ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్ : వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించింది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ లో సాగు చేసిన వరిలో సాధారణ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1310, గ్రేడ్-ఏ రకం ధాన్యానికి క్వింటాకు రూ.1,345 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జిల్లాలో 12 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిల్లా యంత్రాంగం అంగీకారం తెలిపింది. ఈ ఏడాది అంచనాలకు మించి ధాన్యం వచ్చే అవకాశాలు ఉన్నందున అదనపు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు కూడా సన్నద్ధమైంది. మంగళవారం జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ తన చాంబర్‌లో వరి మద్దతు ధరపై అధికారులు, రైస్‌మిల్లర్ల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ.. ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర రైతులకు అందేలా చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏ విధంగా ఉన్నాయి, అందులో టార్పాలిన్ పట్టలు సిద్ధంగా ఉన్నాయా, పరికరాలు పనిచేస్తున్నాయో లేదో ఒకసారి పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఎక్కడా సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా పౌరసరఫరాల సంస్థ మేనేజర్ ఉదయ్‌భాస్కర్, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రంగాకుమారి, డీఆర్‌డీఏ ఏపీడీ నాయక్, మార్కెటింగ్ శాఖ అధికారులతో పాటు ఒంగోలు, కందుకూరు, చీరాల ప్రాంతాలకు చెందిన రైస్‌మిల్లర్ల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశానికి సమైక్య సెగ
కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి సమైక్య సెగ తగిలింది. రెవెన్యూ కాన్ఫెడరేషన్ జిల్లా నాయకులు సమావేశాన్ని అడ్డుకున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉద్యోగులు దాదాపు రెండు నెలల నుంచి నిరవధికంగా సమ్మె చేపడుతుంటే.. సమావేశాలు నిర్వహించడమేమిటని ఉద్యోగులు మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కేఎల్ నరసింహారావు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు. ఉద్యోగులతోపాటు అన్ని వర్గాల ప్రజలు సమైక్యాంధ్ర కోసం రోడ్డెక్కారని, ఈ నేపథ్యంలో అధికారులతో సమావేశం నిర్వహించడం తగదని చెప్పారు. జాయింట్ కలెక్టర్ చాంబర్‌లో ఉన్న వారందరినీ బయటకు పంపించేయడంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. నిరసన తెలిపిన వారిలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు శెట్టి గోపి, తోటకూర ప్రభాకర్, ఆర్ వాసుదేవరావు, టీ శ్రీనివాసులు, యూ శ్రీనివాసులు, యోగమ్మ, వైవీ సుబ్బారావు, శేషారావు, గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం నాయకుడు రవి ఉన్నారు.
వరికి మద్దతు ధర రూ.1,310
Published Wed, Oct 9 2013 6:43 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement