లో జిల్లాపరిషత్, జిల్లా పంచాయతీ అధికారి, ఆర్టీఓ, ఆర్టీసీ అధికారులను ఉంచారు. -
కచ్చితమైన నిరక్షరాస్యుల నివేదిక అందించాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో నిరక్షరాస్యులకు సంబంధించి కచ్చితమైన నివేదిక అందించాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. వయోజన విద్యాశాఖ అధికారుల గణాంకాలకు, ఇందిరక్రాంతి పథం సభ్యుల సర్వే నివేదికలకు వ్యత్యాసాలున్నాయన్నారు. వాటిని సవరించి కచ్చితమైన నివేదిక ఇవ్వాలన్నారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం అక్షర విజయం కార్యక్రమం అమలుపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాలో 6.22 లక్షల మందిని నిరక్షరాస్యులుగా గుర్తించారని, వారిని అక్షరాస్యులుగా చేసేందుకు 20,970 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం గుర్తించిన నిరక్షరాస్యులతోపాటు డిసెంబర్ నెలాఖరుకు అభ్యాసకులుగా ఉత్సాహం ఉన్నవారిని అందులో తీసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలన్నారు. జిల్లాలో అక్షరాస్యత కేంద్రాలు ప్రారంభం కానిచోట రెండు రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. అధికారులు కుంటిసాకులు చెప్పి ఇతరులపై నిందలు మోపడం మానుకొని కార్యాచరణకు పూనుకోవాలన్నారు. వలసలు వెళ్లి వచ్చిన వారి కోసం ప్రత్యేక కేంద్రాలు... పనుల కోసం వలసలు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. వలసలు వెళ్లివచ్చిన వారికోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వలంటీర్ల కొరత ఉన్నచోట ఇతర శాఖల నుంచి తీసుకోవాలన్నారు. యర్రగొండపాలెం, బల్లికురవ, త్రిపురాంతకం మండలాల్లో అధిక సంఖ్యలో నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. ఆ మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అక్షరాస్యత కేంద్రాలకు పలకలు, పుస్తకాలు, పెన్సిళ్లు, రోల్ బ్లాక్ బోర్డులు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అభ్యాసకులకు పలకలు, పుస్తకాలు అందించేందుకు అవసరమైనచోట దాతల సహకారం తీసుకోవాలన్నారు. రోజూ అక్షరాస్యత కేంద్రాలను అధికారులు తప్పకుండా సందర్శించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్, వయోజన విద్య ఉపసంచాలకుడు వీరభద్రయ్య, ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య, డీఆర్డీఏ పీడీ పద్మజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, డ్వామా పీడీ కే పోలప్ప, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ విజయలక్ష్మి, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు. -
నలుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్లు బదిలీ
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలోని నలుగురు ఫుడ్ ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. వారిని తహసీల్దార్ కార్యాలయాల్లో సీనియర్ అసిస్టెంట్లు(ఎలక్షన్)గా నియమించారు. ఒంగోలుకు చెందిన ఫుడ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్‌ను చీమకుర్తి తహసీల్దార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్‌గా, ఒంగోలుకు చెందిన మరో ఫుడ్ ఇన్స్పెక్టర్ కృష్ణమోహన్‌ను కలెక్టరేట్లో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. పొదిలి ఫుడ్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావును కనిగిరి సీనియర్ అసిస్టెంట్‌గా, గిద్దలూరు ఫుడ్ ఇన్స్పెక్టర్ దక్షిణామూర్తిని అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా నియమించారు. ఐదుగురు వీఆర్ఓలకు పోస్టింగ్‌లు: జిల్లాలో సెలవులో ఉన్న ఐదుగురు వీఆర్వోలకు పోస్టింగ్‌లు కేటాయించారు. మద్దిపాడు మండలంలో విధులు నిర్వర్తిస్తూ సెలవులో ఉన్న కే గురుబాబును సీఎస్‌పురం మండలానికి, గుడ్లూరు మండలానికి చెందిన చినకొండమ్మను టంగుటూరు మండలానికి, కురిచేడు మండలానికి చెందిన ఎం ప్రసాద్‌ను పొన్నలూరు మండలానికి, సీఎస్‌పురం మండలానికి చెందిన సత్యనారాయణను కొత్తపట్నం మండలానికి, మార్కాపురం మండలానికి చెందిన హరినారాయణను కొనకనమిట్ల మండలానికి నియమిస్తూ పోస్టింగ్‌లు ఇచ్చారు. -
వరికి మద్దతు ధర రూ.1,310
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరిలో సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1310, గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1,345 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం అంగీకారం తెలిపింది. ఈ ఏడాది అంచనాలకు మించి ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నందున అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కూడా సన్నద్ధమైంది. మంగళవారం జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ తన చాంబర్లో వరి మద్దతు ధరపై అధికారులు, రైస్‌మిల్లర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో టార్పాలిన్ పట్టలు సిద్ధంగా ఉన్నాయా, పరికరాలు పనిచేస్తున్నాయో లేదో ఒకసారి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఉదయ్‌భాస్కర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రంగాకుమారి, డీఆర్డీఏ ఏపీడీ నాయక్, మార్కెటింగ్ శాఖ అధికారులతో పాటు ఒంగోలు, కందుకూరు, చీరాల ప్రాంతాలకు చెందిన రైస్‌మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశానికి సమైక్య సెగ కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సమైక్య సెగ తగిలింది. రెవెన్యూ కాన్ఫెడరేషన్ జిల్లా నాయకులు సమావేశాన్ని అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉద్యోగులు దాదాపు రెండు నెలల నుంచి నిరవధికంగా సమ్మె చేపడుతుంటే.. సమావేశాలు నిర్వహించడమేమిటని ఉద్యోగులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం రోడ్డెక్కారని, ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించడం తగదని చెప్పారు. జాయింట్ కలెక్టర్ చాంబర్లో ఉన్న వారందరినీ బయటకు పంపించేయడంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. నిరసన తెలిపిన వారిలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు శెట్టి గోపి, తోటకూర ప్రభాకర్, ఆర్ వాసుదేవరావు, టీ శ్రీనివాసులు, యూ శ్రీనివాసులు, యోగమ్మ, వైవీ సుబ్బారావు, శేషారావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకుడు రవి ఉన్నారు.