మున్సిపల్ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ ఆదేశించారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై శుక్రవారం సాయంత్రం కమిషనర్లు, తహసీల్దార్లతో ప్రకాశం భవనం నుంచి ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 30వ తేదీ జరగనున్న మున్సిపాలిటీల ఎన్నికల విధులకు 1313 మంది సిబ్బందిని నియమించినట్లు తెలిపారు.
మార్కాపురం మున్సిపాలిటీలో 49పోలింగ్ కేంద్రాలకు 294 మంది, చీరాలలో 66 పోలింగ్ కేంద్రాలకు 238 మందిని, గిద్దలూరు నగర పంచాయతీలో 27 పోలింగ్ కేంద్రాలకు 101 మంది, కనిగిరిలో 31 పోలింగ్ కేంద్రాలకు 186 మంది, అద్దంకిలో 25 పోలింగ్ కేంద్రాలకు 150 మంది, చీమకుర్తి నగర పంచాయతీలో 21 పోలింగ్ కేంద్రాలకు 126 మంది సిబ్బందిని నియమించినట్లు వివరించారు.
ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి ఈనెల 15వ తేదీలోపు విధుల ఉత్తర్వులు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలింగ్ ప్రక్రియకు అవసరమైన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లను సేకరించి భద్రపరచుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశించారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, ముఖ్య ప్రణాళికాధికారి పీబీకే మూర్తి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.