కరువు రైతుకుఊరటేదీ?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: వరుస కరువులతో తల్లడిల్లుతున్న రైతులకు దన్నుగా నిలవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతోంది. గత ఏడాది ఖరీఫ్ పంటలు నష్టపోయిన రైతులకు చెల్లించాల్సిన రూ.108 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ఇప్పటికీ మంజూరు చేయలేదు. ఈ ఏడాదీ వర్షాభావమే రాజ్యమేలుతోంది. జిల్లాలో 58 మండలాల్లో తీవ్ర వర్షాభావం వల్ల పంటలు ఎండిపోయాయి. సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోంది.
జిల్లాలో పశ్చిమ మండలాలపై నైరుతి.. తూర్పు మండలాలపై ఈశాన్య రుతుపవనాల ప్రభావం అధికంగా ఉంటుంది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల వర్షాలు కురవకపోవడంతో పశ్చిమ మండలాల్లో వరుసగా కరువు పరిస్థితులు నెలకొం టున్నాయి. కానీ.. ఈ ఏడాది పశ్చిమ మండలాలతోపాటు తూర్పు మండలాల్లోనూ దుర్భిక్షం నెలకొంది. ఖరీఫ్‌లో 1.86 లక్షల హెక్టార్లలో రైతులు వేరుశె నగ, కంది వంటి పంటలను సాగుచేశారు.
వర్షాభావ పరిస్థితుల వల్ల వేరుశెనగ, కంది పంటలు ఇప్పటికే ఎండిపోయాయి. జిల్లాలో 58 మండలాల్లో వర్షాభావం నెలకొందని.. వాటిని కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఇప్పటికే కలెక్టర్ సిద్ధార్థ్‌జైన్ ప్రభుత్వానికి నివేదిక పంపారు. రుణ మాఫీపై ప్రభుత్వం రోజుకో విధానం.. పూటకో మాట మార్చుతుండడంతో కొత్తగా పంట రుణాలను రైతులకు ఇచ్చేందుకు బ్యాంకర్లు అంగీకరించలేదు. ఫలితంగా 95 శాతం మంది రైతులు వాతావరణ బీమా, పంటల బీమా ప్రీమియం చెల్లించలేకపోయారు. జిల్లాలో కేవలం 2,318 మంది రైతులు మాత్రమే బీమాను చెల్లించగలిగారు.
ప్రీమియం చెల్లించని నేపథ్యంలో వర్షాభావం వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం దక్కదు. ఈ నేపథ్యంలో ఇన్‌పుట్ సబ్సిడీ చెల్లించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ఇదొక పార్శ్వం.. మరో పార్శ్వం ఏమిటంటే గత ఏడాది నష్టపోయిన రైతులకు ఇప్పటికీ ఇన్‌పుట్ సబ్సిడీగానీ బీమా పరిహారంగానీ చెల్లించలేదు.
గత ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావం నెలకొంది. పంటలు పూర్తిగా ఎండిపోయాయి. వీటిని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం 33 మండలాలను కరవు ప్రాంతాలుగా ప్రకటించింది. రూ.108 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయాలని ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపారు. 1.36 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిన వేరుశెనగ రైతులకు రూ.102 కోట్లకుపైగా వాతావరణ బీమా పరిహారం మంజూ రు చేయాల్సి ఉంది.
ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని కెలామిటీ రిలీఫ్ ఫండ్(సీఆర్‌ఎఫ్) నుంచి చెల్లిస్తారు. సీఆర్‌ఎఫ్‌కు కేంద్రం 75 శాతం నిధులు సమకూర్చితే.. రాష్ట్రం 25 శాతం వాటాగా ఇవ్వాలి. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను ఇప్పటిదాకా విడుదల చేయకపోవడంతో కేంద్రం మిన్నుకుండిపోయింది. దుర్భిక్షంతో ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రైతులకు కనీసం గత ఏడాది అందించాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ, బీమా పరిహారాన్ని ఇప్పుడైనా పంపిణీ చేయాలనే డిమాండ్ బలంగా వ్యక్తమవుతోంది.